‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
ఏమిటింత ఆలస్యం? ఎందుకు లేటయింది?”.
అప్పటివరకూ ఎంతో సహనంతో ఉన్న నిగ్రహం తను రాగానే అసహనంగా మారింది.
ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వచ్చి తను ఎప్పుడూ కూర్చునే మంటపం మెట్టు మీద కూర్చుంది. అది నాలోని అసహనాన్ని మరింత పెంచింది.
ఆమె పక్కనే కూర్చుంటూ మళ్లీ అడిగాను..
“నువ్విలా ఆలస్యంగా రావడం, మౌనంగా ఉండటం నేను సహించలేనని నీకు తెలుసు. అయినా ఈరోజెందుకిలా చేశావ్? గంటన్నర లేటు. గుడి మూసే వేళకూడా అయింది. వెళ్లిపోదామని బయల్దేరుతున్నాను తెలుసా?” నాకు తెలీకుండానే నాలో కోపం హెచ్చింది.
ఉన్నట్టుండి ఆమె హఠాత్తుగా అరిచినట్లుగా అన్నది.
“వెళ్లిపోండి! ఈరోజు నేను మీ కోసం రాలేదు. నిజంగానే కాసేపు ఆ దేవుణ్ని చూస్తూ మనశ్శాంతిని పొందుదామని వచ్చాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపోండి”.
నిర్ఘాంతపోయాను నేను.
“భవానీ.. నువ్వేనా మాట్లాడేది?” నమ్మలేనట్లుగా ప్రశ్నించాను.
ఆమె బదులివ్వకుండా తల తిప్పి గర్భగుడిలోని దేవుడి విగ్రహం వైపు చూడసాగింది.ఏం జరిగిందో తెలీక నా మెదడు స్తబ్ధుగా అయిపోయింది.
ఆమె చెప్పసాగింది..
“రాత్రి.. సుమతి కొడుక్కి చలిజ్వరం వచ్చింది. డాక్టర్ని పిలిపించి ఇంజక్షన్, మందులూ ఇప్పించారు. కొద్దిసేపయ్యాక వాడికి చలి తగ్గి ఊపిరాడక లేచి ఏడ్వడం మొదలుపెట్టాడు. సుమతి వచ్చి కాసేపు విసనకర్రతో వాడికి విసిరి, ఆ తర్వాత నిద్ర ఆపుకోలేక ఆ పని నాకు అప్పగించి వెళ్లి పడుకుంది. మీకు తెలుసుగా.. మా ఇంట్లో ఫ్యాన్ పనిచేయడం లేదన్న సంగతి. రాత్రంతా నిద్రలేదు. విసనకర్రతో విసిరీ, విసిరీ చేతులు బాగా పట్టేశాయి. తెల్లవారుజామున మళ్లీ రెండు తొట్టెల నిండా నీళ్లు మోయించింది. నా బాధ ఎవరికి చెప్పుకోను? వెంటనే మీ దగ్గరికి రావాలనిపించింది. కానీ మీరు మాత్రం ఏం చేస్తారు? ‘ఎవరి పని వాళ్లు చేసుకుంటే తప్పేం ఉంది!’ అంటూ నన్నే మందలిస్తారు. రోజూ నాలుగింటికల్లా వచ్చేదాన్ని. ఈ రోజింత ఆలస్యమైందంటే కారణం.. హాస్పిటల్కెళ్లి
పడుకొని నిద్రపోవడమే!”.
“ఏమిటీ..?” ఈసారి మరింత ఆశ్చర్యపోయాన్నేను.
“మీకాశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ, నాకు అలాగేం అనిపించలేదు. నిద్రలేక కళ్లు మంటలు పుట్టి నీళ్లు కారుతున్నాయి. కాళ్లు పీక్కుపోతున్నాయి. కనీసం ఒక్క గంటైనా పడుకుంటానని అడిగే ధైర్యం సుమతి దగ్గర నాకు లేదు. చెప్పాను కదా.. ఒక్క సెకను కూడా తను నన్ను ఖాళీగా కూర్చోనివ్వదు. అందుకే హాస్పిటల్ కెళ్తున్నానని చెప్పి వెళ్లాను. అక్కడ నాలాంటివాళ్లే గాక ఇంకా కొందరు అనాథలూ, దేశదిమ్మరులూ వరండాలో, చెట్ల కిందా, బెంచీల మీద పడుకొని హాయిగా నిద్రపోతుంటారు. ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ధైర్యంతోనే వెళ్లి వరండాలో పడుకున్నాను. ఒళ్లు తెలీని నిద్ర పట్టేసింది. లేచేసరికి టైమ్ దాటిపోయింది. మీరు ఎదురుచూస్తుంటారని గుర్తొచ్చి గబగబా నడిచి వచ్చాను..” అన్నది భవాని.
“నడిచొచ్చావా? అంతదూరం నుంచీ?” కమ్ముకోబోతున్న ఆర్ద్రత నాలోంచి బాధగా వ్యక్తమైంది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఈ రాములవారి గుడి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కణ్నుంచి ఎనిమిది రూపాయల ఛార్జీతో వస్తుందామె రోజూ.
“దాచుకున్న పది రూపాయల నోటు.. నిద్రపోతుంటే ఎవరో కొంగుముడి విప్పదీసి దొంగిలించుకుపోయారు!”.
చలించిపోయాను నేను..
“క్షమించు భవానీ! నీ పరిస్థితి తెలీక అనవసరంగా కోప్పడ్డాను. అసలు నువ్వొస్తావో, రావోనన్న దిగులు నాకు తెలీకుండానే నన్ను కలవరపెడుతుంటే.. క్షణక్షణానికీ టెన్షన్ పెరిగిపోయి.. చివరికి నిన్ను చూడగానే అప్పటివరకూ నాలో ఉన్న అసహనాన్ని నీపైన కోపంగా ప్రదర్శించాను. అంతే!” అన్నాను ఆర్తిగా. అది వినగానే ఆమె హృదయంలో కదిలిన అనురాగం ఉప్పెనయి కళ్లలోకి చేరిందేమో.. నావైపు చూస్తూ అదే భావంతో అడిగింది..
“ఎందుకు నామీద మీకింతటి అభిమానం?”.బదులుగా నా చూపుల్ని శూన్యంలోకి సారించాను. “నీకు తెలీదు భవానీ.. నాకు అందరూ ఉన్నా ఇన్నాళ్లుగా ఒంటరిగా, ఇంట్లోవాళ్ల అపనిందలు, అవమానాలతో ఆత్మాభిమానాన్ని చంపుకొంటూ గడుపుతున్న నాకు.. అనుకోకుండా ఈ గుడిలో జరిగిన నీ పరిచయం, దొరికిన నీ సాన్నిధ్యం నాకో కొత్త మజిలీని చూపింది. ఏదో తపన! అందులో అపవిత్రత లేదు, వాంఛ లేదు. అలసిపోయిన నా మనసుకు నీ స్నేహం ఓ ఊరటలాగా అనిపించింది. నీ స్నేహంలో నాకు ఒకలాంటి నిశ్చింత లభిస్తున్నది. నా ఆరాటం మానసికమైనది. అది ఈ ప్రపంచానికి అర్థంకాదు. సమాజపు కట్టుబాట్లను నేను పట్టించుకోను. నాకు నువ్వు కావాలి. నీకు నా తోడు కావాలి. ఇద్దరికీ ఇద్దరి అవసరం ఉంది. చి..వ..రి..దా..కా..!” ఏదో ధ్యానంలోంచి వెలువడ్తున్నట్లుగా ఉన్నాయి నా మాటలు.
“నాకూ మీరు కావాలి. కానీ, అది సాధ్యమా?” అస్పష్టంగా అన్నది భవాని.
“ఎందుకు సాధ్యం కాదు? నీకోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను!” స్థిరత్వం ధ్వనించింది నా స్వరంలో.
ఆ స్థిరత్వం ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనడానికి సూచనగా తేలికగా నిట్టూర్పు విడుస్తూ..
“నాకు మీమీద నమ్మకం ఉంది. అందుకే దేవుడి గుళ్లో మీ దైవత్వాన్ని ఆస్వాదిస్తూ ఇంటికెళ్లాక ఆ అనుభూతితోనే నిశ్చింతగా ఉండగలుగుతున్నాను” అన్నది.
“మనలాంటి వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టే వ్యక్తిత్వం అందరిలోనూ ఎందుకుండదు? స్వార్థం, ద్వేషం, కుతంత్రాలు, మరణాలు.. ఇవన్నీ ఎందుకిలా రాజ్యమేలుతున్నాయి? అన్నీ తెలిసికూడా అందులోనే ఎలా నవ్వుతూ ఉండగలరో నాకర్థం కాదు”.
నా మాటలు వింటూ నావైపే చూస్తున్నది భవాని. దూరంగా ఆకాశంలో సాయంసంధ్యలోని పసుపుదనం కిందికి పరచుకుంటూ వచ్చి భవాని శిరసును అభిషేకిస్తున్నది. అప్రయత్నంగా నా చూపులు ఆమె ఫాలభాగం మీద నిలిచిపోయాయి.
“ఏమిటీ.. రోజూ రాములవారి గుడి దగ్గర ఎవతినో కల్సుకోవడానికి వెళ్తున్నావట? ఏంటి కథ?”.
ప్రసాద్ కంఠంలో కర్కశత్వం నా వ్యక్తిత్వాన్ని నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంటే.. చివ్వున తల తిప్పి చూశాను.
“ప్రేమాయణమా..?” వెటకారంగా అన్నాడీసారి.
“పదాలు దొరకని బంధాలకు ఒక్కొక్కరూ ఒక్కో అసహ్య సంబంధాన్ని అంటగట్టడం మామూలే కదా!”.
శాంతంగానే అన్నాను.
“ఓహోఁ.. సమర్థించుకోవడం ఒకటీ!”.
మళ్లీ ఎగతాళిగా అన్నాడు.
“నీ ఇష్టం.. నువ్వేమనుకున్నా సరే!” అన్నాను సంయమనంగా.
“ఇంతకీ.. ఎవర్తదీ?”.
సంస్కారం ఏమాత్రం ధ్వనించని ప్రశ్న అతనిది.
“సంస్కారం తెలిసి ఉంటే ఈ ప్రశ్న ఇలా అడిగేవాడివి కాదు!”.
కోపాన్ని అణచుకుంటూ అన్నాను.
“నీ వితండవాదం వినే ఓపికా, తీరికా నాకు లేవు. ఇప్పటికే చుట్టుపక్కల వాళ్లు నానా రకాలుగా అనుకుంటున్నారు. రేపట్నుంచి నువ్వు ఇంట్లోంచి బైటికి కదలడానికి వీల్లేదు..” ఆజ్ఞాపిస్తున్నట్టుగా అని..
“నీ ప్రవర్తన మార్చుకోకపోతే శాసించడమే కాదు.. శిక్షలు కూడా వేయాల్సివస్తుంది!” అన్నాడు హెచ్చరికగా.
“అంత ధైర్యం ఎప్పుడొచ్చింది నీకు?” అడిగాను నింపాదిగా.
“ధైర్యం అనేది సందర్భాల్ని బట్టి వస్తుంది. నీ విషయంలో ఇది పరువు, మర్యాదలకు సంబంధించింది. సమాజంలో కలిసి బతుకుతున్నాం కాబట్టి.. అది విధించిన కట్టుబాట్లను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అది నాచేత చెప్పించుకునే స్థితికి దిగజారావు. సిగ్గనిపించడం లేదూ?” అన్నాడు ప్రసాద్.
“నేనేమిటో నాకు తెలుసు. ఒకరిచేత చెప్పించుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదు. నా మానాన నన్నొదిలేస్తే సంతోషిస్తాను..” నా ధోరణిలో నేను బదులిచ్చాను.
“ఎదుటివార్ని బాధపెడ్తూ నువ్వు సంతోషపడటంలో అర్థం లేదు” విసురుగా అన్నాడు ప్రసాద్.
“నీ దృష్టిలో బాధ ఉమ్మడిది, సంతోషం ఒక్కరిది కావచ్చు! కానీ, నేనొప్పుకోను. సంతోషం ఒకరితో మొదలైనపుడు అతని చుట్టుపక్కల వాళ్లక్కూడా అందే ఔషధం అది!”.. నేనేదో చెప్పబోయాను. అంతలో.. లోపల్నుంచి ప్రసాద్ భార్య దూసుకొచ్చింది.
“పక్కింటి అనసూయ నోరు మామూల్ది కాదు. అలాంటిదాని నోట్లో ఈయనగారి నిర్వాకం పడిందంటే విశేషం కాదూ మరి?! హవ్వఁ.. ఆవిడ అనే మాటలు వినలేక సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఇదిగో.. ఈ విషయం తేలేదాక వదిలిపెట్టేది లేదు. అసలు ఈయనగారి కోసం రాములవారి గుడికొచ్చే ఆ మహాతల్లెవరో?! ఈయనంటే మగాడు.. దానికేమొచ్చింది మాయరోగం? వాళ్లింట్లోవాళ్లు అసలు మనుషులేనా? చూస్తూ ఎలా ఊరుకుంటున్నారో! వెళ్లి తాడో, పేడో తేల్చండి. దాని కులమేంటో, గోత్రమేంటో?!” అంటూ విరుచుకుపడింది.
“తెలుసుకొని ఏం చేద్దాం?”..
ప్రసాద్ అడ్డుకున్నాడు మధ్యలో.
“చేయడానికేముందీ.. పెళ్లి తప్ప!!”..
వ్యంగ్యంగా అన్నది.
“పెళ్లా..?” విరగబడి నవ్వసాగాడు ప్రసాద్.
ఇక వినలేకపోయాను నేను.
“ఛీ..” అంటూ విసురుగా నా గదిలోకి వచ్చేశాను.
“అసలేం జరిగిందో చెప్పు?” నాలుగోసారి అడిగాను. అయినా ఏడుపు మానలేదామె.
నాకర్థం కాలేదు. ఆరోజు మామూలుగా నాలుగింటికి రాములవారి గుడికొచ్చిన భవాని నన్ను చూడగానే బావురుమని ఏడ్చేసరికి కంగారుపడ్డాను.
“ఏమైంది? మీ ఇంట్లోవాళ్లేమైనా తిట్టారా?” అనడిగాను.
చెప్పలేదు. ఎన్నిసార్లడిగినా ప్రయోజనం లేకపోవడంతో.. ఆమె ఏడుస్తున్నంతసేపూ అలాగే చూస్తూండిపోయాను. ఏడ్చీ ఏడ్చీ అలసిపోయి ఆపింది. అప్పుడు అడిగాను శాంతంగా..
“ఇప్పుడు చెప్పు!” అని.. చెప్పడం మొదలుపెట్టింది.
అది వింటుంటే మా ఇంట్లో జరిగిన గొడవే గుర్తొచ్చింది నాకు.
“అసలు రేపట్నుంచి బయటికి కదలవద్దని చెప్పారు!” చివరిగా జరిగిన తీర్మానమేమిటో కూడా చెప్పింది.
నవ్వొచ్చింది నాకు.
“మరి.. నువ్వేం అనుకుంటున్నావ్?” అనడిగాను.
క్షణంపాటు అలాగే చూసింది నన్ను.
“అసలు ఏం చేయాలో, ఏం ఆలోచించాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాన్నేను!” అన్నది.
నేనేమీ మాట్లాడలేకపోయాను.
ఒంటరిగా, నిర్లిప్తతతో బతికేసే మా జీవితాలు పరస్పరం దగ్గరై.. కష్టాలు, కన్నీళ్లు పంచుకోవడంలో, ఓదార్పు పొందడంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. సమాజాన్నీ, కట్టుబాట్లనూ ఒకప్పుడు నేనూ నిప్పులా గౌరవించాను కానీ, ఆ గౌరవం నాకేది ఇప్పుడు? రవ్వంత మనశ్శాంతినైనా ఇవ్వని ఈ సమాజంతో నాకు పనిలేదు. అందుకే భవానిని తీసుకొని దూరంగా ఏ ప్రశాంత ప్రదేశానికో వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాను.
“ఏం చేయాలి?” తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నది భవాని.
ఆలోచనలో పడ్డాను. ఏదో ఒకటి చేయక తప్పదు, ఉపేక్షిస్తే లాభం లేదు.
“భవానీ.. నేను చెప్పినట్లు చేస్తావా?” కాసేపటి తర్వాత అడిగాను.
“ఏమిటి?” ప్రశ్నార్థకంగా చూసింది. చెప్పాను.
అది వినగానే ఆమె ముఖంలో రంగులు మారాయి.
“అది తప్పు కదూ..” అనడిగింది ఒకింత ఆందోళనగా.
“ఇంతకంటే మరో మార్గం లేదు!” అన్నాను.
“కానీ..” ఏదో చెప్పబోయింది.
“సరే.. నీ ఇష్టం!” అని లేచాను గభాల్న.
ఆమె కూడా లేచింది.
“సరే.. వస్తాను!” అనిచెప్పి, ఇంటికేసి బయల్దేరింది.
నేను కూడా ఆలోచిస్తూనే ఇంటిదారి పట్టాను.
ఇంటికెళ్లగానే మళ్లీ గొడవ మొదలైంది.
“మీ నిర్వాకం రోజురోజుకూ ఎక్కువవుతున్నది. బయట తలెత్తుకు తిరగలేక ఛస్తున్నాం! అసలేమిటి మీ ఉద్దేశం? మేమీ ఊళ్లో ఉండాలా? పోవాలా?” అంటూ ప్రసాద్ భార్య శాపనార్థాలు పెడుతున్నది.
“అక్కర్లేదు. రేపట్నుంచి మీకా బాధ లేదు..” నిశ్చయంగా అన్నాను.
“ఏమిటి.. నువ్వేనా ఆ మాటలంటున్నది?”.. ప్రసాద్ గొంతులో అపనమ్మకం, అపహాస్యం కలగాపులగమైన భావం కనిపించింది.
“అవును.. నేను రేపే వెళ్లిపోతున్నాను!” అన్నాను.
“ఎక్కడికి..?” అర్థం కానట్లుగా అడిగాడు ప్రసాద్.
“ఇక వెనక్కి తిరిగిరాని చోటికి!”.
“అంటే..?” అంటూ విసుగ్గా చూశాడు నావంక.
కళ్లజోడు తీసి తుడుచుకుంటూ చెప్పాను..
“అంటే.. నువ్వర్థం చేసుకోలేవంటే నేన్నమ్మను. మళ్లీ ఇంటికి రాను, ఇంకెప్పుడూ నాకోసం ఎదురుచూడొద్దు!”.
“ఏమిటీ? లేచిపోతున్నారా?” అన్నాడు వ్యంగ్యంగా.
“నువ్వేమనుకున్నా నాకభ్యంతరం లేదు”.
“అయితే.. నువ్వు చచ్చావనుకుంటాం!” కోపంతో ఊగిపోతూ అన్నాడు.
“మంచిది..” అనేసి, ఇక అక్కడ ఉండకుండా నా గదిలోకి వచ్చేశాను.
ఆ రాత్రంతా ఎడతెగని ఆలోచనలు..
ఎవరికి ఎవరమో తెలియని నాకు ఇక్కడ, భవానికి అక్కడ.. ఇంట్లో క్షణం కూడా మనశ్శాంతి లేని వేధింపులు, విశ్రాంతి లేని పనులు! అవమానాలూ, తిట్లూ!! వీటిని భరిస్తూ, సహిస్తూ ఇద్దరి మనసులూ బాగా చితికిపోయాయి. ఈ వ్యధలో, ఈ అలసటలో ఇద్దరం మానసికంగా చేరువయ్యాం.
ఒంటరిగా, నిర్లిప్తతతో బతికేసే మా జీవితాలు పరస్పరం దగ్గరై.. కష్టాలు, కన్నీళ్లు పంచుకోవడంలో, ఓదార్పు పొందడంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. సమాజాన్నీ, కట్టుబాట్లనూ ఒకప్పుడు నేనూ నిప్పులా గౌరవించాను కానీ, ఆ గౌరవం నాకేది ఇప్పుడు? రవ్వంత మనశ్శాంతినైనా ఇవ్వని ఈ సమాజంతో నాకు పనిలేదు. అందుకే భవానిని తీసుకొని దూరంగా ఏ ప్రశాంత ప్రదేశానికో వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాను.
సమాజం దీన్ని స్వార్థం అనుకోనీ.. నీతి తప్పిన ప్రవర్తన అనుకోనీ! అలసిపోయాం.. వయసు జాలానికి బిగిసి అల్లాడిపోతున్నాం!
ఈ అలసట మాకే కాదు, పుట్టిన ప్రతివ్యక్తికీ ఉండేదే! అయితే అందరూ అజ్ఞాత మానసవాసంలో చిక్కుకొన్న దురదృష్టవంతులు! కొందరు మాత్రమే మనశ్శాంతిని సాధించుకునే అదృష్టవంతులు!
శరణం మిథ్య.. పయనం సయోధ్య!
ఆదిలో ఒంటరిగా ఉన్న తృష్ణ.. అంతంలో కూడా వల్మీకంగా మిగిలిపోదు.
ప్రపంచం ఒంటరిగా మొదలు కాలేదు. ‘తోడు’తోనే విజయాల్నీ, అపజయాల్నీ చవిచూస్తున్నది.
మా గమనం కూడా అంతే!
..ఈ సత్యం తెలియగానే నా హృదయం తేలికైంది.
భర్త చనిపోయిన యాభై ఆరేళ్ల భవానికి, అరవై యేళ్ల నాకు.. కొడుకూ, కోడళ్ల వేధింపులు! వయసుడిగిపోయి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో క్షణం కూడా విశ్రాంతి లేని పనులు.. మనశ్శాంతి లేని అవమానాలు! వాటికిక నేటితో ముగింపు పలకబోతున్నాం. నాకు తెలుసు.. రేపటి మా ‘పయనం’ ఈ సమాజం దృష్టిలో ‘లేచిపోయిన వృద్ధజంట’గా మిగిలిపోతుందని!
మనసులోనే నవ్వుకున్నాను.
ఎస్వీకే సంహితానాయుడు
సాహిత్య నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన యువ రచయిత్రి, కవయిత్రి ఎస్వీకే సంహితానాయుడు. బాల్యం నుంచే తెలుగుసాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. 5వ తరగతి నుంచే చిన్నచిన్న కవితలు, చిట్టిపొట్టి కథలు రాస్తూ.. రచనా వ్యాసంగాన్ని మెరుగుపరచుకుంటూ వస్తున్నారు. స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం బీఎస్సీ చదువుతున్నారు. ఇప్పటివరకూ 20 కథలు, 20 కవితలు, 20 సినిమా సమీక్షలు, 8 వ్యాసాలు (జాతీయ అంశాలపై)లతోపాటు ఇతర రచనలు చేశారు. ‘నది’ మాసపత్రిక నిర్వహించిన కథల పోటీల్లో.. పెళ్లిచూపులు, అత్తగారి కొత్తకోడలు కథలు ఎంపికయ్యాయి. ‘సాంస్కృతిక వేదిక’, ‘సారంగ’ (అంతర్జాల పత్రిక) – ‘టాల్’ (రేడియో) నిర్వహించిన కథల పోటీల్లో ‘అద్గదీ సంగతి’ కథ, ‘మనిషితనం’ కథలు బహుమతులు గెలుచుకున్నాయి. వీటితోపాటు మబ్బులు తొలగిన ఆకాశం, హాఫ్ బౌ, పి.ఎస్.ఎఫ్.స్ట్రోక్, మనిషికి మనిషి, ముఖపుస్తక మాయాజాలం కథలకు బహుమతులు అందుకున్నారు.
– ఎస్వీకే సంహితానాయుడు 92472 78740