చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : జాయపుణ్ని అనుమకొండకు రావాల్సిందిగా మహామండలేశ్వరుడుగణపతిదేవుడి నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పాడు పృథ్వీశ్వరుడు. తను చెప్పేది పూర్తిగా వినకుండానే.. ‘బయల్దేరతాను అన్నా..’ అంటూ వెనుదిరిగాడు జాయపుడు. లోలోన రగులుతున్న అనేకానేక సంఘటనల అగ్నిపర్వతాలు పేలుతూ లావావిరజిమ్ముతుంటే.. అవి బయటికి కనిపించకుండా లోలోనే అణచుకుంటూ.. విక్రమతో కలిసి నడుస్తూ వెళ్లిపోయాడు.
“స్వాగతం మహావీరా.. జాయచోడ దేవా.. స్వాగతం సుస్వాగతం!”.
అనుమకొండ నగర ప్రవేశస్థలం వద్దనున్న ద్వారతోరణం.
స్వాగత ద్వారాలు.. దారంతా ఇరువైపులా పువ్వులతో అలంకారాలు.. వేలాది సైనికులు, పౌరులు.. ఉత్సాహంతో, ఉద్వేగంతో ఊగిపోతున్నది అనుమకొండ.
రాజధాని నగర ప్రవేశం వద్ద తనకోసం ఏర్పాటు చేసిన ఆ అట్టహాసం చూసి ఖంగుతిన్నాడు జాయచోడుడు. విక్రమపైనే కూర్చుని పరికించి చూశాడు.
తనకేనా.. ఈ స్వాగత సన్నాహాలు?!
ఏమని పిలుస్తున్నారు?!
జాయచోడ దేవుడు!! వెలనాడులో అంటే సరే.. అనుమకొండలో తను వీధిబాలుడే కదా. ఇలాంటి గౌరవవాచకం తనకు తగునా?!
లేదే.. ఇక్కడే తను తొలిసారి అనుమకొండ ప్రవేశించాడు అప్పుడెప్పుడో ముప్పైఏళ్ల క్రితం.. మల్యాలచౌండ బాబాయ గారితో. ఆరాత్రి ఇక్కడే విజయ సంబరాలు.. తమ రాజ్యాన్ని ఓడించి తన అక్కలను బంధించి తెచ్చి ఇక్కడ సంబరాలు చేసుకుంటారా?! ఆ సంబరాలు నచ్చలేదు. అందుకని మెల్లగా మత్తగజం దిగేసి నగరంలోకి అడుగుపెట్టాడు. అప్పుడే చిన్నపాటి వర్షం..
ఆ మట్టి వాసన ఇంకా మనస్సీమల తావులలో పరిమళిస్తూనే ఉంది.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే తలగడదీవి నుంచి ఇదే అనుమకొండ ప్రవేశించాడు. అలాగే నడుచుకుంటూ నును వెచ్చని చల్లదనానికి చేతులు కట్టుకుని.. మళ్లీ అదే మట్టివాసనను అఘ్రాణిస్తూ వెళ్తే ఎంత బావుంటుంది!
ఎదురుగా ఈసారి తన కోసమే పెద్ద స్వాగత సంబరం.. జాయపుణ్ని చూస్తూనే మంగళవాద్యాలు మోగడం మొదలయ్యింది. విక్రమ పక్కగా నడుస్తూ గతాన్ని గుర్తుచేసుకుంటూ తోరణం లోపలికి వచ్చాడేమో.. పంచ మహావాద్యాల ఆహ్వాన సౌరభం అతన్ని నివ్వెరానందపరచింది.
నృత్త పద్ధతిలో గేయం లేకుండానే వాద్య సంగీతంతో ఆహ్వానాన్ని తెలియజేయడం.. భలే భలే.. ముచ్చట!
ఇవన్నీ తనకేనా అన్నట్లు కాకతీయ సైనిక విన్యాసాలను విభ్రమంతో చూస్తున్నాడు. ఇది సైనిక వందనం.
అఖండ భారత రాజ్యాలలోనే చెప్పుకోదగ్గ గొప్ప సైనికశక్తిగా గుర్తింపు పొందిన కాకతీయ సామ్రాజ్య సైనిక మహాపారావారంలో చిచ్చరపిడుగుగా గుర్తింపు తెచ్చుకుని.. రాజ్యరక్షణా దౌరేయులై.. అతి ముఖ్యులైన పదిమంది మహావీరులలో ఒకడిగా ప్రఖ్యాతుడైన జాయచోడుడు కొంతకాలం వెలనాడు మండలీశ్వరునిగా పదవి నిర్వహించి.. రెండు సరిహద్దు రాజ్యాలు మతఘర్షణలవల్ల యుద్ధానికి సిద్ధపడితే.. వారిపై వినూత్న కళాయుద్ధం చేసి.. పరమత దూషణపై గెలిచి.. విజయుడై తిరిగి గజసాహిణిగా అనుమకొండ ప్రవేశిస్తున్న శుభసందర్భంగా గొప్ప సైనికవందనం ఏర్పాటు చేశాడు సకల సైన్యాధిపతి రుద్రయసేనాని.
లోలోన నృత్తాలను, కరణులను ఆలోచించుకుంటూ నడుచుకుంటూ తలవొంచుకుని ముందుకు సాగిపోవడం జాయపుని నైజం. ఊరు మారినా, రాజ్యం మారినా పోకడ ఇదే. కానీ, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ అద్భుత సైనికవందనంతో కూడిన ఆహ్వానం.. జాయచోడ దేవునిగా సంభోదిస్తూ రాజ్యగౌరవంతో ఆహ్వానించడం.. జాయపునికి కొంత ఆశ్చర్యానందాన్ని కలిగించింది.
కాకతీయ వర్తమాన చరిత్రలో గౌరవించదగ్గ స్థాయి, హోదా.. అందుకు తగిన వీరత్వ ప్రదర్శన తన పేర లిఖించి ఉన్నాయి కదా! కాబట్టి తను ఈ గౌరవవందన గీతానికి అర్హుడు కావచ్చు.
ఔనా?! తన కళాయుద్ధ విజయాన్ని అనుమకొండ హృదయానికి తీసుకున్నట్లుంది.. అనుకున్నాడు మళ్లా.
చుట్టూ కనుచూపుమేరా గుర్రాలు, ఏనుగులు, రథాలు, సైనికులు.. అబ్బబ్బ.. వీళ్లందరినీ సాధారణంగా యుద్ధ సమయంలో సమీకరిస్తారు. అలాంటిది ఇలా తనకోసం సమీకరించి యుధ్ధక్షేత్రంలో మాదిరిగా కాకుండా దారికి ఇరుపక్కలా విభిన్న వరుసలుగా నిలిపి మధ్యగా ఓ సమున్నత వేదిక ఏర్పాటు చేసి అక్కడ అంబారీతో అలంకృత మత్తగజాన్ని ఉంచారు.
తంత్రిపాలుడు ముచ్చనాయకుడు ఆహ్వానంగా వంగి వినయంగా నమస్కరిస్తూ ముందుకు వచ్చి.. గజారోహణం చేయాల్సిందిగా కోరాడు. వద్దని చెప్పలేకపోయిన జాయచోడుడు ఆ మహాగజాన్ని పలకరించినట్లు తొండం పై సున్నితంగా తట్టి అధిరోహించి పైనున్న అంబారిలో పట్టుబాలీసులపై సర్దుకుని కూర్చున్నాడు. ముందున్న మావటి లేచి చేతులు జోడించి..
“దండాలు గజ చమూపతుల వారికి..” అన్నాడు.
అతని ముఖమంతా ఆనందం పరవళ్లు తొక్కుతున్నది.
“మీకు ఆహ్వానం పలకడం నా పూర్వజన్మ సుకృతం మహానుభావా..” అన్నాడు కూడా.
జవాబుగా నవ్వాడు ఆత్మీయంగా జాయచోడుడు.
అధిరోహించిన మత్తగజం ముందుకురాగా ముందువరసలో ఉన్న సైనికాధికారులు, అనేకానేక యుద్ధాలలో ఆరితేరిన కాకతీయ మహాయోధులు, అశ్వవీరులు, గజవీరులు, తన సహచరులు, గురువులు.. శిరస్సువంచి గౌరవసూచికంగా జయజయ ద్వానాలతో..
“మహానాయకా.. వెలనాడు మండలీశ్వరా.. గజచమూపతీ.. జాయ చోడదేవా.. వీరాధివీరా స్వాగతం.. సుస్వాగతం..” అంటూ మరెన్నో విశేషణాలతో ఆహ్వానం పలుకుతూ కైవారాలు చేస్తూ పుష్పవానలు కురిపిస్తుంటే.. మత్తగజం ముందు ముచ్చనాయకుడు వినయంగా నడుస్తుండగా.. ఇరుపక్కలా అశ్వసాహిణి, రథసాహిణి, మందడి కాటయ, సహాయ గజసాహిణి కొమురయ, మరికొందరు కొత్త కుర్రవీరులు వినయంగా కదలుతుండగా ఆయనను అనుమకొండ లోపలికి తోడ్కొని వెళ్లింది కాకతీయ రాజ్యప్రభుత్వం.
జాయపునికి ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే.. సైన్య పటాలాలే కాదు వాటి వెనుక నిలబడి ప్రజలు కూడా ఆనందం తేజరిల్లే ముఖాలతో స్వాగతం చెప్పడం.. సైన్యం వెంట నడవడం.. పూలజల్లులు కురిపించడం!
తంత్రిపాలుని ఆధ్వర్యంలో ఆ సైనిక ఆహ్వాన వందన సంబరం రాజప్రాసాదం వరకూ కొనసాగింది.
కాకతీయ మహా సేనావాహినికి అత్యున్నత నేత, సకల సేనాధిపతి శ్రీ రుద్రయ సేనానులవారు రాజప్రాసాద మహాద్వారం వద్ద నిలబడి మత్తగజం నుంచి చేయిపట్టి జాయచోడుని దింపి.. గాడాలింగనం చేసుకోగా, జాయచోడుడు వంగి సాష్టాంగ పాదాభివందనం చేశాడు. సమస్త సైన్యపు కరతాళధ్వనుల మధ్య నిలువెత్తు పుష్పమాలలతో సత్కరించి ఆహ్వాన సంప్రదాయాన్ని ముగించి లోపలికి తోడ్కొని పోయారు.
గణపతిదేవుడు అనుమకొండలో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు జాయచోడుడు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజెప్పి కుశలప్రశ్నలు వేసి లోపలికి ప్రవేశిస్తే.. సైనికవందన హడావుడి క్రమేపీ తగ్గిపోయింది.
ఉష్నీషం, దుస్తులపై నిలిచిన పూల రేఖలను దులుపుకొంటూ అంతఃపురంలోకి వెళ్లాడు. నారాంబ ఆనంద బాష్పాలలో నిలువెత్తు తమ్ముణ్ని కళ్లారా చూసుకుని గాఢంగా హత్తుకుని మురిసిపోయింది. జాయపునిలో చిన్న ఆనంద తరంగం! కాస్త సేదదీరిన శబ్దం!!
ఓ సంఘటన తీవ్రంగా బాధిస్తే అశక్తుడై ఎన్నోతరాల అడుక్కి జారిపోయినట్లు భావించే మనిషిని.. మరో సంఘటన చాంతాడులా ఆ అగాథాల నుంచి పైపైకి లాగి వర్తమాన ప్రపంచంలో పడవేస్తుంది కాబోలు.
ఓ తల్లి కడుపున పుట్టిన అక్కాతమ్ముల ఆలింగనం ఆ చాంతాడు కావచ్చు. అక్క నుంచి హఠాత్తుగా విడివడి ఆమెను వివరంగా చూశాడు. అంతే! భళ్లున నవ్వాడు. తెరలు తెరలుగా వలయాలుగా నవ్వుతూనే..
“అక్కా.. నీ తల..” మళ్లీ భళ్లున నవ్వు.
“నీ తల.. మొత్తం ముగ్గుబుట్ట.. లాగా..”
మందిరమంతా వలయాలుగా.. గింగరాలు తిరుగుతూ విశాలంగా వికటాట్టహాసాలు చేస్తూ మందిరపు పైకప్పు దద్దరిల్లేలా నవ్వి నవ్వి కడుపు పట్టుకుని.. నవ్వలేక నవ్వుతూ పల్యంకంలో కూలబడి మళ్లీమళ్లీ నవ్వుతూ రొప్పుతూ.. అబ్బా.. అమ్మా..
అర్థం చేసుకున్న నారాంబ ఓ కంట అంగీకారం, ఓ కంట హాస్యం పండిస్తూ జాయచోడుని దగ్గరగా వెళ్లి జుత్తు ఆప్యాయంగా నిమిరి, గెడ్డం ఆప్యాయంగా తడిమి..
“నీకూ అక్కడక్కడా తెల్లవెంట్రుకలు వస్తున్నాయిరోయ్..” అన్నది అల్లరిగా.
మళ్లీ ఎప్పటిలాగే బావగారి ప్రసక్తి తెస్తూ..
“బావగారికి కూడా నెరిసింది కానీ కలనేత..”
ఇద్దరూ భళ్లున పైకప్పు ఎగిరిపోయేలా నవ్వసాగారు.
ఓ గంట తర్వాత బొబ్బట్లు, జున్ను, మోదకాలు ఒక్కటొక్కటిగా నోటికి అందిస్తూ ఏవేవో కబుర్లు.. ముచ్చట్లు.
సమయం పగలు, రాత్రి.. తేడా లేకుండా చెబుతూనే ఉంది. తమ్ముడు వింటూనే ఉన్నాడు.
ఆదమరచి ఎప్పుడో నిద్రపోయారు అక్క, తమ్ముడు.
పిల్లలను చదువు నిమిత్తం వేరువేరు విద్యాకేంద్రాలకు పంపేశాడు గణపతిదేవుడు. ప్రస్తుతం ద్వారసముద్రం వెళ్లాడు. మూడవ బల్లాలునితో ఏవో సంప్రదింపులు. వారం రోజుల వరకు రావడం కుదరదు. నిజానికి జాయచోడునికి సైనికవందనంతో కూడిన రాజ్యాహ్వానం పలకాలన్నది ఆయన నిర్ణయమే. అతను వచ్చేరోజు తనకు తెలియజేయమని తన నియోగ కార్యదర్శికి చెప్పి వెళ్లాడు కానీ.. ఆయన ద్వారసముద్రం చేరుకోక ముందే జాయచోడుడు అనుమకొండకు చేరుకున్నాడు.
ఆరోజు మువ్వ మరణించిన రోజు..
పరాశరుడు చెప్పగానే యుద్ధ స్కంధావారం నుంచి పరుగుపరుగున వచ్చినా.. మువ్వను బతికించుకోలేక పోయాడు. ముప్పిరికొన్న అనేకానేక భావాల సంఘర్షణను, విషాద వీచికలను తట్టుకుంటూనే పరాశరుణ్ని ధనుదుపురంలో విడిచిపుచ్చి తలగడదీవి చేరాడు. పృథ్వీశ్వరుడు ద్వారంవద్దనే నిలిచి అనుమకొండకు రావాల్సినదిగా అనుమకొండ ప్రభుత్వ లేఖను చూపాడు. అసలే మువ్వ మరణంతో దిమ్మెరబోయిన జాయచోడుడు ఇక క్షణం ఆగలేదు. గిరుక్కున అక్కడే వెనుదిరిగాడు.
కటిక చీకటి.. ఇటుగా కృష్ణమ్మ, అటుగా తూర్పుసముద్రుడు హోరుమని ఏడుస్తున్నారు. జాయచోడుణ్ని చుట్టుకుని వీస్తున్న గాలి సంఘీభావం తెలుపుతున్నట్లు మృదువుగా రోదిస్తున్నది. అధిరోహించమన్నట్లు విక్రమ తలతో అతని భుజాలను నొక్కుతున్నది.
“మరికాసేపు నడవాలని ఉంది విక్రమా..” అన్నాడు దాని ముఖాన్ని నిమురుతూ.
ఎవరైనా పెద్ద ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరికితే బావుండును.. ఎద్దులను అదిలించే చెర్నాకోలతో తెల్లవార్లూ వళ్లంతా వాతలు పెడితే బావుండును.. ఆ సముద్రుడు పొంగి తనను గుంజుకుపోతే బావుండును.. ఆ మహాతల్లి కృష్ణమ్మ బిరబిరా వచ్చి చుట్టేసి ముంచేస్తే బావుండును.. ఆ ఆకాశం మీద పడితే బావుండును.. ఈ నేల బద్దలై తన్ను పాతాళానికి గుంజేస్తే మరింత బావుండును.. మనసూ శరీరమూ ఏదో అవ్యక్త శిక్షను కోరుకుంటున్నాయి.
శిక్షించేవాడెవ్వడూ.. శిక్షిస్తూనే ఉన్నాడా దేవదేవుడు..?! కళాకారుడిగా ఎంత విజయవంతం అవుతున్నా.. జీవితం ఎందుకు అన్నింటా విషాదమే మిగిలిస్తున్నది. తనలోని కళాకారుడికి విషాదమే ఆహారమా.. జీవిత విషాదం వల్లనే తన కళ రాణిస్తున్నదా..
ఇద్దరూ పక్కపక్కనే భుజాలపై చేతులు వేసుకున్న మిత్రుల్లా ఆ చీకటిలో అలా అలా.. నడిచి నడిచి ఊర్లు దాటుతూ వీడ్కోలు చెబుతూ ఒకటి, రెండు కృష్ణమ్మ పాయలు దాటారు. మనసంతా ఏడుపూ లేదు. ఆనందం లేదు. ఏమీ లేని ఖాళీ! అలా పోతూనే ఉన్నాడు మౌనంగా. మువ్వ చూపులు వెంట వస్తున్నాయి. ఆకాశంలో వేగంగా కదిలిపోతున్న మబ్బుల బారులు. వాటి మధ్యగా కనిపించి ఓదార్చడానికి యత్నిస్తున్న చందురుడు.. గరుగ్గా వినవస్తోన్న తాడిచెట్ల కబుర్లు.. మెత్తగా ఈతచెట్ల ముచ్చట్లు.. మొత్తం ప్రకృతి అంతా అతని వెంటే నడుస్తూ ఏదో బుజ్జగిస్తున్నట్లు.. కన్నీరు తుడుస్తున్నట్లు..
అప్పుడు వినిపించింది. కాస్త దగ్గరగా డప్పు చప్పుడు.
ఆసక్తిగా చెవి ఒగ్గాడు. గతంలో విన్నట్లు.. ఆ వాద్య సౌందర్యం బాగా తెలిసినట్లు..
ఒళ్లు జలదరించింది. అది సూరప్పడి డప్పు.
అవునూ.. ఏమయ్యాడు సూరప? అనుమకొండ పంపాడు కదా.. బావగారిని కలిశాడో లేదో.. రాజాస్థానపు మహావిద్వాంసులు అబ్బురంగా విని ఆనందపరవశులై ఉంటారు. గొప్ప సన్మానం చేసి ఉంటారు. బావగారు మడిమాన్యాలు అనుగ్రహించి ఉంటారు.
మరి తననెందుకు కలవలేదు?
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284