అకుబర్ దర్బారుల బీరుబల్ అంటె శానామందికి పడుతలేదు. పాదుషా అకుబర్ అయిందానికి, కానిదానికీ బీరుబల్కు జరంత ఎక్వ ఇత్తుండని అందరు లోపల్లోపట గులుక్కోవట్టిండ్లు. ఓపారి అకుబర్ తానికి వోయి.. “బీరుబల్ వట్టోడే! మీరే ఎక్వ పతార ఇత్తుండ్లు!” అని మొత్తుకున్నరు. దానికి అకుబర్.. “సరే! బీరుబల్ తెల్విని మీ ఇచ్చ మీరే సూడుండ్లి!” అని చెప్పి, పొయ్యి సభల గూసున్నడు. అంతట్లకే మంత్రులు, షికాయతు జేసినోళ్లు, బీరుబల్ అందరు సభలకు అచ్చిండ్లు. అకుబర్ ఎంటనే.. “ఇయ్యాళ్ల ఒకలు నా శాతిమీద దన్నిండ్లు.
ఆళ్లకు ఏం శిచ్చ ఎయ్యాలె చెప్పుండ్రి!” అని అడిగిండు. అందరూ.. “సంపుండ్రి.. నరుకుండ్రి.. కొట్టుండ్రి!” అని, మనిషికో తీర్గ ఒర్రిండ్లు. బీరుబల్ సప్పుడు జెయ్యకుంట గూసున్నడు. గప్పుడు పాదుషా.. “అగో! బీరుబల్ నువ్వేం అంటలెవ్వు! ఏం జేద్దాం?” అని మల్ల అడిగిండు. దానికి బీరుబల్.. “పాదుషా! ఎంటనే కంసాలిని విలిపిచ్చి, మిమ్ముల్ని తన్నిన కాళ్లకు బంగారి కడాలు జేయించాలె!” అని జెప్పిండు. గా మాట ఇని.. ‘బీరుబల్కు పిచ్చి లేశింది.
ఇగ ఆయినె పనైంది!’ అని అందరూ గుసగుసలాడ వట్టిండ్లు. ఎంటనే అకుబర్.. “ఎందుకు జేయించాలె?” అని అడిగిండు. దానికి బీరుబల్.. “పాదుషా! కాలితోని తన్నిండని జెప్పుకొంట మీరు ముశిముశి నవ్వులు నవ్విండ్లు. అంటె.. మీ మనువణ్ని మీరు ఎత్తుకున్నప్పుడు తన్నుంటడు. గందుకే, బంగారి కడాలు జేయించుమన్నా!” అని జెప్పిండు. శికాయతు జేసినోళ్ల దిక్కు సూశి.. కండ్లెగరేశిండు అకుబర్. ఆళ్లు తల్కాయలు నాలకేసుకున్నరు.
ఎడారి జీవులైన ఒంటెలకు ఈతరాదు. అయితే, గుజరాత్తోని కచ్ ప్రాంతంలో కనిపించే ‘ఖడాయ్’ జాతి ఒంటెలు మాత్రం అద్భుతంగా ఈత కొడతాయట. సుమారు మూడు కిలోమీటర్ల దూరం దాకా ఇవి అలుపు లేకుండా ఈదేస్తాయట.
ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
భావం : మనిషి.. పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించడానికి తనవంతు కృషి చేయాలి. అలా చేయనివారి బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులోని కొంగ చాలాకాలం బతుకుతాయి. కానీ, ఆ జీవితం వల్ల వాటికి ఏం ప్రయోజనం కలుగుతున్నది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇలానే అవుతుంది.