పెళ్లి చూపులప్పుడు పరిమళను చూశాడు అనంత్.అప్పుడు వారు మాట్లాడుకున్నదేం లేదు. ఇద్దరి కళ్లూ మాట్లాడుకున్నాయి.ఇప్పుడు పెళ్లి జరుగుతోంది. ఇద్దరి మధ్య అడ్డుతెర కట్టారు. అయినా ఆమెను చూడాలని తాపత్రయం కలగటం ఏమిటో తనకే అర్థం కాలేదు. పరిమళ కూడా అలాంటి స్థితిలోనే ఉందా? అనిపించింది అతనికి.ఓసారి తెర కిందకు జారింది!అప్పుడు పరిమళను చూశాడు. అనుమానం వచ్చింది.
ఆమె ముఖంలో ఏమాత్రం సంతోషం కనిపించటం లేదు.మెడలో మూడుముళ్లు వేస్తున్నప్పుడు మరోసారి నిశితంగా చూశాడు. ప్రసన్నభరితంగా లేదు. పరిమళకి ఈ పెళ్లి ఇష్టం లేదా! మరెందుకు పెళ్లి పీటల మీదకు రావటం? అమ్మానాన్నలు బలవంతంగా ఈ వివాహం జరిపిస్తున్నారా? అయినా తను చదువుకుంది. ఆధునిక స్త్రీ. తనకు అంగీకారం లేకుండా మరొకరితో బతుకు పంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఓ జీవితకాలం కలిసి చేయాల్సిన ప్రయాణం కదా!మంత్రాలు వినిపిస్తున్నాయి. ఆమె పూలజడను పైకెత్తి పట్టుకున్నారు. తను ఆలోచనల్లో ఉంటే దృశ్యం రసాభాస అవుతుంది. అయినా ఇదంతా తన అనుమానం కావచ్చును కదా!? అనుకున్నాడు. భజంత్రీలు మోగుతున్నాయి. ఎలా అయితే అలా అవుతుంది. మంచి భార్య దొరకటం అదృష్టం అంటారు. రేపటి నుండి ఎలాంటి స్థితినైనా ఎదుర్కోవాల్సిందే! అనుకుంటూ.. మూడుముళ్లు వేశాడు అనంత్.
పరిమళ ఆలోచనల్లో ఉంది.తనకి లాస్య మాటలు గుర్తుకు వస్తున్నాయి.‘పరీ.. ఇప్పటివరకు నేను చచ్చేంత బిజీగా ఉన్నాను. అందుకనే ఫోన్‌కూడా చేయలేకపోయాను. నేనూ, సుమనా, కీర్తి.. నీ పెళ్లికి వచ్చి అల్లరల్లరి చేయాలనుకున్నాం. కానీ, సారీ.. అందరం ఇక్కడే ఇరుక్కుపోయాం. ఒక్కరం కూడా రాలేకపోతున్నాం.’‘ఏం చేస్తాను. అది నా బ్యాడ్‌లక్ అనుకుంటాను.’‘ఆ విషయం మాట్లాడటానికే ఫోన్ చేశాను. నీది నిజంగానే బ్యాడ్‌లక్ వచ్చు.’‘అదేంటి?’
‘నీ శ్రీవారి పేరేంటి?’
‘అనంత్!’‘నువ్వు అతనితో మాట్లాడావా?’‘ఏ విషయం గురించి?’‘నీకు పెళ్లి చూపులయ్యాయి కదా.. అప్పుడు మీరు విడిగా మాట్లాడుకోలేదా?’‘లేదు లాస్యా?’‘నాన్సెన్స్.. ఈరోజుల్లో ఎవరైనా అలాంటివారు ఉన్నారా? తర్వాతైనా అతను నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడా? మీరు మాట్లాడుకున్నారా?’‘లేదని చెబుతున్నాను కదా. అయినా పెళ్లికి ముందు ఏం మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నంత మాత్రాన ఒకరికొకరు అర్థం అవుతారా?’‘అందుకని తల తాకట్టు పెడుతున్నావా? అసలేం మాట్లాడకుండా పెళ్లి పీటల మీదకు ఎక్కటానికి నువ్వు బి.సి. కాలంనాటి మహిళవా. కనీసం ఇద్దరూ కలిసి ఓ ఈవెనింగ్ చాయ్ తాగటానికి.. గుర్తుంచుకో చాయ్ మాత్రమే! బీర్ తాగటానికి వెళ్లారా అనటం లేదు’‘లాస్యా.. అల్లరి చేయటం ఆపి అసలు విషయంలోకి రా’ అంది పరిమళ.‘అనంత్ అందగాడు. అందుకే నువ్వు పడిపోయావు. నాకు మీ పెళ్లి గురించి చెప్పావు. ఇప్పుడతని ఫొటోని చూశాను.
షాకయ్యాను!’‘ఎందుకు షాకవటం. అనంత్ నీకు తెలుసా? అతని వెనకాల ఏమైనా కథ ఉందా?’‘అవన్నీ తీరిగ్గా చెబుతాను. ముందు ఈ పెళ్లి జరగకుండా చూసే అవకాశం నీకు ఉందా?’‘లాస్యా.. నీ మాటలు వింటుంటే దీని వెనకాల పెద్ద కారణమే ఉండి ఉంటుంది. అది తెలియకుండా, అమ్మానాన్నలను ఎలా ఒప్పించగలను? నువ్వు నా దగ్గరికి వెంటనే ఎలా అయినా రాగలవా!’‘అది కుదరదనే కదా ఈ గోలంతా!’ అంది లాస్య.‘అసలు విషయం చెప్పు లాస్యా!’‘అనంత్ ‘గే’ కావచ్చు!’‘గే నా!’ పరిమళ నిర్ఘాంతపోయి అంది.‘యా! అవన్నీ తర్వాత చెబుతాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో. ముందు పెళ్లి రద్దు అవుతుంది. తర్వాత సంగతి చూద్దాం’‘నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? అప్పుడు మా కుటుంబం పరువు, నా భవిష్యత్తూ ఏమవుతుందో ఆలోచించావా? అయినా అనంత్ ‘గే’ అని ఏ ఆధారంతో చెప్పగలవు?’
‘గే.. కాకుంటే నపుంసకుడు!’‘లాస్యా!’ నెత్తి మీద పిడుగుపడినట్లు, చివరి మాటల్లా ఉన్నాయి.‘నీకు సమయం లేదు. అయినా పర్వాలేదంటే నీ ఇష్టం. నీ జీవితం నీది. ఓ ‘గే’తో లేదా ‘నపుంసకుడి’తో జీవితాంతం బాధలు పడతావా? రెక్కలు విప్పుకొని స్వేచ్ఛగా విహరిస్తావా! నిర్ణయం నీది. ఇప్పటికి నాకు పది మిస్స్డ్ కాల్స్ ఉన్నాయి. బై!’ అని కట్ చేసింది.పరిమళ ఇప్పటివరకు ఇలాంటి కఠినమైన సందర్భాన్ని ఎదుర్కోలేదు. లాస్యతోపాటు తన మిత్రబృందం అల్ట్రా మోడ్రన్ అమ్మాయిలు. సిగరెట్లు తాగుతారు. వైన్ నుండి హాట్‌డ్రింక్స్ తీసుకునేవారున్నారు. ఆడా – మగా సంబంధాల గురించి వారు మాట్లాడుకునే మాటలు వింటే.. పాతతరం వారికి గుండెలు బద్ధలైపోతాయి. వారిలో లిబరల్గా ఉండేది తనే. కొత్తలో బలవంతం చేసేవారు. అప్పుడు స్పష్టంగా చెప్పింది.
‘నేను బెంగళూరు రావటానికి కారణం చదువుకోవటానికి. ఇక్కడికి వచ్చేముందు నాకు చాలామంది చెప్పారు. ఆడపిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని. మా అమ్మానాన్నలు ఒకేమాట చెప్పారు. ‘నీకు చదువా? ప్రేమా? అక్కడ పిల్లల గురించి అనేకం వింటున్నాం. మేం ఆంధ్రాలో ఉండి నువ్వు అక్కడ ఏం చేస్తుంటావో తెలుసుకోలేం. బతుకు నీది. బంధం నీది. దాన్ని చక్కగా మలుచుకుంటావో.. కుక్కలు చింపిన విస్తరిలా చేసుకుంటావో నీ ఇష్టం!’ అన్నారు. అందుకని నన్ను మీరు బలవంతం చేయొద్దు’.‘వ్వావ్.. పరిమళాలు వెదజల్లావ్. ఓకే.. నీ జోలికి మేం రావటం లేదు. కనీసం నీ పెళ్లికైనా పిలుస్తావా?’ అందో అమ్మాయి.
‘నేనూ అదే అడుగుతున్నాను.’‘పరీ.. నేను మగవాళ్లని చేసుకోను. యామే లెస్బియన్’ అంది.మరొకామె.. ‘నేను సింగిల్ మదర్‌గా ఉంటా!’ అంది.
ఆశ్చర్యంగా చూస్తుంటే…‘పరిపరి విధములుగా ఆలోచించకు. ఇవన్నీ ఇప్పుడు చట్టం ఆమోదించినవి’ అన్నారు మరొకరు.అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. లాస్య హాస్యం కోసం ఇదంతా చేయదు. ఏదో ఒక ఆధారం ఉంటుంది. అయినా తను ఎంత సంప్రదాయబద్ధంగా ఉన్నా.. ‘గే’ తో, ‘నపుంసకుడి’తో ఎలా ప్రయాణం చేయగలదు! అలా అని ఇందులో వాస్తవం తెలియకుండా ఎదుటివారిని ఏ రకంగా గాయపరచగలదు!ఎవరి జీవితం వారిదే. అది ఓ రెండు కుటుంబాలతో, సమాజంతో కూడా ముడిపడి ఉంది కదా అనుకుంది. ఎటూ తేల్చుకోలేక మథనపడింది. అప్పుడు తనకు తనే సమాధానం చెప్పుకొంది.
‘అనంత్ నిజంగానే ఆ రెండిటిలో ఏ ఒక్కటి అయినా ఆ ప్రయాణం సాగదు. అతని నుండి విడిపోయే అవకాశాన్ని చట్టమే కల్పించింది. తను ఏ నిర్ణయం తీసుకున్నా బాధే. అందుకని అదేదో నేనే తాత్కాలికంగా అనుభవిస్తాను. ఈ వేదనను రెండు కుటుంబాలకు పంచను’ అనుకుంది.పెళ్లి పీటల మీద కూర్చున్నా ఈ ఆలోచనలు పరిమళని అంటి పెట్టుకునే ఉన్నాయి. తనలోని ఆందోళనను కప్పిపుచ్చటానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆమెకు సాధ్యం కాలేదు.“అమ్మాయీ” అని అమ్మ పిలవటంతో ఆలోచనలకు తెరపడింది.
తిరిగి అదే సందిగ్ధత! శోభనం గురించి చెప్పినప్పుడు ఓ నెల రోజులు వాయిదా వేశాడు అనంత్. ఇంట్లో వారికి అదేమంత పట్టించుకోదగ్గ విషయం అనిపించలేదు. అనంత్‌కి చెందిన ఓ ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. దానికి అతను లీడర్. అది సమయానికి అందించాలి. విజయవంతంగా పూర్తి అయిన అనంత్‌కి ప్రమోషన్లు ఉంటాయి.అతనిప్పుడు ముంబైలో పని చేస్తున్నాడు. అక్కడికి వెళ్లే ముందు పరిమళను కలుసుకున్నాడు. ఇద్దరి మధ్య కొంతసేపు మాటలు లేవు.“నేను ముంబై వెళ్తున్నాను పరిమళగారూ! మనకి పెళ్లయిన వెంటనే ఇలా వెళ్లటం కాస్త నిరుత్సాహంగా ఉంటుందని నాకు తెలుసు. అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని అమ్మా నాన్నలకు ముందే చెప్పాను. మళ్లీ ముహూర్తాలు లేవని ఒప్పించారు. అందుకని తప్పలేదు”.
“అంతేనా?” అంది పరిమళ.ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత అడిగాడు.. “ఎందుకలా అడిగారు?”“నా ఉద్దేశం మీ అమ్మానాన్నల కోసమే ఈ పెళ్లి చేసుకున్నారా అని”“అది కూడా ఉంది. నాకు మీరు నచ్చారు. ఇది కూడా కారణం”చిన్నగా తలూపింది.“మీరు కూడా..” అని ఆగాడు.“అడగండి” అంది పరిమళ.“మీ అమ్మా నాన్నల కోసం చేసుకున్నారా ఈ పెళ్లిని?” అతను పరిమళని నిశితంగా చూస్తూ అడిగాడు.పెళ్లిరోజు ఆమె వదనం ఇంకా గుర్తుకు వస్తూనే ఉంది.“వారి కోసం.. నా కోసం కూడా” అంది తనూ అతని కళ్లల్లోకి చూస్తూ.“సంతోషం! మనం తొందరలో ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నా మనసంతా ప్రాజెక్ట్ మీదే ఉంది”అనంత్ వెళ్లాక పరిమళ అనుకుంది!‘ఏం చెబుతాడు. లాస్య అన్నట్లు నేను..’పరిమళ బాధగా కళ్లు మూసుకుంది.
పరిమళ బెంగళూరుకు వచ్చింది. బిజీ షెడ్యూల్లోనూ తనకోసం ఒక రోజును కేటాయించింది లాస్య.ఇప్పుడు లాస్య గదిలో వారిద్దరూ ఎదురెదురుగా ఉన్నారు.“అయ్యిందా శోభనం?” అదోలా అంది లాస్య.“కాలేదు” ముభావంగా చెప్పింది పరిమళ.“అందుకే ముందుగానే హెచ్చరించాను. అఫ్కోర్స్.. అది చివరి నిముషంలో! నువ్వే ధైర్యం చేయలేకపోయావు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు?” అడిగింది లాస్య.“నేనింకా అతన్ని ‘గే’ అనో, ‘నపుంసకుడు’ అనో కన్ఫర్మ్ చేయలేదు”“సో..” అంది లాస్య ముఖం చిట్లించి.. “అసలు ఓ వ్యక్తి గురించి అలాంటి నిర్ణయానికి రావటానికి నీకున్న ఆధారం ఏంటి? అనంత్ నీకు ముందే తెలుసా? పోనీ నీ, నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా అనంత్‌తో అంత దగ్గరి పరిచయం ఉందా? నా జీవితం నాశనం అవుతుందని అనుకున్నప్పుడు ఓ అరగంట నాకు ఇవ్వలేకపోయావా! జీవితం అంటే అంత లోకువా?”లాస్య ముఖం వివర్ణమైంది. “ఒకవేళ అదే నిజం అనుకుని నువ్వు చెప్పినట్లు చేస్తే.. ఓ మగవాడి జీవితం రోడ్డున పడేది కదా?” అంది పరిమళ.
“సో.. అనంత్ మగవాడు అంటున్నావు!”“ఆ తొందరే వద్దంటున్నాను. పెళ్లిపీటల మీద అనంత్ నన్ను చూసి కంగారుపడ్డాడు. అప్పుడు తనకి రెండు రకాల అనుమానాలు వచ్చి ఉంటాయి. మొదటిది.. నేను ఇంకెవరినన్నా ప్రేమించి ఉంటానని. రెండవది నేను కూడా ఓ స్త్రీతో కలిసి బతకవచ్చని!”“అలా అనుకున్నాడా?”“మనుషుల ముఖం చూసి ఎవరు ‘గే’నో ఎవరు ‘లెస్బియనో’ చెప్పగలమా? ఇప్పుడు ఇలాంటివారి సంఖ్య పెరుగుతోంది. నీ మాటల్లో అది చట్టబద్ధం కదా!?”“నన్ను విమర్శించటానికి వచ్చావా?”“పజిల్ ఇంకా పూర్తి కాలేదు. అనంత్ ఏ రకానికి చెందినవాడో ఇంకా తెలియదు. మా శోభనం ఇంకా జరగలేదు” అంది పరిమళ.“అతను వాయిదా వేస్తున్నాడంటే అర్థం కావటం లేదా?” అంది లాస్య.“సావధానంగా వినటం నేర్చుకో లాస్యా? మిగతా చర్చ అనవసరం. అనంత్ ఎలాంటి వాడైనా కావచ్చు. అతనిలో నువ్వు చెప్పిన ఏ లక్షణం ఉన్నా.. రేపటి నా జీవితం గురించి నాకో అవగాహన ఉంది”“ఇప్పుడు నేనేం చేయాలి?”
“అనంత్ మీద నువ్వు చేసిన ఆరోపణలకు నాకు ఆధారాలు చూపించాలి. అవి చెప్పకపోతే నిజంగా నాకు అన్యాయం చేసిన దానివి అవుతావు. ఇంకోమాట కూడా అంటున్నాను. నువ్వు నా అనుకూల శత్రువువి అనుకుంటాను” అంది పరిమళ.“పరీ.. నేను చేసింది మంచో చెడో నాకు తెలియదు. అనంత్ నాకు పరిచయంలేని వ్యక్తి. ఆ రోజు అతని ఫొటో చూస్తున్నాను. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు పంపాలనుకున్నాను. అప్పుడు నా కొలీగ్ అతని ఫొటోని చూసి అడిగింది. ఎవరితను అని. నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతోంది అన్నాను. వెంటనే ‘మైగాడ్!’ అంది. ‘ఇతను నీకు తెలుసా!?’ అని అడిగాను. ‘హవ్ కెన్ ఐ ఫర్గెట్ హిమ్!’ అంది. అప్పుడు ఆమె చెప్పిన మాటలు నీకు చెప్పాలి” అంది లాస్య.“తర్వాత నువ్వు మాట్లాడలేదా?”“తను ముంబైలో ఉంటుంది. అక్కడ నుండి రకరకాల పనులు. కాంటాక్ట్ చేయటం కుదరలేదు”
“ఆమె పేరు నాకు కావాలి. తన ఫొటో ఉందా?”“ఉంది. నీకు పంపిస్తాను. అయినా నువ్వు మాట్లాడవద్దు. నేను మాట్లాడతాను” అంది లాస్య. పరిమళ తలూపింది.
నెలన్నర గడిచిపోయింది.ఆరోజు శోభనం ఏర్పాటు చేశారు.ఉద్వేగంతో గదిలోకి అడుగుపెట్టింది పరిమళ.ఆమె చేతులు అందుకుని మంచంమీద కూర్చోబెట్టాడు అనంత్.“పరిమళా.. మనం ఒకటి కావటానికి ఇన్నిరోజుల సమయం తీసుకుంది. ముందు నాకు ఓ విషయంలో నీ వివరణ కావాలి. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? పెళ్లి జరిగినప్పటి నుంచి నువ్వు ఎందుకంతగా అదోలా ఉంటున్నావు. నేనంటే ఇష్టం లేకపోయినా, మరేదో కారణం ఉన్నా చెప్పు. మనం స్నేహితుల్లా విడిపోదాం” అన్నాడు అనంత్.పరిమళకు మళ్లీ ఎక్కడో అనుమానం.“మాట్లాడు పరిమళా!” అన్నాడు అనంత్.అప్పుడు పరిమళ తన ఫోన్ తీసుకువచ్చి.. “ఈ అమ్మాయి మీకు తెలుసా?” అంది.అనంత్.. ఆమెను చూశాడు. అతని ముఖంలో కనిపిస్తున్న మార్పులను గమనిస్తోంది పరిమళ.“తెలుసు. మరిచిపోవటం కష్టమే!” అని ఫోన్ పక్కన పెట్టాడు.
“ఈమె, మరో స్నేహితురాలు, నేనూ కలిసి ఓ గదిలో ఆ రాత్రి ఉండాల్సి వచ్చింది. వాళ్లంతా మోడ్రన్ గాల్స్. అసలు అలాంటి సందర్భం రావటమే చిత్రం. ఓ పని మీద వెళ్లాను. అక్కడ హోటల్ గదులు లేవు. ఎడ్జస్ట్ కావాల్సి వచ్చింది. ఆరోజు ఈమె నన్ను తన కోరిక తీర్చమంది. నేను ఒప్పుకోలేదు. ‘ఇందులో తప్పేం ఉంది. ఇది ఫిజికల్ నీడ్ కాదా!?’ అంది. నన్ను గాఢంగా హత్తుకుంది. కవ్వించింది. నన్ను నేను నిగ్రహించుకోవటం కష్టమైంది. అప్పుడు నేనే తనతో చెప్పాను.. నేను ‘గే’ అని”.ఆ మాటలు వింటూనే పరిమళ కళ్లు పెద్దవయ్యాయి.
“నా దిండు తీసుకుని ఆ గదిలోంచి బయటికి వెళ్లిపోయాను. నేను ఈ తరానికి చెందినవాణ్ని కాకపోవచ్చు. పెళ్లి పట్ల, దాంపత్య జీవితం పట్ల నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. భార్యాభర్తల అనుబంధం గొప్పది. ఇంకొకరు వారి మధ్యకు రాకూడనిది. పవిత్రమైనది. ఎవరు ఏ రూల్స్ బ్రేక్ చేసినా అది వారిష్టం. నేను ఇంకొకరిని విమర్శించాలనుకోను. ‘గే’లు, లెస్బియన్స్, ట్రాన్స్జెండర్లు.. అందరూ మనుషులే” అన్నాడు అనంత్.పరిమళ అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టింది. అనంత్ చిరునవ్వుతో వింటున్నాడు. ఆమె చెప్పటం పూర్తయింది. పరిమళను దగ్గరకు తీసుకున్నాడు.“నన్ను ‘గే’ అనే పదమే కాపాడింది. ఇంక ‘నపుంసకుడు’ అన్న బిరుదుని కూడా వదిలించుకోవాలని అనుకుంటున్నాను నువ్వు సహకరిస్తే” అన్నాడు చెవిలో.పరిమళ అతని హృదయం మీద వాలిపోయింది.రాత్రి కరుగుతూనే ఉంది.
ఫోన్ అందుకుంది లాస్య.“లాస్యా.. మా శోభనం దివ్యంగా జరిగిపోయింది. నీ కొలీగ్ కోరుకునే మగాడు అనంత్ కాకపోవచ్చు. కానీ, అతను ఓ మంచి భర్త. భార్యను మాత్రమే ప్రేమించి, తనతోనే జీవితాంతం ప్రయాణం చేయాలనుకునే పాతకాలపు అబ్బాయి. ఐ లవ్ హిమ్” అని ఫోన్ కట్‌చేసింది పరిమళ.“పరిమళా.. మనం ఒకటి కావటానికి ఇన్నిరోజుల సమయం తీసుకుంది. ముందు నాకు ఓ విషయంలో నీ వివరణ కావాలి. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? పెళ్లి జరిగినప్పటి నుంచి నువ్వు ఎందుకంతగా అదోలా ఉంటున్నావు. నేనంటే ఇష్టం లేకపోయినా, మరేదో కారణం ఉన్నా చెప్పు. మనం స్నేహితుల్లా విడిపోదాం” అన్నాడు అనంత్.పరిమళకు మళ్లీ ఎక్కడో అనుమానం.“మాట్లాడు పరిమళా!” అన్నాడు అనంత్.పి. చంద్రశేఖర అజాద్
పూర్తి జీవితాన్ని సాహిత్య సేవకే అంకితం చేసిన రచయిత.. పి. చంద్రశేఖర ఆజాద్. నాలుగున్నర దశాబ్దాలుగా అనేక ప్రక్రియల్లో సాహితీసేద్యం చేస్తున్నారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా వెల్లటూరు. ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్‌గా వీఆర్ఎస్ తీసుకొన్నారు. ఇప్పటివరకూ 850కి పైగా కథలు, 87 నవలలు, 18 నవలికలు, 5000 టీవీ ఎపిసోడ్స్, టెలీ ఫిల్మ్స్ రాశారు. రేడియో, సినిమా, సాహితీ సంస్థల నిర్వహణతోపాటు కొన్ని సీరియల్స్, ఒకటి రెండు సినిమాల్లోనూ కనిపించారు. 2024లో ‘మాయా లోకం’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. ‘అడవి పూలు’ టెలీ ఫిల్మ్ సంభాషణలకు రెండు నంది అవార్డులు అందుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన నాలుగు టెలీ ఫిలిమ్స్‌కు మూడు స్వర్ణ నందులు, ఓ వెండి నంది స్వీకరించారు. ‘భారతి’ పిల్లల సినిమాకు స్వర్ణ నంది దక్కింది. ఇవేకాకుండా.. కళారత్న (హంస), ఉగాది పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డులు దక్కించుకున్నారు. సినిమా రంగంతోపాటు బుల్లితెరపై మెరిసినా.. సాహిత్యాన్ని మాత్రం వదలలేదు. ఓపిక ఉన్నంతకాలం రచనలు చేస్తూనే ఉంటానని చెబుతున్నారు చంద్రశేఖర ఆజాద్.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
-పి. చంద్రశేఖర అజాద్
92465 73575