Ramayanam | మొన్నీమధ్య పాత పుస్తకాలు, కాగితాలు సర్దుతుంటే.. పెద్ద ఉత్తరాల కట్ట బయటపడింది. కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో గదులు తెరిచినప్పుడు పెన్నిధి కనిపిస్తే.. అక్కడున్న వాళ్లకు ఎలా ఉండిందో గానీ, నాకు మాత్రం గొప్ప నిధి దొరికినట్టు అనిపించింది. ఇక సర్దడం ఆపేసి, వాటిని చదవడం మొదలుపెట్టాను.
చిన్నప్పుడు మా ఇంటికి బాగానే ఉత్తరాలు వచ్చేవి. వాటిలో ఎక్కువగా క్షేమసమాచారాల ఉత్తరాలే. ‘మహారాజశ్రీ రాజమాన్య రాజపూజితులైన.. గారి చరణ సన్నిధికి’ అనే సంబోధనతో మొదలయ్యేవి. ‘ఇట్లు తమ విధేయుడు’ అనో; ‘తమ శ్రీ చరణాశ్రితుడు’ అనో; ‘బుధజన విధేయుడు’ అనో ఉండేవి. ఆడవాళ్లు ఉత్తరాలు రాయడం అరుదు. కొన్ని కుటుంబాల్లో నేరం కూడా. ఆరోజుల్లో అమ్మాయిలకు చదువు చెప్పించే వాళ్లు కూడా.. ‘ఆ.. ఆడిపిల్లకు అంత చదువెందుకు? మొగడికి ఉత్తరాలు రాసుకుంటే చాలు’ అనేవాళ్లట. అసలు అలా రాసినా తగినంత ప్రైవసీ ఉండేదో.. లేక ఆ మొగుడి గారికొచ్చిన ఆ ఉత్తరాన్ని ఇంటిల్లిపాదీ రేడియోలో వార్తల్లాగా చదివేవారేమో!
అలాంటి రోజుల్లో ఆడవాళ్లు వాళ్ల ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తపర్చడానికి ఎన్ని అడ్డంకులుండేవో! అలాంటప్పుడు ఎవరైనా ఇల్లాలు తన భర్తకు రాసే ఉత్తరం కూడా ‘పూజనీయులైన శ్రీవారి పాద పద్మములకు’ అని మొదలుపెట్టి, ‘ఇట్లు మీ చరణదాసి’ అని తప్ప.. మరోవిధంగా ఉండే అవకాశమే లేదని మా అమ్మ చెప్పేది. ప్రియమైన అనిగానీ, డియర్ అని గానీ ఉందంటే.. పెద్ద తప్పు చేసినట్టే! ఏదో కథ ఉందని భావించేవారట. ఇప్పుడైతే ‘డియర్’ ఏమొచ్చే, ‘డార్లింగ్’ అని కూడా పబ్లిక్ గానే, ఉత్తుత్తి వాళ్లకూ వాడుతున్నారు.
ఇక ఆడవాళ్లకు ఉత్తరాలు రావడమే తక్కువ. ఒక పెళ్లికాని అమ్మాయికి ఉత్తరం గానీ వచ్చిందంటే.. ఇంటివాళ్ల మాట అటుంచి చుట్టుపక్కల వాళ్ల నోట్లో నీళ్లు ఊరుతుండేవి. పాతకాలంలో స్త్రీలను ‘శ్రీ మహాలక్ష్మీ సమానురాలైన..’ అనో; భర్త పోయిన ఆడవాళ్లనయితే ‘గంగా బాగీరథీ సమానురాలైన’ అనో సంబోధించేవారు.
అప్పట్లో పెళ్లిళ్లకు తప్ప ఆహ్వానపత్రికలు ప్రింట్ చేయడం ఉండేది కాదు. అన్నిటికీ ఉత్తరాలే రాసేవారు. అలా నేను చూసిన ఒకట్రెండు ఉత్తరాల గురించి చెబుతాను. సంబోధనలు అయ్యాక.. ‘మా ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి ఇందిర (లేకపోతే పద్మ, కాకపోతే సరళ) పరాభవ నామ సంవత్సర మాఘ బహుళ విదియ నాడు ప్రథమ రజస్వల అయినది. ఫలానా రోజున ఇంటిలోనికి వచ్చుచున్నది. ఆ రోజున అమ్మాయికి ఫలపుష్ప నూతన వస్త్రములు, పిండివంటలు బహుకరించ తలచనైనది. కావున మీరు సకుటుంబముగా విచ్చేసి, బాలికను ఆశీర్వదించి మమ్మానందింపజేయ ప్రార్థన’.. ఇలాంటి ఓ ఉత్తరం వచ్చినప్పుడు నేను మా నాన్నను “ప్రథమ రజస్వల అంటే ఏంటిది? నానా!” అని అడిగినట్టు జ్ఞాపకం. నాన్న మరునిమిషంలో నన్ను జెట్ స్పీడ్తో అమ్మ దగ్గరికి పంపాడు.
అమ్మ ఆ రోజంతా వెయిట్ చేయించి సాయంత్రమయ్యాక కూచోబెట్టుకుని వివరంగా చెప్పింది. ‘మరి ఇంటిలోనికి వచ్చుచున్నది అంటేంది? అన్ని రోజులు ఎక్కడుంటది?’ మళ్లీ ప్రశ్నించాను. అమ్మ జవాబు చెప్పింది గానీ, ఆ పద్ధతి నాకేం నచ్చలేదు. ఇదంతా కలిగినవాళ్ల సంగతి. ఎక్కువమంది ఆడపిల్లలు ఉన్నవాళ్లూ, ఓ మాదిరి సంసారాలవాళ్లూ అంత గొప్పగా, బాహాటంగా చేసేవాళ్లు కారు. ఈ మధ్య మళ్లీ ‘చీర కట్టిచ్చుడు ఫంక్షన్, ఇంట్లకొచ్చుడు ఫంక్షన్’ అంటూ చాలామంది విపరీతంగా ఖర్చు చేసి ఘనంగా ఫంక్షన్లు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్ని నెలల కింద ఓ గృహిణి తమ కూతురు ఓణీల ఫంక్షన్ ఘనంగా చేయడానికి భర్త దగ్గర డబ్బుల్లేక ఒప్పుకోకపోతే.. తన మాట చెల్లలేదని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాక్ అయ్యాను.
మరో ఆహ్వాన పత్రికలో.. ‘తే. ఫలానాకు సరియగు తిథి ఫలానా నామ సంవత్సర ఫలానా మాస ఫలానా పక్ష ఫలానా తిథి రోజున ఉదయం ఫలానా గంటలకు మా తృతీయ పుత్రుడు చి.రామకృష్ణారావు-మంజుల గార్ల ప్రథమ పుత్రుడు చి. సంపత్ కుమార్కు కేశఖండనమున్నూను, కర్ణ భేదనమున్నూను జరుపబడును. కావున మీరు’.. అని రాయడం షరా మామూలే! కేశఖండనము అంటే పుట్టువెంట్రుకలు తీయడం, కర్ణ భేదనము అంటే చెవులు కుట్టించడం అని అడిగి తెలుసుకున్నాను. ముఖ్యంగా మగపిల్లల పుట్టువెంట్రుకలు తీయడాన్ని పెద్ద ఉత్సవంలా చేసేవారు. మగపిల్లలకు కూడా చెవులు కుట్టించేవారట. ఇక ఉపనయనాలు కొన్ని కులాల వారికే పరిమితం. సీమంతాలు కూడా కొందరే జరిపేవారు. వాటిని ‘ఒడి నింపుడు’ అనేవారు.
‘పురుషులలో పుణ్య పురుషులు వేరయా’ అన్నట్లు.. ‘పిల్లలలో మగపిల్లలు వేరయా’ అని తీరాల్సిందే. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారినా, ఇప్పటికీ మగపిల్లాడు పుడితే ఎక్కువ గొప్పే! ఆ రోజుల్లో ఆడపిల్ల పుడితే కన్నతండ్రే చూడ్డానికి రాని సంఘటనలుండేవి. బాలింత తల్లిదండ్రులు అమ్మాయి అత్తవారికి ఆ విషయం చెప్పడానికే భయపడేవారట. మొదట డెలివరీ అయ్యాక ఒక ఉత్తరం ద్వారా దగ్గరివారికి సమాచారం తెలిపేవారట. అలాంటి ఒక లేఖ కూడా ఆ కట్టలో నాకు కనిపించింది.
‘స్వస్తి. శ్రీ చాంద్రమాన ప్లవ నామ సంవత్సర ఫలానా రోజున మా ద్వితీయ పుత్రిక సౌభాగ్యవతి విజయలక్ష్మి, మహారాజశ్రీ ఫలానా ఫలానా వారి పుత్రుడు శ్రీ వాసుదేవరావు దంపతుల నవజాత శిశువైన ప్రియపుత్రునికి నామకరణ డోలారోహణ మహోత్సవము జరుపుటకు నిర్ణయింపనైనది. కావున మీరు సకుటుంబంగా..’ ఇక ఖాళీలు మీరే పూరించుకోండి. ఇప్పటి మొబైల్సూ, వాట్సాప్లూ, మెయిల్స్, డిజిటల్ ఇన్విటేషన్స్ కాలంలో ఆనాటి ఆహ్వాన పత్రికలు, వాటిలోని భాష కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది కదూ!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి