నాన్న పోయాక అమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండలేదని తెలుసు. అయినా నాతో తీసుకువెళ్లడానికి మనసొప్ప లేదు. అమ్మకి కూడా నాతో హైదరాబాద్ వచ్చేయాలనే ఉంది. నా భార్య విద్య ఇప్పుడైతే.. ‘అమ్మని మనతో తీసుకెళ్దాం!’ అని అంటోంది. కానీ, రేపు హైదరాబాద్ వెళ్లాక అత్తగారి పైన పెత్తనం చేయదని గ్యారెంటీ లేదు. నాకు తెలిసి అమ్మకి ఇప్పుడే కొంచెం స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చాయి. నాన్న ఉన్నన్నాళ్లూ ఆయనకు భయపడుతూ బతికింది. ఆయన మాటకు ఎదురు చెప్పడానికి లేదు. పోనీ నచ్చచెబుదామంటే వినే మనిషి కాదు ఆయన. అమ్మ అడుగడుగునా నాన్న మాటకి విలువిచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? ఎలా మాట్లాడాలో కూడా ఆయనే నిర్దేశిస్తారు. నాన్న పూర్తిగా చెడ్డవాడని నేను అనుకోలేను. అందరి నాన్నలూ మా నాన్న లాంటి వారు కూడా అయి ఉండకపోవచ్చు. భార్యలు వంటిల్లు దాటకూడదనే సత్యకాలపు మనిషి. అంతేకాదు నా చిన్నప్పుడు ఆయనకు ‘జల్సా రాయుడు’ అనే బిరుదు కూడా ఉండేది. ‘తాతలు సంపాదించిన డబ్బు అంతా తిరుగుళ్లకే సరిపోయింది’ అని నానమ్మ ఎప్పుడూ వాపోతూ ఉండేది. ఆయన్ని చూశాక ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. ఆయన్ని భరిస్తున్న అమ్మ పట్ల ప్రేమ, గౌరవం ఇంకా నాకు ఎక్కువయ్యాయి.
అలాంటి అమ్మ.. ఊరు దాటి సిటీకి వచ్చి, ఉద్యోగస్తురాలైన విద్య దగ్గర ఉండలేదు. అందుకే అన్నీ ఆలోచించుకొని అమ్మని ఊర్లోనే ఉంచడం ఆమెని గౌరవించినట్టు అనుకున్నాను. ఈరోజు అమ్మ స్వతంత్రంగా బతకొచ్చు. రేపు మా నాన్న స్థానాన్ని విద్య తీసుకొని.. ‘అత్తయ్య! మీరు ఈ పని చేయండి! ఆ పని చేయండి! ఇలాగే చేయండి!’ అని శాసిస్తే.. అందుకే ఇదే విషయం అమ్మతో చెప్పాను.“ఏం! ఆమాత్రం కోడలు చెప్తే తప్పేంటి? మా ఇద్దరికీ మనస్పర్ధలు రావు. వచ్చినా నేనే ముందుగా సర్దుకుంటాను” అని నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది.ఎన్నాళ్లు అమ్మ ఇలా సర్దుకుని బతకాలి? అభిరుచులు చంపుకొని ఉంటూ.. యాభై సంవత్సరాలు గడిచిపోయాయి. శేషజీవితంలో అయినా ఆమెకి ఉన్న స్వల్ప కోర్కెలు, స్వంత అభిప్రాయాలు నెరవేర్చుకోనివ్వాలి. భర్త, కొడుకు, కోడలు తర్వాత.. మనవలు! ఒక హోమ్ మేకర్ స్త్రీని ఎల్లప్పుడూ శాసిస్తారనడానికి అమ్మే సాక్ష్యం!
అందుకే దృఢంగా చెప్పాను..“అమ్మా! రేపు పటుత్వం తగ్గాక ఎలాగూ తప్పదు. ఇప్పుడు ఏ ఆరోగ్యసమస్య లేనిదశలో స్వేచ్ఛగా ఇక్కడే ఉండు. దగ్గర్లోనే మామయ్య వాళ్లున్నారు. మాట సాయం చేస్తుంటారు. ఈ ఊర్లోనే ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఇక్కడ అందరూ నీకు తెలుసు. నాన్న ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావో అలాగే ఇప్పుడూ ఉండు. నీకు ఎప్పుడు రావాలని ఉందని చెప్పినా, నేను వస్తాను. నిన్ను తీసుకొని వెళ్తాను. అప్పటిదాకా వారాంతాల్లో మేమే వస్తూపోతూ ఉంటాము” అని గట్టిగా తేల్చి చెప్పాను.
ఇల్లు బాగా పాతబడి పోయింది. ఊరవతల ఉండే స్థలం అమ్మి ఆ డబ్బుతో ఇల్లంతా రీ మోడలింగ్ చేయించాను. బతికి ఉన్నప్పుడు అనుభవించక ఇక ఆస్తిపాస్తులు దేనికి అనిపించింది. అమ్మకి సౌకర్యవంతమైన జీవితం ఇవ్వాలి అందుకే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, సురక్షిత నీటికోసం వాటర్ ప్యూరిఫైయర్ సమకూర్చాను. అమ్మ ఇప్పుడు ఒక పెద్ద టీవీలో తనకిష్టమైన ఛానల్ పెట్టుకోవచ్చు. అభ్యంతరం చెప్పేవారు లేరు. మా అమ్మకి ఇంకా మా అత్తయ్యకి కూడా నెలరోజులపాటు యాత్ర స్పెషల్ బస్సు కూడా బుక్ చేశాను. ఆమె చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూసి రావచ్చు.
ఆఫీస్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి కొద్దిరోజులు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. విద్య కూడా బాబుని వాళ్లమ్మ దగ్గర వదిలేసి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటోంది. ఆసమయంలో ఒకరోజు రాత్రి అమ్మ దగ్గరనుండి ఫోన్ వచ్చింది.ఆమె గొంతు చాలా నీరసంగా ఉంది. పది రోజులుగా ఆరోగ్యం బాగోకపోతే సుశీలత్త హాస్పిటల్‌కి తీసుకు వెళ్లిందట. డాక్టర్లు అన్ని టెస్టులు చేశారట. అయితే ఒక పీస్ బయాప్సీ కోసం ల్యాబ్‌కి పంపించారట. ఆ రిజల్ట్ రెండు రోజుల్లో వస్తుందట. అమ్మ ఎందుకో నిస్సత్తువగా చెప్తుంటే భయమేసింది.వయసుతోపాటు బీపీ, షుగర్ లాంటివి వస్తుంటాయి. దానికి అధైర్యపడే మనస్తత్వం కాదు ఆమెది. ఆమె గుండె నిబ్బరం కలిగిన మనిషి. అలాంటిది ఈరోజు ఇలా డీలా పడిపోయి మాట్లాడుతుంటే ఏదోలా అనిపించింది.
అసలు డాక్టర్ ఏం చెప్పాడో, ఎందుకు బయాప్సీ చేశారో ఏమీ అర్థం కాలేదు. వర్క్ టెన్షన్ ఒకవైపు.. త్వరగా సబ్మిట్ చేసి, తొందరగా అమ్మ దగ్గరికి ఇండియా వెళ్లాలి. సుశీలత్తకి ఫోన్ చేశాను. అమ్మకి క్యాన్సరేమో అని అనుమానమంట. అది మొదటి స్టేజ్‌లోనే ఉంటే మంచిదే… లేదంటే కొంచెం కష్టమే అంటున్నారు అంది.
అయ్యో! భగవంతుడా.. ఆమె ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నది ఆమెపై నీకెందుకు ఇంత నిర్దయ! అనిపించింది. ఈ ఫోన్ రాకముందు పది నిమిషాల క్రితం ముందు ఆహ్లాదంగా ఉందనుకున్న అమెరికాలోని హోటల్ గది.. ఇప్పుడు ఎటు చూసినా చాలా నిరాసక్తంగా.. విసుగ్గా అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆస్వాదించిన జలపాతం సవ్వడి ఒరవడి, పాషాణఘోషగా వినిపిస్తోంది. గది అంతా చీకటిగా అనిపించింది. ఆ చీకటి నా హృదయాన్ని, శరీరాన్ని ఆక్రమించేసి ఆపుకోలేనంత దుఃఖం కమ్మేసింది.వెంటనే విద్యకి ఫోన్ చేసి చెప్పాను. వీలైనన్ని రోజులు లీవ్ తీస్కొని, బాబుతో వెళ్లి అమ్మతో గడపాలని. నిజంగానే లీవ్ దొరకలేదో.. ఏమో తెలీదుగానీ, తనకు వీలు పడదని, ఆమెనే ఇక్కడికొచ్చి ఉండమని విద్య చెప్పింది. లేదా.. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేయడమే ఇప్పుడు కరెక్టు. లేదా.. కావాలంటే, కేర్ టేకర్‌ని పెడతానని తన కుశాగ్ర బుద్ధి ప్రదర్శించింది.
నేను ఇండియా వెళ్లి అమ్మని చూసుకోగలిగే దాకా..అమ్మని దగ్గరుండి చూసుకోవడానికి ఒక మనిషి తోడు అవసరం అనిపించింది నాకు. విద్య దగ్గర కేర్ టేకర్‌ని పెట్టడం కంటే.. ఊరిలోనే, అమ్మకి ధైర్యం ఉన్న చోటే ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాను.కొద్దిరోజుల తర్వాత అమ్మ దగ్గర నుండి మళ్లీ ఫోన్ వచ్చింది. అత్తయ్య వాళ్లు, దూరపు బంధువులు ఇంటి వైపు రావడం మానేశారని. అమ్మకి శారీరకమైన జబ్బు కంటే.. వాళ్లు ఎవరూ అంతగా ఇంటి వైపు రాకపోవడం బాధ కలిగించిందని వాపోయింది. అయితే నేను ఏర్పాటు చేసిన అమ్మాయి సొంత కూతురిలాగా చూసుకుంటుందని, ఇంటిపని – వంటపనితోపాటు అమ్మకి తినిపించడం, రాత్రింబవళ్లు అమ్మని కంటికి రెప్పలా కాచుకుంటున్నదని, ఇటువంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టమని మంచి సర్టిఫికెట్ ఇచ్చేసింది.“సమయానికి మందులు ఇస్తుంది. ఆ అమ్మాయికి కూడా దగ్గర వాళ్లు ఎవరూ లేరు. అందుకే, ఇక శాశ్వతంగా మన దగ్గరే ఉంచుకుందాం రా” అంది అమ్మ.ఈరోజు అమ్మ గొంతులో విశ్వాసం నాకు దూరమైన ప్రశాంతతని దగ్గరికి చేర్చింది. అమ్మని మామూలు మనిషిని చేస్తున్న ఆ అమ్మాయి దుర్గకి చాలాసార్లు మనసులోనే ధన్యవాదాలు చెప్పాను.
నేను ఇండియా వస్తూనే… అమ్మ దగ్గరికి వెళ్లాను. ఎందుకో అమ్మ నాతో సరిగా మాట్లాడలేదు. నేను సంతోషంగా ఇంట్లోకి వెళుతూనే.. నవ్వుతూ ఎదురొస్తుంది అనుకున్నాను. ఏదో ముక్తసరిగా మాట్లాడి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఏమైందో అర్థం కాలేదు.అప్పుడు దుర్గ నా దగ్గరికి వచ్చి..
“నిన్న మా ఊరతను పనుండి ఈ ఊరు వచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారో.. అమ్మగారితో చాలాసేపు మాట్లాడి వెళ్లాడు” అని చెప్పింది.అయితే అమ్మకు విషయం అర్థమైపోయింది అన్నమాట! ఏదో ఒకరోజు ఈరోజు వస్తుందని ముందే ఊహించాను. కానీ, ఎలా మొదలు పెట్టాలో.. ఏం చెప్పాలో అర్థం కాలేదు.ఫ్రెష్ అయి వస్తానని చెప్పి మిద్దెపైన నా గదిలోకి వెళ్లాను. అమ్మకి నాపైన కోపం వచ్చిందని అర్థమవుతున్నది. కానీ, ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కావడం లేదు.
నేను హాస్టల్లో ఉండి బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రోజులు. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ అడిగింది..“ఒరేయ్! మన పాలేరు అప్పన్న మీ నాన్నకి ఎవరో ఆడవాళ్లతో సంబంధం ఉందని అంటున్నాడు. నిజమేనంటావా? ఆయన ఏం చేసినా భరించాను. పేకాటలో డబ్బుంతా పోగోడుతున్నా ఏనాడు ఎదురు చెప్పలేదు. కానీ, సవతి పోరు అయితే భరించలేను. ఆడది ఏమైనా సహిస్తుంది కానీ.. తన స్థానంలో వేరే మనిషికి ఆశ్రయమిస్తే భరించలేదు!” అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది.ఆరోజు అమ్మ అలా చాలాసేపు బాధపడుతూనే ఉంది. అమ్మ బాధ చూడలేక..
“అమ్మా! అలా ఏంకాదమ్మా! బాధపడకు. నేను కనుక్కుంటాను. అప్పన్న ఒట్టి గాలి మనిషి. గాలి కబుర్లు మోసుకొస్తాడు. అదిగో పులి అంటే ఇదిగో… అంటాడు. వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు తిండి తిప్పలు మానేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను ఈ సెలవుల్లో మొత్తం విషయం కనుక్కుంటాను!” అని ధైర్యం చెప్పాను.నా మాటలకు అమ్మ కుదుటపడింది.
అమ్మకి ధైర్యమైతే చెప్పాను కానీ, నాన్నని నమ్మడానికి లేదు. ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు ఏమైనా చేసే ఉంటాడు. అమ్మ నా చేతులు పట్టుకుని ఏడ్చిన విషయం నాకు పదేపదే గుర్తు వచ్చేది. పడుకున్నా నిద్రపట్టేది కాదు. నా కళ్లల్లో కూడా నీళ్లు తిరిగేవి.
‘అన్నీ పంచుకునేందుకు అమ్మకు ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేది. నేను ఉండి ఏం లాభం!?’ అని నన్ను నేను నిందించుకున్నాను.
మా నాన్న చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ బాబాయ్‌ని కలిశాను. ఆయన మా ఊరి నుంచి రెండు ఊళ్ల అవతల ఉంటున్నాడు. ఆయన మొదట నాన్న విషయం బయట పెట్టలేదు. నేను పదేపదే బలవంతం చేస్తే.. నన్ను ఊరి చివర పోలేరమ్మ గుడి దగ్గర గుడిసె దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి బయటికి వచ్చింది. మంచి ఒడ్డు – పొడుగు, ఆకర్షణీయమైన కళ్లు, నిండు పసిమి ముఖవర్చస్సు,ఉంగరాల జుట్టు, గుండ్రని భుజాలు, పొందికైన తలకట్టు, బారెడు జడ వేసుకొని..“ఎవరండీ?” అంటూ..
వాళ్ల అమ్మ కోసం వచ్చామని తెలుసుకొని, దగ్గరలోనే ఉన్న గుడి దగ్గరికి వెళ్లి వాళమ్మను తీసుకొని వచ్చింది. శ్రీనివాస్ బాబాయ్‌ని చూస్తూనే, ఆమె రెండు చేతులు జోడించి చాలా వినయంగా..“అన్నయ్యా! బాగున్నారా? ఆయన ఎలా ఉన్నారు?” అని అడిగింది.నేనెవరో.. ఎందుకు వచ్చానో మొత్తం చెప్పాడు బాబాయ్.
వెంటనే ఆమె నావైపు తిరిగి..“బాబూ! మేము మీ ఊరువైపు వచ్చే సాహసం కూడా చేయం. ఆయన్ని కంటితో చూసి దాదాపు పదేళ్లు అయ్యింది. దీని
ఎనిమిదో ఏట పుట్టిన రోజుకి రావడమే! అప్పుడు కూడా ఈ ఊర్లో పొలం కౌలుకుఇస్తానని అబద్ధం చెప్పి వచ్చారట. మేము చానా పేదోళ్లం. అంతకుముందు అయ్యగారు డబ్బైనా పంపేవారు. ఇప్పుడు అదినూ లేదు! ఆ గుడి శుభ్రం చేసుకుంటూ.. ఎవరైనా పెడితే తింటున్నాం!” అని బోరున ఏడ్చింది.‘ఛీ!.. నేను ఎంత పాపిని. ఆమెను ఏడిపించే హక్కు, నిలదీసే హక్కు నాకు ఎక్కడిది?’ అనిపించింది.అప్పుడే శ్రీనివాస్ బాబాయ్ అంతా చెప్పాడు. ఆమె పొలాన్ని తాకట్టు పెట్టి విడిపించుకోలేకపోతే.. మా నాన్న ఆమెను లోబరుచుకుని, తనకి పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఆమెను మోసం చేశాడని..ఏదైతే నిజం కాకూడదు అనుకుంటూ అక్కడికి వెళ్లానో.. అదే కళ్లముందు వాస్తవమై పారదర్శకమవుతుంటే.. నాకు శ్వాస ఆడలేదు. ఏదో ముళ్లకంప నా నెత్తిన పడినట్లు అనిపించింది.
ఆరోజు నుంచి వాళ్లకు ఏ కష్టాలూ రాకుండా ఈరోజు వరకూ చూసుకుంటూ వచ్చాను. నాన్న చనిపోయినప్పుడు కూడా దూరం నుంచి చూసి వెళ్లేలా ఏర్పాటు కూడా చేశాను. ఒక అన్నలా దుర్గకి దన్నుగా నిలబడ్డాను. మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి కూడా చేద్దామనుకుంటుంటే.. అప్పటికే
సుష్కించిన వాళ్ల అమ్మ శరీరం భూలోకాన్ని వదిలేసింది. చెల్లి బాధ్యతను నాకు అప్పగించేశాననే ధీమాతో.. నేను అమ్మని చూసుకోవడం కోసం ఒక కేర్ టేకర్‌ని చూస్తున్నానని తెలిసి.. దుర్గ ఒప్పుకోలేదు. సొంత కూతురులా కంటికి రెప్పలా తానే చూసుకుంటానంది. ఈ అవకాశం ఇవ్వమని
బతిమాలింది. అలాగే అమ్మను మామూలు మనిషిని చేసింది.
ఆరోజు అమ్మతో.. నాన్న అలాంటి వాడు కాదనీ, నేను వాకబు చేశాననీ అబద్ధం చెప్పాను. అదే అమ్మతో ఈ రోజు నిజం చెప్పాలి. అయితే సవతి కూతురుతో తనకు సపర్యలు చేయించానని తెలిస్తే….‘ఏది ఏమైనా చెప్పాలి!’ అని నిర్ణయించుకుని కిందకు వచ్చాను.అమ్మ వంట గదిలోకి వెళ్లి వేడిగా కాఫీ తీసుకొని వచ్చింది.“నువ్వు దేని గురించి నాతో మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. చూడు నాన్నా! వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు! స్వార్థం, ఆవేశం, బాధ, అహం అన్ని కంచెలా అల్లుకుపోతాయి. పాపం.. ఇప్పటికే మనవల్ల దుర్గ, వాళ్లమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంత వయసు అయిపోయాక నేను ఎవరిని సాధిస్తాను? అన్యాయం చేసి పోయిన మీ నాన్ననా? అమ్మని పోగొట్టుకొని, నాలో తన అమ్మని వెతుక్కున్న ఈ అమ్మాయినా? సొంత కూతురు కంటే ఎక్కువ సేవచేసింది ఇన్నాళ్లు. ఈ అమ్మాయి ఎవరో తెలియనప్పుడు నాకు రాని కోపం.. ఇప్పుడు వస్తే అది నా లోపం అవుతుంది. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నానంటే.. అది దుర్గ వల్లే. నాకు మరో జన్మ ఇచ్చిన ఈ చిట్టి తల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం.. మీ నాన్న బాధ్యతని నువ్వు నెరవేర్చినట్టు అవుతుంది” అంది.
కాఫీ గడగడా తాగేసి ఒక్కసారిగా అమ్మని హత్తుకున్నాను. అప్పటికే కళ్లల్లో నీళ్లు తిరిగిపోతున్న దుర్గని కూడా అమ్మ దగ్గరికి తీసుకుంది.
మా ఇద్దరి తల నిమురుతూ..“నా ఆయుషు కూడా పోసుకొని ఇద్దరూ తోడపుట్టిన వాళ్లలాగా సంతోషంగా ఉండండి..” అంది.సొంత అత్తయ్య అనే బాధ్యతని విస్మరించిన ఉన్నత విద్యా, ఉద్యోగవంతురాలైన నా విద్య కన్నా.. అమ్మే ఉన్నతంగా కనిపిస్తోంది. అమ్మ ఆదిదైవమై ఓనమాలు దిద్దించడమే కాదు.. తన దొడ్డ మనసుతో, బతుకు పాఠాన్ని కూడా నేర్పుతోంది. యుక్తాయుక్త విచక్షణ, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకోడానికి.. ఏ పెద్దపెద్ద చదువులు, ఉద్యోగాలు, హోదాలు అవసరం లేదని థర్డ్ ఫారం వరకు మాత్రమే చదువుకున్న మా అమ్మ నిరూపించింది.
నేను హాస్టల్లో ఉండి బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రోజులు. ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ అడిగింది..“ఒరేయ్! మన పాలేరు అప్పన్న మీ నాన్నకి ఎవరో ఆడవాళ్లతో సంబంధం ఉందని అంటున్నాడు.నిజమేనంటావా? ఆయన ఏం చేసినా భరించాను. పేకాటలో డబ్బుంతా పోగోడుతున్నా ఏనాడు ఎదురుచెప్పలేదు. కానీ, సవతి పోరు అయితే భరించలేను.ఆడది ఏమైనా సహిస్తుంది కానీ.. తన స్థానంలో వేరే మనిషికి ఆశ్రయమిస్తే భరించలేదు!” అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది.ఆరోజు అమ్మ అలా చాలాసేపు బాధపడుతూనే ఉంది.
అమ్మ బాధ చూడలేక.. “అమ్మా! అలా ఏంకాదమ్మా!బాధపడకు. నేను కనుక్కుంటాను. అప్పన్న ఒట్టి గాలి మనిషి. గాలి కబుర్లు మోసుకొస్తాడు. అదిగో పులి అంటే ఇదిగో… అంటాడు. వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు తిండి తిప్పలు మానేస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది.నేను ఈ సెలవుల్లో మొత్తం విషయం కనుక్కుంటాను!”అని ధైర్యం చెప్పాను.
జి.వి. హేమలత
‘అమ్మే ఆదిదైవం. ఆమె మనసు అనంతరం’ అని తన కథ ద్వారా చాటుతున్నారు రచయిత్రి జి.వి. హేమలత. గుంటూరు వీరి స్వస్థలం. ఉపాధ్యాయురాలిగా ఇరవై మూడేళ్ల అనుభవం ఉంది. కథలు, కవితలు చదవడం, రాయడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నారు. ప్రేమ్ చంద్ (ధనపతి రాయ్) రచనలంటే అభిమానం. వాస్తవ విషయాల్ని కథలుగా మలిచే అయన సాహిత్యం కోసమే.. హిందీపై పట్టుసాధించారు. ఎం.ఎ (హిందీ) పూర్తి చేశారు. భర్త శ్రీధర కుమార్ ప్రోత్సాహంతో కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు చేసిన రచనలు చాలా తక్కువ. ఆ కొద్ది కథలకి కూడా వివిధ కథల పోటీల్లో బహుమతులు అందుకున్నారు. డిజిటల్ పత్రికలకు కథలు, కవితలు పంపుతూ సాహితీ సేవ కొనసాగిస్తున్నారు. బాలికల అక్షరాస్యతా శాతాన్ని పెంచడం కోసం వివిధ కార్యక్రమాలు రూపొందించారు. బాలికలకు ప్రేరణ కలిగేలా కొన్ని రచనలు చేశారు. విద్యార్థుల కోసం ‘జాగృతి’ అనే గీత సంపుటి రాశారు. విద్యార్థులతో ఆమె రూపొందించిన పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారం కావడం విశేషం. 2018లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి
రూ.5 వేలు పొందిన కథ.
-జి.వి. హేమలత
99483 45218