‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
“ఇంకెంత దూరంలో ఉన్నాం?” తల్లి ప్రశ్నతో..
కారు కిటికీలోంచి బయటి పరిసరాలు చూస్తున్న శిరీష..
“దగ్గరి కొచ్చేశాం.. పదిహేను నిమిషాలు అంతే! ఎందుకమ్మా .. అలసటగా ఉందా?!” అని అడిగింది.
ఏమీ లేదన్నట్టు తలూపి.. మళ్లీ కళ్లు మూసుకుంది లలిత. ఇంకొద్దిసేపట్లో తన ఊరొస్తుంది. కేశవను చూడొచ్చు. ఎలా ఉన్నాడో కేశవ?.. ఎంత ఇబ్బంది పడుతున్నాడో! ఏదీ చెప్పడు. తనకు ఏదైనా అయితే మటుకు ఆకాశం, నేలా ఒక్కటి చేస్తాడు.
తన కాలికి ముల్లుగుచ్చితే విలవిల్లాడి పోయేవాడు. తనకేదైనా బాధ కలిగితే వాడి కళ్లలో నీళ్లు తిరిగి ఆ బాధ ప్రతిఫలించేది. ఎవరైనా అలా ఉంటారా అసలు?!
బడి రోజుల్లో ఓసారి శ్రీహరి వెనుకనుంచి తన రెండు జడలు లాగాడని తెలిసి.. ఎలా చితగ్గొట్టాడో అతణ్ని! ఐదారుగురు కలిస్తేగానీ కేశవను పట్టుకోలేకపోయారు.
“ఈసారి మా అక్కనేమన్నా అన్నావంటే చేతులిరగ్గొడతా!” అంటున్న కేశవ కళ్లలో కోపాన్ని చూసి మొదటిసారిగా భయపడిన క్షణాలవి!
ఊర్లో హైస్కూల్ ఉన్నా తను ఇంటర్ కోసం పక్క టౌన్‌కు బస్సులో వెళ్లి రావాలని తెలిసి, కేశవ టీసీ తీసుకుని కాలేజీకి దగ్గర్లో ఉన్న స్కూల్లో చేరాడని తెలిసి.. ఆ ప్రేమకు ఆశ్చర్యం, పొసెసివ్‌నెస్‌కి భయం కలిగిన మాట నిజం! తనకే కాదు, తన స్నేహితులకూ కేశవ తమ్ముడే! ఎవరికేది కావాలన్నా తెచ్చిపెట్టేవాడు.
వాళ్లు మొహమాటపడినా..
“ఏం ఫర్వాలేదక్కా! మా అక్కెంతో మీరూ అంతే!” అనేవాడు. తనెప్పుడైనా..
“ఎందుకురా అందరి పనులూ నెత్తినేసుకుంటావు?!” అన్నా కూడా..
“నీ ఫ్రెండ్సే కదక్కా! వాళ్లకేదైనా కావాలంటే నువ్వు వెంటవెళ్లాల్సిందే కదా! ఎండలోపడి ఆ ఊరంతా తిరగడం, అలసిపోవడం ఎందుకు?” అనేవాడు.
తనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో కేరింగ్‌గా ఉండేవాడు. కొన్నిసార్లు అమ్మానాన్నల కంటేకూడా కేశవనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడని అనిపించేది.
తనకు తెల్లకలువలు అంటే ఎంతో ఇష్టం. ఊరిచెరువు నిండా విచ్చుకుని ఉండేవి. తనకు వాటిని తెచ్చివ్వడం కోసమే ఏడేళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ఈత నేర్చుకున్నాడు కేశవ. ఊరి నిండా వాడి స్నేహితులే! అయినా చింతకాయలు, మామిడికాయలు, రేగుపళ్లు, జామపళ్లు … ఇలాంటివి తామిద్దరి మధ్యే. అన్నయ్య మాధవ తనకన్నా మూడేళ్లు పెద్ద అయినా ఎందుకో తన చదువేమో.. తనేమో అన్నట్టుండేవాడు.
డిగ్రీ చదువుతున్నప్పుడు తన సీనియర్ కృష్ణమోహన్ లవ్‌లెటర్ రాసి వాళ్ల తమ్ముడు రాజు చేతికిచ్చి పంపించాడు తనకు. ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పడానికి భయపడి, స్నేహితులు ఆటపట్టిస్తుంటే ఆ ఉత్తరం చించిపారేద్దామని చూస్తే దొరకలేదు. అదెలా తెలుసుకున్నాడోగానీ ఆ ఉత్తరం చదివిన కేశవ.. కృష్ణమోహన్ దగ్గరికి సరాసరి వెళ్లిపోయి మాట్లాడాడట.
“ఆ ఉత్తరం టైంపాస్ కోసం రాశావా!? లేక నిజాయతీగా ఇష్టపడుతున్నావా?! మా అక్కపట్ల నీకు నిజంగా ప్రేముందా?! మా అక్కను పెళ్లి చేసుకోవాలంటే నీ డిగ్రీ పూర్తిచేసి మంచి ఉద్యోగం దొరికాక అప్పుడు మాట్లాడు.. అదికూడా మా అక్కకు ఇష్టమైతేనే! ఈలోగా ఏదైనా అల్లరి చేశావంటే నేను మంచోణ్ని కాను. మా అక్కకోసం ఏదైనా చేస్తాను” అంటూ బెదిరించాడట. ఆ తరువాత తనను చూస్తేనే ఆమడదూరం పారిపోయేవాడు కృష్ణమోహన్. అప్పుడు కేశవ చదువుతున్నది ఇంటరే.
ఏళ్లు గడుస్తున్నకొద్దీ అక్కాచెల్లెళ్ల మధ్యకన్నా అన్నదమ్ముల మధ్యప్రేమ తగ్గుతుందంటారు. కానీ, కేశవ ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఇంకా పెరిగింది కూడా! డిగ్రీ అవుతూనే తన పెళ్లి అయింది. ఆ పెళ్లిలో సందడంతా కేశవదే! అమ్మకు ఇంట్లో అన్నీ సర్దిపెట్టడం నుంచీ, సామాన్లు తేవడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్లడంలాంటి పనుల్లో నాన్నకు ఎంతసహాయం చేశాడో! నెలకోసారి తన అత్తవారింటికి చూట్టానికి వచ్చేవాడు కేశవ.
“మీ అక్కను పెళ్లి చేసుకుంటే నువ్వు బోనస్‌గా వచ్చావు. మరదలువైనా కాకపోతివి”.. అంటూబావమరిదితో పరాచకాలాడేవాడు తన భర్త ఆనంద్. కేశవ నవ్వేసేవాడు.
ఆనంద్ నీటిపారుదల శాఖలో ఇంజినీరుగా నాగార్జునసాగర్, శ్రీశైలం, పోచంపాడులో పనిచేసేప్పుడు తనొక్కతే ఇంట్లో ఉంటుందని అప్పుడప్పుడూ కేశవ వచ్చి ఉండేవాడు. కొన్నిసార్లు క్యాంపుకెళ్లాల్సి వస్తే కేశవను ఆనందే పిలిపించేవాడు. అంతలా అతనికికూడా నచ్చాడు. ముగ్గురూ కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లు,కార్డ్స్ ఆడేవాళ్లు, ఎటైనా పిక్నిక్లకు వెళ్లేవాళ్లు. కేశవ వస్తే తనకు ఎంతో సంతోషంగా, రిలీఫ్‌గా ఉండేది. వంటచేస్తుంటే కూరగాయలు కట్ చేసిస్తూ, చపాతీలు వత్తితే పెనంమీద కాలుస్తూ, ఎప్పుడైనా టైలర్ దగ్గరికో, మార్కెట్‌కో వెళ్తే తోడుగా వస్తూ ఉండేవాడు. ఇద్దరూ కలిసి బోలెడు పుస్తకాలు చదువుతూ ఆ కథల గురించీ, నవలల గురించీ చర్చించుకునే వాళ్లు.
శిరీష, శ్రీకాంత్ పుట్టినప్పుడు అమ్మ ఇంటికి వచ్చి వంటచేసి తీసుకొచ్చే టైంలోనూ, రాత్రంతా అమ్మతో బాటుగానూ హాస్పిటల్లో ఉండేవాడు. పిల్లలను ఎత్తుకోవడం, స్నానం పోయడం, బట్టలు తొడగడం ఎంతబాగా అలవాటు చేసుకున్నాడో!
అన్నయ్య బాగా చదువుకుని అమెరికాకు వెళ్లడం, మధ్యలో ఓ పెద్దింటి అమ్మాయి సంబంధం నచ్చి పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలూ అమెరికాలోనే పుట్టడం, అక్కడే బాగా సెటిలవడం జరిగిపోయాయి. కేశవ మాత్రం డిగ్రీ దాకానే చదివి అమ్మానాన్నలకోసం ఆ ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేపట్టాడు. వ్యవసాయం చేస్తున్నాడని తనకు పెళ్లి సంబంధాలు పెద్దగా రాలేదు.
ఓ పేదింటి అమ్మాయిని కట్నమేమీ తీసుకోకుండా చేసుకోవాలనేది కేశవ కోరిక. అలాగే తను ఎన్నికచేసిన లక్ష్మి కోడలిగా ఆ ఇంటికి వచ్చింది. మంచీ, మర్యాదా ఉన్న అమ్మాయి. ముఖ్యంగా కేశవను అర్థం చేసుకుని వాడి జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోయింది.
చూస్తూ ఉండగానే ఏళ్లు గడిచాయి. కేశవ దంపతుల చేతుల్లో సంతృప్తిగా కన్నుమూశారు అమ్మానాన్న. మాధవన్నయ్య కూతురు పెళ్లిఖర్చుల కోసమని ఊర్లో ఉన్నపొలంలో తన వాటా సగం అమ్మి భారత్‌లోనే చాలా గ్రాండ్‌గా పెళ్లిచేశాడు. పంపకాల్లో రెండెకరాల పొలమే కేశవకు మిగిలింది. ఊర్లో ఉన్న ఇల్లు మాత్రం..
“నువ్వు అమ్మానాన్నల్ని చూశావుగా.. అందుకని ఇంట్లో నాకేమీ వాటావద్దు!” అన్నాడు మాధవ ఉదారంగా. కేశవ ఏమీ మాట్లాడలేదు.
ఉండబట్టలేక ఆనంద్ కేశవతో..
“మీ అన్నయ్య మంచి పొజిషన్లో ఉన్నాడు. తన ఫారిన్ చదువుకు మీ నాన్న ఎంతో ఖర్చుపెట్టాడు కూడా! ఆ రెండెకరాల పొలం అమ్మకపోతే ఆయనకు గడవదా? నీకు వదిలిపెడితే బావుండేది. నాకు తెలిస్తే నేనైనా అడిగేవాణ్ని!” అన్నాడు. కేశవ వెంటనే..
“వద్దు బావా! మీకు నామీద ఉన్న అభిమానం చాలు. అన్నయ్యకు కూడా అమ్మానాన్నల ఆస్తిలో హక్కు ఉంటుంది కదా! ఏమాత్రం వీలున్నా నేనే ఆ పొలం కొనుక్కునేవాణ్ని. కానీ, నా దగ్గర డబ్బు లేదు. అసలు మా అక్కకు ఏమైనా ఇవ్వాలన్నా నా దగ్గరలేదు” అన్నాడు నిస్సహాయంగా. ఆ పొలం కొనుక్కోవడానికి ఆనంద్ అప్పుగా డబ్బు ఇస్తానన్నా కేశవ ఒప్పుకోలేదు.
కేశవకు నెలనెలా ఆదాయం వచ్చే ఉద్యోగం ఏదీ లేదు. వ్యవసాయంలో ఆదాయం అంతంత మాత్రమే. మధ్యమధ్య తనదగ్గరికి వచ్చేటప్పుడు కూరగాయలు, తినుబండారాలు, పచ్చళ్లు, పొడులు పట్టుకొచ్చేవాడు. లక్ష్మి కూడా సహకరించకుంటే అది సాధ్యపడేది కాదని తనకూ తెలుసు. కొన్నేళ్లుగా కేశవ చాలా కుంగిపోయినట్టు కనిపించేవాడు.
“ఏమిట్రా.. ఏమైనా ఇబ్బందా?!” అంటే..
“ఏమీ లేదక్కా!” అనేవాడు.
అడగ్గా అడగ్గా కొడుకు శరత్ సరిగ్గా చదువుకోవట్లేదనీ, అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడనీ చెప్పాడు.
కేశవను ఒప్పించి మేనల్లుణ్ని తెచ్చి తన దగ్గరే ఉంచుకుని స్కూల్లో చేర్పించింది. కేశవ చెప్పిన దానికన్నా మొండితనం ఎక్కువే ఉందని అర్థమయ్యింది.
“మీరంతా బాగానే ఉన్నారు. తాతయ్య కోసం, నానమ్మకోసం మా నాన్నను ఊర్లోనే కట్టిపడేసి సరిగ్గా చదివించక పైకి రానీకుండా చేశారు. అందుకే మేమిలా ఉన్నాం!” అనే శరత్ అభిప్రాయాన్ని ఎంత నచ్చచెప్పినా మార్చలేకపోయింది తను.
వాణ్ని బాగా చదివించాలనుకున్నా పట్టుమని పదినెలలు బలవంతంగా ఉండి.. మళ్లీ ఊరికి వెళ్లిపోయాడు. కూతురి పెళ్లికి, ఆ తరువాత అప్పులకీ కేశవ ఆ రెండెకరాలూ అమ్మాడని తెలిసి చాలా బాధపడింది.
ఈలోగా శిరీష మెడిసిన్, శ్రీకాంత్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. శిరీష పీజీలో ఉండగా డా. విజయ్‌తో పెళ్లికాగానే ఇద్దరూ ఇరాన్ వెళ్లి, కొన్నాళ్లకు ఇండియా వచ్చి నర్సింగ్ హోమ్ పెట్టుకున్నారు. శ్రీకాంత్ కూడా అమెరికాలో ఎమ్మెస్ చేసి, సంధ్యతో పెళ్లికాగానే అక్కడే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
పదేళ్ల కింద ఆనంద్ చనిపోవడంతో తనచుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అదివరకే శిరీష దగ్గర తను ఉండననడంతో వాళ్లే పిల్లలకోసం తమ ఇంట్లోనే పైఫ్లోర్‌లో ఉంటున్నారు. తమకు ఎప్పటికీ ఇంట్లోనే ఉండేలా వంటమనిషి ఉంది. పై పనులకు ఇంకో ఆవిడ ఉంది. రోజూ శిరీష వచ్చిచూసి కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఒకవిధంగా జీవితం సాఫీగానే సాగుతున్నది. ఇప్పుడీ వార్త.. కేశవ ఇల్లు అమ్ముతున్నాడని! అంతకంటే ఎక్కువ బాధపెట్టిన విషయం.. కొద్దిగా పక్షవాతంలా వచ్చి తగ్గిందనీ, కర్రతో నడుస్తున్నాడనీ! కొడుకు సిటీలోనే ఉంటూ ఏదో చిట్‌ఫండ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడనీ, అందులో డబ్బులు వాడుకున్నాడనీ, కట్టకపోతే ఊరుకునేది లేదని వాళ్లు ఒత్తిడి చేస్తున్నారనీ, ఎలాగైనా ఇల్లు అమ్మి డబ్బు ఇవ్వమంటున్నాడని తెలిసి ఇంకా బాధ కలిగింది.
ఇల్లు మరొకరి అధీనంలోకి వెళ్లకముందే ఒక్కసారి చూసిరావాలని, ఆ ఇంటితో ఉన్న జ్ఞాపకాల్ని మరోసారి తల్చుకోవాలనీ బలంగా అనిపించింది. కేశవ ఇబ్బందులేమిటో ఓసారి అడిగి.. తన చేతనైనంత సాయం ఏదైనా చేయాలని కూడా అనిపించింది. అందుకే ఇప్పుడీ ప్రయాణం.. ఆదివారమైతేనే శిరీషకు కొంచెం సమయం చిక్కుతుంది. కానీ, ఏమిటో సడన్‌గా నిన్న..
“అమ్మా! రేపు మనం అమ్మమ్మా వాళ్ల ఊరెళ్తున్నాం!” అన్నది.
“అమ్మా! ఊరొచ్చింది. నిద్రపట్టిందా?!”.. శిరీష అడుగుతుంటే ఆలోచనల దారం తెగింది.
ఊరు చాలా మారింది. ముందున్న చెరువు చిక్కిపోయి చిన్నగా అయింది. అయినా కలువ మొగ్గలు నిండుగా ఉన్నాయి. రాజరత్నం పాన్‌షాప్ ఉన్నచోటునే ఓ బిల్డింగూ, అందులో పెద్ద కిరాణాషాపు వెలిశాయి. ఆ పక్కనే సెలూన్ కొంచెంమారి అద్దాలతో నీట్‌గా కనిపిస్తున్నది. మణెమ్మ టైలర్ మాయమై ఓ రెడీమేడ్ బట్టలషాప్ వచ్చినట్టుంది.
‘ఈ ఊరినిక మళ్లీ చూస్తానా!’ అనిపించింది లలితకు.
చూస్తుండగానే ఇంటి ముందు కారు ఆగింది. ఓ పక్కన ప్రహరీ కొంచెంకూలి రాళ్లు, మట్టికుప్పగా పడిఉంది. అందులోంచే ఓ బఠాణీతీగ నిండా గులాబీరంగు పూలతో తొంగి చూస్తున్నది. పెద్ద వేపచెట్టు పచ్చగా ఉండి బోలెడంత నీడ ఇస్తున్నది. ఇల్లు బాగా పాతబడినా ఎప్పట్లాగే కళగా ఉంది. పదేళ్లనాడు చూసిన ఇల్లు. ఆనంద్ పోయాక కేశవ తీసుకువస్తే బలవంతంగా వచ్చి.. ఓరోజు ఉండి వెళ్లిందంతే! మళ్లీ ఇప్పుడే రావడం.
తను ఆడిపాడిన ఇల్లు, అమ్మానాన్నలతో ఆనందంగా గడిపిన ఇల్లు, బాల్య, యవ్వన జ్ఞాపకాలతో ముడిపడిన ఇల్లు.. ఇక తమదికాదా?! కనీసం కేశవది కూడాకాదా?! ఇక కేశవ ఎక్కడుంటాడు? ఆలోచనలతోనే శిరీష చెయ్యిపట్టుకుని లోపలికి అడుగుపెట్టింది లలిత.
“అక్కా!” అంటూ చేతికర్రతో మెల్లగా నడుస్తూ వచ్చి.. గట్టిగా చేయి పట్టుకున్నాడు. ఇద్దరి కళ్లలోనూ నీళ్లుతిరిగాయి.
“ఏంట్రా ఇది?! ఇలా అయిపోయావు? నాతో మాటమాత్రం చెప్పకూడదా?! నేనంత పరాయిదాన్ని అయిపోయానా! లేక ఏమీ చేయలేనని అనుకున్నావా?!” మాటపూర్తిగా రాకుండానే గొంతు గద్గదమైంది.
“లేదక్కా!! నువ్వు బాధపడతావని.. అయినా బాగానే ఉన్నానుగా!” అన్నాడు కేశవ. అతని గొంతులో ఎప్పుడూ కనిపించని దిగులు ధ్వనించింది. “నువ్వు రెస్ట్ తీసుకో అక్కా! నేను రిజిస్టర్ ఆఫీస్ దాకావెళ్లి ఇప్పుడే వస్తాను!” అన్నాడు.
“నా కారులో వెళ్దాం మామయ్యా! నేనుకూడా వస్తాను. అమ్మకూడా రావాలి కదా.. సంతకం పెట్టడానికి” అన్నది శిరీష.
“అక్కడ ఎంతసేపు పడిగాపులు పడాలో ఏమిటో! అక్కను ఇంటిదగ్గరే ఉండనివ్వు, సంతకం అవసరమైతే అప్పుడు కారు పంపుదాం” అన్నాడు కేశవ.
మేనమామకు తన తల్లి అంటే ఎంతప్రేమో మరోసారి అర్థమైంది శిరీషకు. కాఫీతాగి వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.
లలిత పెరట్లోకి వెళ్లింది. నిండా ఆకుకూరలు, కూరగాయ మడులు చక్కగా పెరిగి ఉన్నాయి.
‘ఎంతపెద్ద పెరడు? సిటీలో ఇంత జాగా ఉంటేనా! ఈ ఇల్లు అమ్ముకుంటే ఎక్కడ ఉంటారు?!’.. గాఢంగా నిట్టూర్చింది లలిత.
“మొక్కలు చూస్తున్నారా వదినా?!”..
వెనకాల లక్ష్మి మాటలు వినిపించి చూసింది.
“మీరు పెరిగిన పరిసరాలు చూసుకుంటున్నారా?!”.
“ఆ.. బహుశా ఆఖరిసారి!” అన్నది లలిత దిగులుగా.
“ఏంచేస్తాం? ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. కానీ, తప్పని పరిస్థితి వచ్చింది. ఉన్న రెండెకరాలూ ఇదివరకే చదువులకీ, శైలూ పెళ్లికీ అమ్మేసాం. రెండేళ్లనుంచీ ఇల్లు అమ్మేద్దామని శరత్ వెంటపడుతూనే ఉన్నాడు. మీ తమ్ముడే ఎలాగో నచ్చచెప్పి ఆపుతూ వచ్చారు. ఇక రెండు నెల్లకింద వాడేవచ్చి స్నేహితుల ద్వారా ఇల్లు బేరం కుదిర్చి అడ్వాన్స్ తీసుకుని వెళ్లాడు. ఇక చేసేదేముంది?!” నిర్వేదంగా అన్నది లక్ష్మి.
“అంత అవసరం ఏమొచ్చిందట?!” అడిగింది గానీ.. ‘ఎందుకు అడగడం!? బాధ పెట్టడానికి కాకపొతే!’ అనుకుంది.
“మీ దగ్గర దాచేదేముంది వదినా! శరత్‌ను మంచి స్కూల్లో, కాలేజీలో చేర్పించి, ఫీజులు కట్టినా, అడిగినవన్నీ కొనిచ్చినా.. చదువుకునే రోజుల్లో సరిగా ్గచదువుకోలేదు. మంచి ఉద్యోగమూ లేదు. ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు వాడు. ఇక ఇద్దరూ ఇష్టపడ్డారేమో.. ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్లు వేరే సంబంధం చూసినా.. వద్దని పెళ్లి చేసుకున్నారు. తెలిసిందే కదా! కొన్నాళ్లు మా దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత కోడలుకు ఈ పల్లెటూరు నచ్చలేదు, బస్తీలో కాపురం పెట్టారు. మేమూ వద్దనలేదు. ఇద్దరికీ పొదుపు లేదు. దాంతో బాగా అప్పులై అందరూ ఇంటి మీదికొస్తున్నారని ఇప్పుడు ఇల్లమ్మి ఆ డబ్బు తీసుకుంటానని గోల!”..
“అయ్యో! నాకు ఈ విషయాలేవీ తెలియవు. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కేశవ కూడా ఏమీచెప్పడు. ఈ వయసులో ఇల్లమ్ముకుంటే మీరెక్కడుంటారు లక్ష్మీ!” లలిత మనసంతా ఎలాగో అయింది.
ఇక్కడ తన తోడబుట్టినవాడు ఇంత బాధపడుతుంటే.. తానూ, అన్నయ్యా మాత్రం సుఖంగా, సౌకర్యంగా ఉన్నారు. తల్లిదండ్రులు తమపిల్లల్ని ఒకేలా పెంచి పెద్దజేస్తారు. కానీ, వాళ్ల జీవితాలు ఎంతవేరుగా ఉంటాయి?!
“మమ్మల్ని తన దగ్గరికే వచ్చి ఉండమని శరత్ అంటున్నాడు గానీ.. వాడిదీ చిన్న ఇల్లే! పిల్లలతో ఏం సరిపోతుంది?! నేను ఎలాగోలా సర్దుకున్నా మీ తమ్ముడు అక్కడ ఉండలేరు. పక్కసందులో రంగయ్యగారని రిటైర్డ్ హెడ్మాస్టర్ గారింట్లో మూడురూముల పోర్షన్ ఉంది. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. అదొక్కటే కొంచెం అద్దె తక్కువ. కాకపోతే నా కుట్టుమిషన్కీ, మీ తమ్ముడి ట్యూషన్లకీ ఇబ్బంది అవుతుందేమో చూడాలి!” చెప్పీ చెప్పనట్టుగా కొడుకు దగ్గరికి వెళ్లలేమని చెప్పినట్టు అనిపించింది లలితకి.
“కేశవ ట్యూషన్స్ చెబుతున్నాడా?!” తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నది.
“అవునొదినా! వ్యవసాయం లేదుగా! అప్పట్నుంచే చెప్తున్నారు. ఎయిత్ నుంచి టెంత్ పిల్లలకు చెబుతారు. మనిల్లు మెయిన్ రోడ్‌కే ఉంది గనుక ఇంట్లో చిన్న కిరాణాషాప్ కూడా నడుపుతున్నాం. బడి ఎదురుగానే గదా.. పిల్లలకోసం పెన్నులూ, పెన్సిళ్లూ, నోట్ బుక్సు, బిస్కెట్లూ, చాక్లెట్లు కూడా బాగానే అమ్ముడుపోతాయి. ఈ ఇల్లు మాకు నిలువనీడే కాదు.. జీవనాధారం కూడా! ఇంటెనక పండే కూరగాయలు రాములు అనే ఆయన మాదగ్గర కొని పక్క బస్తీలో అమ్ముకుంటాడు. నేను కూడా పక్క టౌన్లో రెడీమేడ్ షాప్వాళ్ల ఆర్డర్‌కు బట్టలు కుట్టి ఇస్తుంటాను. ఊర్లో బట్టలకన్నా అవే కాస్త ఎక్కువ డబ్బులొస్తాయి. ఏదో ఉన్నంతలో గుట్టుగా గడుపుకొస్తున్నాం. శైలూ బాగానే ఉంది. అల్లుడు కూడా మంచివాడే! వీడి జీవితమే ఇట్లా అయింది. ఇంత జాగాతో ఇల్లు మళ్లీ కొనగలమా!” చెబుతున్నది లక్ష్మి.
లలిత మనసంతా తెలియని వేదనతో నిండిపోయింది. కేశవ తెలివి తక్కువవాడు కాదు, కష్టపడి పనిచేయని వాడూ కాదు. అన్నివిధాలా అనుకూలవతి అయిన భార్య. అయినా అమ్మానాన్నల కోసం ఇంటిపట్టునే ఉండి వాళ్లనీ, వ్యవసాయాన్నీ చూసుకుంటూ ఉండిపోయాడు. కేవలం వ్యవసాయంతో ఎవ్వరూ ధనవంతులు కాలేరని తెలిసికూడా.. దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. వెనకటి పరిస్థితులు వేరు. అప్పుడిన్ని ఖర్చులూ, పోటీలూ లేవుగనుక ఆ రోజుల్లో గడిచింది. అసలు అమ్మానాన్నలదీ పొరబాటే. ఆ పొలం అంతాకూడా కేశవకు ఇచ్చి ఉండాల్సింది. ఏమో.. అప్పుడెలా ఉండేదో!
కారు వచ్చింది. లలిత వెళ్లి యాంత్రికంగా తనపేరు పిలిచినప్పుడు సంతకం పెట్టివచ్చింది గానీ మనసు ఆలోచిస్తూనే ఉంది. కేశవకు ఏదైనా సహాయం చేయాలి.. వాడి జీవితం ఇంత నిస్సహాయంగా ఉండకూడదు. తన పెన్షన్ ఖాతాలో ఏదైనా మిగులు డబ్బుంటే ఇవ్వాలి. ఒప్పుకోకపోతే లక్ష్మికి నచ్చచెప్పి ఇవ్వాలి. తనదగ్గర వచ్చి ఉండమంటే.. వింటాడో లేదో! పోనీ అలాగైనా ఒప్పించాలి. అలా అనుకున్నాక లలిత మనసు తేలికపడింది.
అందరూ కూర్చొని భోజనాలు చేస్తుంటే శిరీష తన చిన్నప్పటి కబుర్లు చెప్పి నవ్వించింది. కేశవ కూడా నవ్వుతుంటే..
“మీరుంటే ఎంత సంతోషమో ఆయనకి..” అని సంబరపడింది లక్ష్మి.
అన్నీ లలితకు ఇష్టమైన వంటకాలే. ఎంత జ్ఞాపకమో కేశవకి అనుకుంది లలిత. భోజనాలవగానే బల్లమీద కేశవ పక్కనే కూర్చుంది లలిత. తన మనసులో మాటను ఎలా చెప్పాలా.. అనుకుంటూ.
శిరీష వచ్చి ఓ కాగితాల మడత తల్లి చేతిలో పెట్టి..
“అమ్మా! ఓసారి చూసుకో!” అన్నది.
“ఏమిటే ఇవి! నేనెందుకూ చూట్టం!” అంటూనే ఓసారి తిరగేసింది లలిత.
మొదటిపేజీ చదువుతుంటేనే ఆమెకు అర్థమైంది. అవి ఇంటి తాలూకూ కాగితాలని! కేశవ ఇంటిని తనకు అమ్మితే.. తను కొంటున్నది!
“ఇదేమిటే! ఈ ఇల్లు నేను కొనడమేంటీ?!” అంటూండగానే లలిత ఫోన్ మోగింది.
శిరీష ఎత్తి తల్లికిచ్చింది.
“అమ్మా! నేనూ.. శ్రీకాంత్‌ని. సంతోషమేనా అమ్మా?! మీ తమ్ముడికి ఇప్పుడేం ఇబ్బంది ఉండదుగా?!” అంటున్నాడు.
సప్తసముద్రాల అవతల ఉన్న కొడుక్కి తన పరివేదన ఎలా తెలిసింది?!
“నువ్వు చాలా బాధ పడుతున్నావని అక్క చెప్పింది. ‘చిన్న మామయ్య కోసం ఈమాత్రం చేయలేమా!?’ అనుకున్నాం.. అక్కా, నేనూ. నేనే మొత్తం ఇస్తానంటే అక్క ఒప్పుకోలేదు. ‘నన్ను కూడా కలవనీ! నాకు తృప్తిగా ఉంటుంది!’ అన్నది!”..
లలిత నిరుత్తరురాలు అయింది.
‘మరి.. నా పేరెందుకు?! ఆ డబ్బులు మామయ్యకో, శరత్కో ఇస్తే పోయేదిగా!’ అందామనుకుంది.
మళ్లీ శ్రీకాంతే..
“ఆ డబ్బులేవో మామయ్యకే ఇవ్వచ్చు గానీ, ఆయన తీసుకుంటాడో లేదో.. ఇక శరత్‌కు ఇస్తే అవి ఖర్చయిపోయాక మళ్లీ కొన్నాళ్లకు ఇల్లు అమ్ముతానంటాడేమో! అప్పుడు మళ్లీ ఇబ్బందేకదా అనుకున్నాం. ఇలా బాగుంటుందని అనిపించిందమ్మా! సరే.. మామయ్యను ఏమీ బాధపడొద్దని చెప్పు!” అన్నాడు.
శిరీష దగ్గరిగా వచ్చి తల్లి భుజమ్మీద చెయ్యేసి..
“అమ్మా! నీ పుట్టిల్లు ఇక నీదే! అడ్వాన్స్ ఇచ్చినవాళ్లతో మాట్లాడి ఒప్పించి కొంతడబ్బు ఎక్కువిస్తామంటే ఒప్పుకొన్నారు. ముందే అనుకుని నీపేరిట కొన్నాం. మామయ్యకు కూడా ఇవాళే తెలిసింది. కొనగలిగే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇలా చేశాం. లేకపోతే ఎలా ఉండేదో! ఇక మీ తమ్ముడు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు!” అంటూ..
“మామయ్యా! నీకు శరత్ ఎంతో.. మేమూ అంతే! మా దగ్గర నువ్వేమీ మొహమాట పడొద్దు. కొన్నిసార్లు పిల్లల మాటలుకూడా పెద్దవాళ్లు వినాలి. సరేనా!” అన్నది కేశవకేసి చూస్తూ.
హృదయం తేలికపడగా.. నీళ్లునిండిన కళ్లతో కేశవనూ, లక్ష్మినీ చూస్తూ ఉండిపోయింది లలిత.
నెల్లుట్ల రమాదేవి
పుట్టిల్లు.. ఏ మహిళకైనా మరపురాని జ్ఞాపకం. మరి ఆ పుట్టింటికి కష్టం వచ్చినప్పుడు ఓ మహిళ, ఆమె కుటుంబం ఎలా స్పందించిందో చెప్పే కథ.. అమ్మ పుట్టిల్లు. రచయిత్రి నెల్లుట్ల రమాదేవి. స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్. ఎంఏ (ఎకానమిక్స్) చేశారు. ఆంధ్రా బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కార్టూన్లు గీయడం, కథలు, కవిత్వం రాయడం వీరి ప్రవృత్తి. మనసు భాష (కవిత్వం), రమణీయం (కార్టూన్లు), మనసు మనసుకూ మధ్య (కథలు), చినుకులు (నానీలు), తల్లి వేరు (కథలు) పుస్తకాలను వెలువరించారు. తొలి కవితా సంపుటికి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, కార్టూనిస్టుగా అపురూప అవార్డు, తెలంగాణ ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ రచయిత్రి (వరంగల్ జిల్లా)’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్తు, సిద్దిపేట వారి ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురస్కారం, గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు, గుఱ్ఱం జాషువా ఫౌండేషన్ పురస్కారం, పర్చా రంగారావు స్మారక అవార్డు, తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురస్కారంతోపాటు అనేక అవార్డులు, సన్మానాలు పొందారు.
నెల్లుట్ల రమాదేవి
94406 22781