‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
“ఈరోజువంట చాలా బాగుంది. నువ్వే చేశావా?” అన్నాడు ప్రకాశ్.
“నేను చెయ్యలేదు. కొత్త వంట మనిషి దొరికింది. నెమ్మదస్తురాలు. వంట బాగా చేస్తుంది. శుచి, శుభ్రత కూడా ఉన్నాయి. బతికి చెడ్డ మనిషిలా ఉంది” అంది సుమిత్ర.
“కోపం తెచ్చుకోకు.. తినగానే అనుకున్నాను. నువ్వు చెయ్యలేదని. నీకన్నా బాగా చేసింది”.
“అవును లెండి. పొరుగింటి పుల్లకూర రుచి అన్నారు. ఇన్నాళ్లూ నేను చేస్తుంటే లొట్టలు వేసుకుని తిన్నారుగా” అంది మూతి మూడు వంకరలు తిప్పుతూ.
ప్రకాశ్ అలా అన్నాడని కోపం వచ్చినా అతని మాటల్లో నిజం ఉంది. ఆమె వంట అద్భుతంగా
ఉందనడంలో అతిశయోక్తి లేదు.
“ఇంతకీ ఈమెను ఎక్కడ పట్టావు? ఎప్పుడు వచ్చింది?” అన్నాడు.
“పట్టడం ఏమిటీ? ఈమధ్య ఎక్కువసేపు నించుంటే కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. అందుకని, వంటమనిషి కావాలని, నా ఫ్రెండ్ రమని అడిగితే.. ఈమెను పంపింది. మీరు ఊళ్లో లేనప్పుడు వచ్చింది. నాకు నచ్చి పెట్టుకున్నాను” అంది సుమిత్ర.
ప్రకాశ్‌కు మంచి ఉద్యోగంతోబాటు ఆస్తిపాస్తులూ బాగానే ఉన్నాయి. ఫ్లాట్ కల్చర్ వచ్చినా స్థలం కొని డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. కింద వంటిల్లు, స్టోర్ రూం, డైనింగ్ రూం, పూజ గది, ఒక బెడ్ రూం.. పైన మూడు బెడ్ రూంలు ఉన్నాయి. పనివాళ్లు వెనక పెరటివైపు నుంచి వస్తారు కాబట్టి, ప్రకాశ్‌కు తారసపడే అవకాశం తక్కువ. అయినా అతనికి తన ఆఫీస్, క్లబ్, ఫ్రెండ్స్ తప్ప ఇల్లు పట్టించుకోడు. అన్నీ సుమిత్రే చూసుకుంటుంది. పిల్లల పెంపకం, చదువులు.. అన్ని బాధ్యతలూ ఆమెవే. ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అమ్మాయి కూడా కాలేజ్‌కి వచ్చింది.
వాళ్లిద్దరి మధ్య దెబ్బలాటలు లేవు కాబట్టి, అందరూ అన్యోన్య దాంపత్యం అనుకుంటారు.
ఆరోజు ఒంట్లో బాగుండక ఆఫీస్‌కి వెళ్లలేదు ప్రకాశ్. డల్‌గా ఉన్న భర్తను చూసి..
“ఏమయ్యింది?” అని అడిగింది సుమిత్ర.
“కొద్దిగా జ్వరం వచ్చినట్లుగా ఉంది” అన్నాడు.
“అయ్యో! నాకు ఇవాళ కాలేజ్‌లో మీటింగ్ ఉంది. పోనీ సెలవు పెట్టనా?”.
“వద్దు. నువ్వు కాలేజ్‌కు వెళ్లు. ఫరవాలేదు. నేను ఉంటాను”.
“నేను ఇవాళ కాలేజ్‌లోనే లంచ్ చేస్తాను. వంటామె వచ్చి వంటచేసి వెళ్లిపోతుంది. ఆమె దగ్గర వంటింటి తాళం ఉంది. వెనకవైపు నుంచి వస్తుంది. మీకు ఇబ్బంది లేకుండా. వీలుంటే నేను తొందరగా వస్తాను. లేకపోతే డైనింగ్ టేబుల్ మీద గాయత్రి అన్నీ పెడుతుంది. ఆకలి వేసినప్పుడు తినండి. బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడు తింటారా? లేక తరువాత తింటారా?”.
“వద్దు.. ఏం తినాలని లేదు. నువ్వు నీ పనులుమానక్కర్లేదు”.
సుమిత్ర కాలేజ్‌లో లెక్చరర్. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు కొన్నాళ్లు చెయ్యలేదు. తరువాత ప్రకాశ్ తన ప్రపంచం తాను ఎన్నుకోవడంతో.. ఆమె కూడా తన ప్రపంచం తను చూసుకోక తప్పలేదు.
ప్రకాశ్ చెడ్డవాడు కాదు కానీ, స్వార్థపరుడు. అతని సమయంలో భార్యకు, పిల్లలకు వెచ్చించేది తక్కువనే చెప్పొచ్చు. పెళ్లయిన వెంటనే అతని మనస్తత్వం అర్థం చేసుకున్న సుమిత్ర, తామిద్దరూ సమాంతర రేఖలమని గ్రహించి.. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకుంది. పిల్లలకు కూడా తల్లి దగ్గరే చనువు. ఏం కావాలన్నా అమ్మ మీద ఆధారపడటం అలవాటై పోయింది. ఎపుడైనా సినిమాకి, పిక్నిక్కి వెళ్లినప్పుడే తండ్రి సమక్షం దొరికేది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రకాశ్ మంచి తండ్రిగా వ్యవహరించేవాడు. అందుకని తండ్రి తన ఉద్యోగంలో బిజీగా ఉండి తమతో సమయం గడపలేక పోతున్నాడని పిల్లలు అనుకున్నారు.
ప్రకాశ్ నిద్ర లేచి టైం చూసుకున్నాడు. పదకొండు అవుతోంది. సుమిత్ర కాలేజ్‌కు వెళ్లాక మేడపైకి వచ్చి పడుకుంటే.. మంచి నిద్ర పట్టేసింది. అంతలోనే ఫోన్ మోగింది. చూస్తే సుమిత్ర.. ఫోన్ లిఫ్ట్ చేసి..
“హలో” అన్నాడు.
“మీరు లేచారా? మందేమైనా వేసుకున్నారా?”
“లేదు. నువ్వు వెళ్లాక పడుకుంటే ఇప్పుడే తెలివి వచ్చింది. కిందకు వెళ్లి ఒక కప్పు కాఫీ కలుపుకొని తాగుతాను”
“సరే! నేను వీలైనంత తొందరగా వచ్చేస్తాను”
“ఫరవాలేదు సుమిత్రా! నేను ఉండగలను. టూర్లో ఉన్నప్పుడు ఒంట్లో బాగుండక పోతే నన్ను నేను చూసుకోవటం లేదూ!”
నిజమే.. ఏమిటో ఈ భార్యలు భర్తను కూడా పిల్లల్లా చూసుకుంటారు. భర్తకు ఒంట్లో బాగుండకపోయినా ఆమెలోని అమ్మతనం నిద్ర లేస్తుంది. తన ఆలోచనకు తానే నవ్వుకుంది సుమిత్ర.
మేడ దిగి కిందకు వచ్చి, వంటింటి వైపు అడుగులు వేశాడు. వంటింట్లో ఎవరో ఉన్నట్లు చప్పుడు వస్తోంది. దొంగలు వచ్చే అవకాశం లేదు. మెల్లిగా వెళ్లి వంటింట్లోకి తొంగి చూసాడు. గ్యాస్ వెలుగుతోంది. అటువైపు తిరిగి ఒక ఆడమనిషి కూరగాయలు తరుగుతోంది. వంట మనిషి వచ్చి వెళ్లిపోయిందని అనుకున్నాడు.
“నాకు ఒక కప్పు కాఫీ ఇస్తారా?” అన్నాడు ఆమెను ఉద్దేశించి.
ఆ మాటతో వెనుతిరిగిన ఆమె, ప్రకాశ్.. ఇద్దరూ స్థాణువులై పోయారు.
ప్రకాశ్ రెండడుగులు వెనక్కి వేశాడు. అతణ్ని అక్కడ చూసిన గాయత్రి పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది.
‘ఇదేంటి మేమిద్దరం.. ఇక్కడ, ఇలా కలుసుకున్నాం’ అని ఇద్దరూ అనుకున్నారు.
ముందుగా గాయత్రి తేరుకుని..
“మీరు వెళ్లి కూర్చోండి. నేను ఇప్పుడే కాఫీ కలిపి తెస్తాను. మేడం ఫోన్ చేసి, మీకు ఒంట్లో బాగాలేదంటే.. వేడిగా వండుదామని ఇప్పుడే వచ్చాను” అంది.
మాట్లాడకుండా డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చున్నాడు. పది నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అతని ముందున్న టేబుల్‌పైన ఉంచి, పక్కనే బిస్కెట్స్ కూడా పెట్టి వంటింట్లోకి వెళ్లిపోయింది గాయత్రి.
ఆమెను మళ్లీ ఇలాగ, తన ఇంట్లో చూస్తానని కలలో కూడా అనుకోలేదు.
అతను ఎప్పుడైనా ఎదురు పడవచ్చని అనుకున్నా.. ఇలా తారసపడతాడని గాయత్రి కూడా అనుకోలేదు.
కొద్దిసేపటికి వంట పూర్తిచేసి, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి.. వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. ఆమె అంత మామూలుగా ఎలా ప్రవర్తిస్తోందో ప్రకాశ్‌కి అర్థం కాలేదు. అతని మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి. ఆమెకు అలవాటేనేమో! రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ ఆమె తారసపడితే అసలు సంగతి సుమిత్రకు తెలిసిపోతుందన్న భయం పట్టుకుంది అతనికి.
ఆలోచనలను పక్కనపెట్టి కాఫీ తాగాడు. మనసు సరిగాలేక భోజనం చెయ్యబుద్ధి కాలేదు. ఆకలిని జయించలేక.. లేచి భోజనం చేశాడు. పడుకుంటే ఇట్టే నిద్ర పట్టేసింది. చల్లని చెయ్యి నుదురు తడుముతుంటే తెలివి వచ్చింది. అది సుమిత్రదని అతనికి తెలుసు. అప్రయత్నంగా ఆ చెయ్యిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు.
“జ్వరం తగ్గిందా! భోజనం చేశారా? గాయత్రి కాఫీ కూడా కలిపి ఇచ్చినట్లుంది. ఇవాళ వంట వద్దన్నాను. మీకు ఒంట్లో బాగోలేదని తెలిసి, మీకు వేడిగా వండి పెడతానని చెప్పింది గాయత్రి. చూశారా! ఎంత మంచిదో?” అంది సుమిత్ర.
సుమిత్ర రాగానే ఆమెను మాన్పించమని అందామనుకున్న ప్రకాశ్‌కు.. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టుగా అయ్యింది. ఆ విషయం మాట్లాడటానికి ఇది సమయం కాదని..
“ఆ తిన్నాను. టీ పెట్టు. తాగుదాం” అన్నాడు.
“సరే! మీరు మొహం కడుక్కుని కిందికి రండి. ఈలోపు టీ చేస్తాను” అంటూ కిందికి వెళ్లింది.
తనలోని అలజడిని ఆమె ఎక్కడ పసిగడుతుందో అని భయపడ్డాడు.
సుమిత్ర అతనిలోని అలజడిని చూడలేదు.
ఒంట్లో బాగుండక డల్‌గా ఉన్నాడనుకుంది.
ఇద్దరూ కలిసి టీ తాగారు. మధ్యాహ్నం చేసిన వంట ఇంకా మిగిలింది. పొద్దున వచ్చి బ్రేక్‌ఫాస్ట్, వంట.. రెండూచేసి వెళ్లిపోతుంది. సాయంకాలానికి ఇంకో కూర చేస్తుంది. కూతురు రమ్య, సుమిత్ర లంచ్‌బాక్స్ పట్టుకుని వెళ్తారు. ప్రకాశ్ ఆఫీస్‌లోనే తింటాడు. రాత్రికి సుమిత్ర, అన్నం కానీ రొట్టెలు కానీ వేడిగా చేస్తుంది. ప్రకాశ్ ఎక్కువగా ఊళ్లో ఉండడు. కొడుకు హాస్టల్లో ఉన్నాడు. రోజూ కూతురికి, తనకి రాత్రి వంట గురించి పట్టింపులేదు. ప్రకాశ్ లేనప్పుడు రమ్య ఎప్పుడైనా స్నేహితులతో బయటికి వెళ్తే.. సుమిత్ర ఒక్కర్తే
అవుతుంది. ప్రకాశ్ ఊళ్లో ఉన్నప్పుడు ఒక్కోసారి బయటికి వెళ్లి తిందామంటాడు. అలాంటప్పుడు మిగిలిన వంట మర్నాడు పనివాళ్లకు ఇచ్చేస్తుంది.
ఇంటికి వచ్చిన గాయత్రి మనసు కూడా అలజడిగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ల అవసరాలలో అలజడి మరుగున పడింది.
గాయత్రి అందరి ఆడపిల్లల్లాగే కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. భర్త మంచివాడే. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. అన్నీ బాగుంటే జీవితం ఏముంది? గాయత్రి చల్లని కాపురంలో కలకలం. ఆఫీస్ నుంచి వస్తున్న రవి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. డిగ్రీ పూర్తిచేసినా ఉద్యోగం చెయ్యాలని అనుకోలేదు. ఉన్నదానితోనే ఆనందంగా గడపాలన్న ఆలోచన ఆమెది. రవి కూడా ఎప్పుడూ ఆమెను.. ‘ఇది చెయ్యి!’ అని శాసించ లేదు.
రవి ప్రైవేట్ ఉద్యోగి. కాబట్టి, ఆఫీస్ నుంచి పెద్దగా డబ్బులు రాలేదు. ఇద్దరు పిల్లలని సాకాలంటే గాయత్రి ఉద్యోగం చెయ్యక తప్పదు. రవి ఆఫీస్‌లోనే అడిగింది. ఖాళీలు లేవన్నారు. ఆఖరికి ఏ పనైనా చేసి పిల్లల్ని పోషించుకోవాలని, ఒక స్కూల్లో ఆయాగా చేరింది. కొద్దిరోజులు బాగానే నడిచింది. కానీ, ఒకరోజు ఒక టీచర్ పిల్లలకు పాఠం తప్పుగా చెప్తుంటే.. ఆగలేక ఆ తప్పును సవరించింది. దాంతో, ఆమెపై లేనిపోని చాడీలు చెప్పి, ఆమె ఉద్యోగం పోవడానికి కారణ భూతురాలయ్యింది ఆ టీచర్.
మళ్లీ ఉద్యోగాల వేట. ఉద్యోగాలు అంత తొందరగా దొరుకుతాయా? పోనీ ట్యూషన్స్ చెప్దామంటే చుట్టుపక్కల అందరూ కాన్వెంట్ స్కూల్ పిల్లలే. కాబట్టి గాయత్రి దగ్గరికి ఎవరూ రావడానికి ఇష్టపడేవారు కాదు. పిల్లల ఆకలి తీర్చాలి. వాళ్ల అవసరాలు తీర్చాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివించినా, తిండి, బట్టకూ డబ్బు కావాలి.
ఆరోజు గాయత్రి జీవితంలో కాళరాత్రి. ఇప్పటికీ ఆరోజును తల్చుకుంటే ఆమె ఒళ్లు జలదరిస్తుంది. పిల్లవాడికి ఒళ్లు తెలియని జ్వరం. అప్పటికి వాళ్లు భోజనం చేసి రెండు రోజులయ్యింది. ‘అమ్మా.. ఆకలి!’ అంటున్న పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కు పోతోంది. ఎలాగోలాగ పిల్లల కడుపు నింపాలని.. తమ్ముణ్ని చూసుకోమని కూతురికి చెప్పి బయటికి నడిచింది గాయత్రి.
అమ్మ ఎక్కడికి వెళ్తుంది? బయటికి వెళ్తే ఎవరైనా డబ్బులు ఇస్తారా? అడుక్కోకూడదని అంటుంది అమ్మ. మరి ఎవరు ఇస్తారు?.. ఇలా అన్నీ ప్రశ్నలే ఆ చిన్ని బుర్ర నిండా.
మర్నాడు గాయత్రి మామూలుగానే పనిలోకి వచ్చింది. అప్పటికి ప్రకాశ్ ఇంట్లోనే ఉన్నాడు.
సుమిత్ర కాఫీ కలపమంటే ఇద్దరికీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్లిపోయింది.
కాఫీ తాగుతూ..
“వేరే వంట మనిషిని చూడు సుమిత్రా”? అన్నాడు.
“ఎందుకు? గాయత్రి బాగానే చేస్తోందిగా” అంది.
“నాకు నచ్చలేదు” అన్నాడు ఏం అనాలో తెలియక.
“నిన్న ఏమైనా జరిగిందా? వంట బాగాలేకపోతే చెప్పండి”
“ఆమె మంచిది కాదు”
“మంచిది కాదంటే.. దొంగతనం చేసిందా? నాకు అలా అనిపించలేదే?”
“కాదు.. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు”
“మీకెలా తెలుసు?”
“నా ఫ్రెండ్ చెప్పాడు”
ఎందుకో.. భర్త ఏదో దాస్తున్నాడని అనిపించింది సుమిత్రకు.
“మీ ఫ్రెండ్‌కు ఈమె ఎలా తెలుసు? అయినా, ఆమెను ఇన్నాళ్లూ మీరు చూడలేదు కదా! మీ ఫ్రెండ్ చెప్పింది ఈమే అని మీకు ఎలా తెలుసు?” అని గుచ్చిగుచ్చి అడిగింది సుమిత్ర.
అప్పుడే.. ఏం వండాలో అడగడానికి వచ్చిన గాయత్రి నోరు విప్పింది.
“ఆయన ఫ్రెండ్ చెప్పలేదు. ఆయనే చెప్తున్నారు”.
“అసలు ఏమైందో స్పష్టంగా చెప్పండి. ఇలా ఇద్దరూ చెరో వాక్యం చెప్తే నాకు ఎలా అర్థం అవుతుంది?”
“జరిగిన సంగతి మీరు చెపుతారా? నేను చెప్పనా?” అన్నది గాయత్రి.
“సిగ్గు లేకుండా చేసిన పని చెప్తావా?” కాస్త కోపంగానే అన్నాడు ప్రకాశ్.
“మీకు లేని సిగ్గు నాకెందుకు?” అంది మొండిగా.. ఆరోజు సంఘటనను తల్చుకుని, కన్నీళ్లు వస్తున్నా.
ఆ మాటతో ఆమె నిజం చెప్పేస్తుందని భయం వేసినా..
“చెప్పు! నాకేం భయం నేను మగవాణ్ని” అన్నాడు మొండిగా.
“అవును! మగవాడు ఏం చేసినా చెల్లుతుంది. మగవాడు చేస్తే తప్పు కాదు. ఆడది చేస్తే తప్పు. అది లోకనీతి. మగవాడు చేస్తే జల్సా పురుషుడు. ఆడది చేస్తే విచ్చలవిడి. అంతేనా ప్రకాశ్ గారూ?” అంది గాయత్రి.
ఆమె తెగింపు చూసి ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది.
“అసలు సంగతి నేను చెప్తాను మేడం. ఇలా ఈయన్ని మళ్లీ కలుస్తానని కానీ, ఆరోజు మళ్లీ తల్చుకోవాలని కానీ, ఈ పరిస్థితి వస్తుందని కానీ నేను అనుకోలేదు”.
అంతా అయోమయంగా ఉంది సుమిత్రకు. విషయం కొంతవరకూ అర్థమైంది.
ప్రకాశ్ కోపంగా ఏదో చెప్పబోయాడు.
“ఆమెను చెప్పనివ్వండి” అంది సుమిత్ర తన గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టింది గాయత్రి.
“ఏ ఆడదీ చెడిపోవాలని అనుకోదు. పవిత్రంగా ఒక భర్తకే కట్టుబడి ఉంటుంది. నా భర్త పోయాక చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేసి నా పిల్లల్ని పోషించుకోవాలని అనుకున్నాను. కానీ ఉద్యోగాలు అంత తొందరగా దొరకవని నాకర్థం అవడానికి కొంత సమయం పట్టింది. డబ్బు నిల్వలేం పెద్దగా లేవు. ఉన్నదాంట్లో ఆనందంగా బతుకుతున్న మా జీవితాల్లో.. రవి చావుతో భూకంపం వచ్చినట్లు కంపించి పోయాం. బాబుకు జ్వరంగా ఉంది. మందు ఇప్పించాలంటే డబ్బులు కావాలి. రోజు కూలీ చేసైనా మందుకు డబ్బులు తెద్దామని బయటపడ్డాను. ఎక్కడా ఏ పనీ దొరక లేదు. పిల్లలే కళ్లముందు కదులుతున్నారు. పొద్దుటినించీ ఏం తినలేదు. కను చీకటి పడుతున్న వేళ.. నా శరీరం స్వాధీనం తప్పింది. అలా ఎంతసేపు గడిచిందో నాకు తెలియదు.
కళ్లు తెరిచిన నేను మత్తుగా ఒక మెత్తటి పరుపు మీద పడుకున్నట్లుగా గ్రహించాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్లు పూర్తిగా తెరిచిన నాకు.. ఎదురుగా సిగరెట్ తాగుతూ మీ ఆయన కనిపించారు. నా ఒంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు గ్రహించాను.
‘నాకేమైంది’ అన్నాను మెల్లిగా.
‘రోడ్ మీద పడిపోతే నేనే ఇక్కడికి తెచ్చాను’అన్నారాయన.
ఏదో జరిగిందని నా మనసు చెపుతోంది. రోడ్ మీద పడిపోతే ఇక్కడికి ఎందుకు తేవాలి? హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలి కదా! ఎదురుగా గోడ గడియారం తొమ్మిది చూపిస్తోంది. పిల్లల్ని తలచుకుని, గుండె గుభేలుమంది.
‘నన్నేం చేశారు?’ అని గట్టిగా అరిచాను.
‘నీ అందం నన్ను పిచ్చివాణ్ని చేసింది. అందుకని నీ శరీరంతో కాసేపు ఆడుకున్నాను. ఇదిగో దాని విలువ’ అంటూ.. ఐదువేలు నా మొహాన విసిరికొట్టాడు ఈ పెద్దమనిషి.
‘నేను కళ్లు తిరిగి పడిపోయాను కానీ.. ఇంత జరిగినా నాకెలా తెలియలేదు’
‘నాకు ఎదురు తిరుగుతావని, మత్తుమందు కలిపిన నీళ్లు తాగించాను’
‘అంటే.. ఇలాంటి పని ఇంతకుముందు కూడా చెయ్యడం అలవాటు ఉందన్నమాట’
‘హా! అప్పుడప్పుడూ’ అంటూ ఒక వంకర నవ్వు.
జరిగింది తల్చుకుని నా మీద నాకే అసహ్యం వేసింది. ఎదురుగా ఉన్న రాక్షసుణ్ని చూసి భయం వేసింది.
‘ఎందుకిలా చేశావు?’
‘ఇంకోసారి నీ ఇష్టంతో ఒప్పుకొంటే పదివేలు ఇస్తాను’ అన్నాడు.
నా నోటివెంట ‘ఛీ!’ అన్న మాట వెలువడింది.
తొందరగా అక్కడినించి పారిపోవాలి. మత్తుగా ఉన్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని, మంచం దిగాను. బైటకు నడుస్తున్న నన్ను ఉద్దేశించి..
‘డబ్బులు తీసుకో’ అన్నాడు.
మంచం మీద ఉన్న నోట్లను చూశాను. నా పిల్లల ఆకలి కళ్ల ముందు కదిలింది. ఒక మృగం ఆకలి ఖరీదు.. నా పిల్లలకు నెల రోజులు తిండి పెడుతుంది. పోయిన శీలం తిరిగి రాదు.. అని అనుకున్న నేను.. ఆ నోట్లను తీసుకుని బయటపడ్డాను. ఇప్పుడు చెప్పండి.. ఇందులో నా తప్పేం ఉంది? నేను ఎంతవరకు బాధ్యురాల్ని” అంది గాయత్రి.
“అంతా అబద్ధం” అన్నాడు ప్రకాశ్ తన తప్పు దాచుకునేందుకు.
“ఆమె చెప్పింది అబద్ధం అయితే.. ఆమె చెడిపోయిందని ఎందుకు అన్నారు?” అని నిలదీసింది సుమిత్ర.
అతను మాట్లాడలేదు.
“ఫాంహౌజ్‌కి వెళ్తారని తెలుసు. మందు పార్టీకి వెళ్తారేమో అనుకున్నాను. అందరి ఆడవాళ్లలాగా నా భర్త శ్రీరామచంద్రుడు అనుకున్నాను. కానీ, ఇంత నీచులని అనుకోలేదు. నిజం చెప్పండి. గాయత్రి మీ ఆకలి మంటలో కాలిన ఎన్నో శలభం?” అంది సుమిత్ర.
సుమిత్ర కళ్లలోకి చూసిన ప్రకాశ్‌కి ఒక్కసారిగా భయం వేసింది. అంతకుముందు ఎప్పుడూ ఆమెను అలా చూడలేదు.
“అదికాదు సుమిత్రా! కళ్లు తిరిగి పడిపోయిన ఆమెను చూడగానే సహాయం చేద్దామని కార్ ఆపాను. ఆమెను ఎత్తి సీట్లో పడుకో పెడుతున్నప్పుడు ఆమె అందం నన్ను పిచ్చివాణ్ని చేసింది. అందుకే ఆ తప్పు చేశాను” అన్నాడు.
“రెండు రోజులు తిండి లేకపోయినా ఆమె తన ఆకలిని అదుపులో పెట్టుకుంది. కానీ, మీరు మీ శరీరానికి వేసిన ఆకలిని ఆమెను మోసం చేసి తీర్చుకున్నారు. ఇందులో చెడిపోయింది ఆమెకాదు ప్రకాశ్.. మీరు!” అంది సుమిత్ర.
“ప్రకాశ్ గారూ! నేను చెడిపోయినదాన్నయితే ఒకరాత్రికి ఐదు వేలిచ్చే మీలాంటి వాళ్లు ఈ లోకంలో చాలామందే ఉండి ఉంటారు. తప్పు ఒకసారి చేసినా మళ్లీమళ్లీ చేసినా పెద్ద తేడాలేదు. వంటలక్కగా ఆకలి తీర్చిన దానికన్నా.. మీలాంటి వాళ్ల ఆకలి తీరిస్తే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది కదా! నేను ఆ పని చెయ్యకుండా మీ ఇంట్లో వంటకి ఎందుకు వస్తాను? ఇది మీ ఇల్లని తెలిస్తే అస్సలు వచ్చేదాన్ని కాను. రేపటినుంచి పనిలోకి రాను మేడం” అంది గాయత్రి.
పర్స్‌లోంచి ఒక పదివేలు తీసి గాయత్రి చేతిలో పెట్టింది సుమిత్ర.
“అదేంటి మేడం.. ఇంత డబ్బు ఇచ్చారు?”
“మళ్లీ పని దొరికేదాకా నీ పిల్లలు, నువ్వు పస్తులు పడుకోకుండా ఉండటానికి. నువ్వు క్యాటరింగ్ చేసుకుంటానంటే డబ్బు పెట్టుబడి పెట్టి, కస్టమర్స్‌ని చూస్తాను” అంది సుమిత్ర.
అస్సలు ఊహించని షాక్ మర్నాడు తగిలింది ప్రకాశ్‌కి. అతను పొద్దున లేచేసరికి సుమిత్ర ఇంట్లో కనిపించలేదు. కూతురు కూడా లేదు.
సుమిత్ర ఎక్కడికి వెళ్లింది? కోపం వచ్చి వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి ఉంటుందని ఫోన్ చేశాడు.
“సుమిత్ర వచ్చిందా అండీ” అన్నాడు.
“అదేంటి బాబూ! నీకు చెప్పకుండా మా ఇంటికి ఎందుకు వస్తుంది? ఏమైనా గొడవపడ్డారా?”
ఇన్నేళ్ల కాపురంలో అలా ఎప్పుడూ జరగలేదు.
అక్కడికి వెళ్లలేదని తెలిసింది. అత్తగారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. అల్లుడు అలా అడిగేసరికి ఆమెకు కంగారు వచ్చింది.
వాట్సాప్‌లో మెసేజ్ చూశాడు.
‘ఇంక మనం కలిసి ఉండటం కుదరదు. ఇన్నాళ్లూ మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. పిల్లల మూలంగా సర్దుకుపోతానని అనుకోవద్దు. అలా అని పిల్లలకు నిజం చెప్పలేను. ఏం చెయ్యాలో ఆలోచించుకోండి’ అని ఉంది.
పరువు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించకుండా సుమిత్ర అలాంటి పని చేస్తుందని అతను ఊహించలేదు.
ఆడదాని బతుకు, ముళ్లపొద మీద వేసిన చీరలాంటిది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. అతని అన్ని ఆకళ్లు తీర్చడానికి ఆడదాని మీద ఆధారపడక తప్పకపోయినా.. ఆడదంటే చులకన.
సుమిత్ర సలహాని అమలు చేసి.. క్యాటరింగ్ ద్వారా ఎంతోమంది ఆకలిని, మిగిలిన భోజనాలతో నిజమైన అన్నార్తుల ఆకలి తీర్చడానికి నడుం కట్టుకుంది గాయత్రి.
సుజల గంటి
అందరి ఆకలితీర్చే ఆడదాన్ని ఆకలి చూపులు చూసే మగ పుంగవులు ఉన్నంతవరకూ.. ఆడదానికి భద్రత లేదన్న విషయమే ‘ఆకలి’ కథకు మూలం. రచయిత్రి సుజల గంటి. కలం పేరు అనురాధ. రాజమండ్రిలో పుట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో విద్యాభ్యాసం చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్.. వీరి క్లాస్మేట్. ఎకనమిక్స్‌లో డిగ్రీ, ఇంగ్లిష్‌లో ఎంఏ చేశారు. హిందుస్థానీ సంగీతంలో పట్టభద్రురాలు. వారసత్వంగా కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. సంగీతం – సాహిత్యాలు వీరికి రెండు కళ్లు. 2011 (60వ ఏట) నుంచి రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టారు.
ఏది రాయాలన్నా కొత్త సబ్జెక్ట్ కోసం ఆలోచిస్తారు. ఇప్పటివరకూ 80 కథలు, 23 నవలలు రాశారు. రెండు కథా సంపుటాలు, 13 నవలలు, మూడు పిల్లల నవలలు పుస్తకాల రూపంలో వెలువరించారు. వీరి మొదటి నవల ‘అమ్మ బంగారు కల’కు అనిల్ అవార్డు దక్కింది. ఈ నవల ఇంగ్లిష్, తమిళం భాషల్లో అనువాదమైంది. మరికొన్ని కథలు తమిళం, కన్నడ భాషల్లో అనువాదమయ్యాయి. ఒక కథ కెనడాలో రేడియో నాటకంగానూ ప్రసారమైంది. రెండు పిల్లల నవలలకు ‘తానా’ బహుమతులు గెలుచుకున్నారు. భాషా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది.
సుజల గంటి
77023 19351