చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : ఒకనాడు ధనదుపురంలోని ప్రధాన వైష్ణవమఠంలోకి వెళ్లారు జాయపుడు, పరాశరుడు. శ్రీమన్నారాయణుని భజనతో ఉద్వేగంతో, భక్తిభావనలతో పులకించిపోతున్నది ఆ మందిరం. లోనికి ప్రవేశిస్తూనే పరాశరుడు పరవశుడై.. చేతులతో చప్పట్లు చరుస్తూ శ్రీమన్నారాయణుని భజిస్తూ ఆ భక్తుల్లో కలిసిపోయాడు. వైష్ణవ ఆహార్యంతో కాకుండా, సాధారణ పౌరునిలాఉంటాడు పరాశరుడు.
అదే విషయాన్ని ప్రస్తావిస్తూ..
“నువ్వు వైష్ణవ పండిత ఆహార్యంలో లేవు. సాధారణ పౌరునిలా.. అంటే ఓ రైతు యువకునిలా ఉన్నావు కదా..” అని అడిగాడు జాయపుడు.
“నిజానికి నేను పండిత వంశజుడిని కాదు. కుమ్మరి వృత్తికారుణ్ని. లిఖితసాహిత్యం కన్నా ప్రదర్శనీయ గేయ, రూపక, యక్షగానాల రచన నాకిష్టం. దేశీ కళాకారుల కోసమే రూపకాలు రచిస్తుంటాను. సంస్కృతంలోనూ రాయగలను కానీ, జానుతెలుగు, పామరభాష, యాస నాకు లోతు తెలిసినవి. వైష్ణవచిహ్నాలతో కాకుండా రైతులా ఉండటమే నాకిష్టం..” నిజాయితీగా చెప్పాడు.
అదే ప్రశ్న తనను అడగకపోవడంతో జాయపుడు ఊపిరి పీల్చుకున్నాడు.
చిన్ననాటి నుంచి జాయపుడు తన సహజప్రవృత్తిగా నాట్యాలు, యుద్ధాలు చేశాడు. గురుకులంలో నాట్య లక్ష్య లక్షణాలు చదువుకున్నాడు. శివుడిపాత్ర వెనక శైవమతం అనేది ఉన్నదని, దానికో రోజువారీ జీవితవిధానం ఉంటుందని తెలియదు. తనకు చిన్ననాట నొసటన విబూదితో అడ్డంగా గీతలు పెట్టేది తల్లి. రాజవంశజులు అందరూ శైవమత పూజలు, క్రతువులు, అలంకరణాదులు పాటిస్తున్నారు కాబట్టి అదే తెలుసు. కానీ మరొక రకం వేషభూషణాదులు చూసినా అవి మరొక మతచిహ్నాలని గుర్తించలేదు. కారణం.. ముఖ్యంగా వయసు.
బౌద్ధారామాలలో, జైన బసదులలో ఉన్న విద్యాలయాలు, గ్రంథాలయాలు తెలుసు కానీ, బౌద్ధ, జైనమతాల చరిత్ర తెలియదు. అలాగే సమాజంలోని కళలు, సాహిత్యమూ, భాష, సంగీతం, చిత్రలేఖనం, గానం, గేయం, వాద్యం.. ఈ కళల రూపకల్పనల వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతాడు కానీ, ఆ దేవుళ్ల వెనుక మతాలు మతలబులు.. అవి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని జాయపునికి ఇప్పుడు అవగతం అవుతున్నది. మతాలపట్ల తన అజ్ఞానాన్ని పరాశరుని వద్ద వినయంగా అంగీకరించాడు.
“నీకు బౌద్ధారామాలు, జైనబసదులు తెలుసుగా. అలాగే శైవానికో మఠం.. వైష్ణవానికో మఠం కూడా ఇక్కడ ఉన్నాయి. మా వైష్ణవమఠానికి వెళ్దాం పద..” అన్నాడు పరాశరుడు.
కుతూహలంతో ధనదుపురంలోని ప్రధాన వైష్ణవమఠానికి వెళ్లాడు. అక్కడ ఉధృతంగా జరుగుతున్న భజనతంతు చూస్తూనే.. జాయపుని ముఖంలో తెలియకుండానే ఓ ఆహ్లాద ఛాయ పరచుకున్నది. ఎవరికీ అనుమానం రాకుండా చేతులు, పెదవులు కదుపుతూ అందరితో కలిసిపోయి కనిపించసాగాడు. భజన ఉధృతమైంది. పరిశీలన మరింత విశాలమైంది.
శ్రీమన్నారాయణుని కొలిచిన తర్వాత శ్రీకృష్ణుని, తర్వాత విష్ణువును, ఆ తర్వాత వేంకటేశ్వరుని భజించారు. ఆఖరిలో ‘శ్రీమతే రామానుజాయ నమః’ అంటూ రామానుజుడనే గురువును కీర్తిస్తూ భజన ముగించారు. అనంతరం అందరికీ దధ్యోజనం భోజనంగా వడ్డించారు మఠం నిర్వాహకులు.
తర్వాత మళ్లీ మఠాధిపతి యతిరాజాచార్యులు ప్రవచనం కొనసాగించారు.
“శ్రీమతే రామానుజాయ నమః”.. ఉపన్యాసం ప్రారంభిస్తున్నట్లు గట్టిగా అన్నాడు యతిరాజులు.
అందరూ చేతులు జోడించి తాము కూడా సిద్ధమన్నట్లు ముక్తకంఠంతో నినదించారు.
“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం..”
అత్యంత భక్తిప్రపత్తులతో చేతులు జోడించి విష్ణువును కొలిచే అంశాలను చెప్పాడు. అందరూ కళ్లు మూసి భక్తిపారవశ్యంతో ఆ విష్ణుమూర్తిని ఊహింపసాగారు.
“ఓ పావనమూర్తి.. ఓ సకలగుణాకారా.. పాలసముద్రంలో సర్పశయ్యపై పవళించిన ఓ మహాదేవా! ఏ పూర్వజన్మ ఫలితమో.. ఎంత అదృష్టమయ్యా నీ నామాన్ని జపించడం.. ఓ పరంధామా.. దేవదేవా! అదుగో అదుగో.. అదుగో నీ చిన్మయరూపం నా కళ్లకు కనిపిస్తున్నది. పరమ భాగవతోత్తమా.. సర్వజ్ఞా.. సర్వవ్యాప్తా.. సర్వాంతర్యామీ.. అర్తజన రక్షకా.. ఆశ్రిత ఫలప్రదా.. ఆదిమధ్యాంత రహితా..”
ఆయన పూర్ణభక్తితో ఎక్కడా తడుముకోకుండా అనర్గళంగా స్వామిని ప్రవాహ సదృశంగా ప్రార్థించసాగాడు.
మధ్యమధ్య ఆపి “ఓం విష్ణవే నమః” అంటున్నాడు. భక్తులంతా తిరిగి దానిని మరింత పెద్ద గొంతుకతో అనుకరిస్తున్నారు. అలా ఆ కార్యక్రమం ఓ భక్తిరస ప్రవాహంలా సాగిపోతున్నది. పరాశరుడు కూడా అందులో మునకలు వేస్తూ తన్మయత్వంతో ఊగిపోతున్నాడు.
మధ్యమధ్య ఆగుతూ కాస్త ఊపిరితీస్తూ చెబుతున్నాడు యతిరాజాచార్యులు అదే ఉద్వేగస్థాయిలో.
“శ్రీమతే రామానుజాయ నమః.. మీకు పన్నిద్దాళ్వారులలో మొదటి ముగ్గురు.. పొయిగ ఆళ్వార్, పూదత్త ఆళ్వార్, పేయాళ్వార్. ఈ ముగ్గురికి స్వామి శ్రీరంగనాథుడు పూర్తి అలంకారంతో అర్చామూర్తిగా దర్శనం ఇచ్చారు. ఎదురుగ నిలబడి మాట్లాడారు”..
మందిరమంతా సంభ్రమం!
నిజమా!? అన్నట్లు అందరూ చిన్నపాటి పులకింతతో యతిరాజులను చూస్తున్నారు.
“ఆ విశేషం ఇప్పుడు మీకు చెబుతాను..” అంటూ ఓ సంఘటనను అతి విపులంగా పండిత పామరులలో ఉత్కంఠజనితంగా కళ్లముందు దృశ్యమానం చేస్తున్నాడు. ఓ ప్రత్యేక భాషాధోరణితో, కొంత తొండమండల మాండలికంతో చెప్పుకొంటూ పోతున్నాడాయన. సాధారణంగా ఈ కార్యక్రమాలకు వచ్చే భక్తుల్లో ముప్పాతిక మందికి చెప్పేది పూర్తిగా అర్థం కాదు. అర్థం కాకపోవడం కూడా ఆ మహాభక్తి మాయలో భాగమేనని మురిసి పోయేవాళ్లు కూడా ఉంటారు. ఆ అంశం వారికి అర్థంకాకున్నా ఆయన అలా చెప్పే ధోరణి వల్లనే వాళ్లకు ఆ తన్మయత్వం కలుగుతున్నదేమో!?
జాయపుని ఆలోచనలను చెడగొడుతూ మళ్లీ భజన కార్యక్రమం మొదలై ఆకాశాన్నంటింది. భక్తులంతా ఆ పాటలతో భజనతో తన్మయత్వం చెంది ఊగిపోతున్నారు. జాయపునిలో మళ్లీ ఆలోచనల తేనెటీగల ఝంకారం..
సాధారణ భక్తులకు ఈ భక్తి అనేది బాగా నచ్చుతున్నది. కాబట్టి నాట్యాలలో, చిందులలో, ఆటపాటలలో ఈ సౌమ్య భక్తిధోరణి బాగా ఆకట్టుకుంటున్నది. ఈ ప్రవచనాలు అర్థం చేసుకునే భక్తాగ్రేసరులలో సంస్కృతకవి ధవళేశు నామయ్య, దేశీ కవి పరాశరుడు లాంటివాళ్లే ఈ మత ప్రవచనాల వల్ల ప్రగాఢంగా ప్రభావితులై ఆ అంశాలకు తగిన కళారూపాలను సృష్టించి సమాజానికి అందించే వాహకులు. భారతీయ సమస్త కళారూపాలు, లిఖిత, ప్రదర్శన కళలు ఏదో ఒక దైవంతోనో, మత విధానాలతోనో ముడిపడి మహత్తర కళా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి.
మరి తను?? తను కూడా అదే చేస్తున్నాడుగా. ఇప్పటివరకు తెలియకపోయినా చేశాడు అందరిలాగే!
నిజానికి నర్తించే వేళ ఆ మఠాధిపతి పొందే తాదాత్మ్యాన్ని తాను కూడా పొందుతాడన్నది నిజం.
అందువల్లనే తన నృత్తప్రదర్శన కూడా ప్రేక్షకులను ఆ తన్మయత్వాన్ని కలిగిస్తున్నదా.. వారిపై ప్రగాఢ ప్రభావం చూపుతున్నదా..
తాదాత్మ్యం!.. తన్మయత్వం!! ప్రగాఢ ప్రభావం!!
ఈ మూడిటి అనుబంధం, అనుసంధానం ఈ మత, దైవభావనల తీవ్రత వల్లే కావచ్చు!!
ఇదేదో తనలో మరింత సంఘర్షించాలి!!
“గోదాకల్యాణం యక్షగాన ప్రదర్శన.. చూద్దామా?!” ఉత్సాహంగా అడిగాడు పరాశరుడు ఓరోజు. పైగా..
“అది ప్రదర్శించేది తమిళ నాట్యబృందం..” అన్నాడు అదొక గొప్ప సంగతిలా.
జాయపునికి కూడా ఆసక్తి పెరిగింది. అతను ఇంతవరకూ పరభాషా ప్రదర్శనలు చూడలేదు.
ఉత్సాహంగా వెళ్లాడు. అది జరిగింది అవదేశి వణిజుల శ్రేణి వారు కట్టించిన కళాభవనంలో. మొదటగా ఆ భవంతిని చూసి నోరు తెరిచాడు. అనుమకొండలో కూడా ఆ స్థాయి కళాభవనం లేదు. నాగరికత తొలిరోజుల నుంచి ప్రపంచదేశాలతో వాణిజ్యం నిర్వహించే అత్యుత్తమ ప్రపంచస్థాయి తెలుగు వణిజులున్న నగరం ధనదుపురం అని తెలుసు. కానీ, వాళ్ల ప్రపంచస్థాయి కట్టడాలను ఇప్పుడు చూస్తున్నాడు.
ఈ గోదాకల్యాణం ప్రదర్శన కూడా వాళ్లు ఏర్పాటుచేసిందే. అక్కడ చూశాడు వెలనాడు రాజ్యపు అత్యున్నత ప్రముఖుల సమాగమం. ఇది ఆర్థిక సామాజిక ఉన్నతస్థాయి కులీనుల కోసం ఏర్పాటైన ప్రదర్శన. అంటే.. శిష్ట వ్యావహారిక నాట్యధర్మి (రాజాస్థాన/ శాస్త్రీయ) విధానపు నాట్యకలాపం. ఇంతకుముందు తను చూసినవి సాధారణ లోకధర్మి (సాధారణ పౌరుల/అశాస్త్రీయ) ప్రదర్శనలు.
వైష్ణవమఠంలో ఎక్కువమంది మధ్యతరగతి, దిగువ తరగతి వృత్తికారులైతే.. ఇక్కడ ప్రపంచస్థాయి వణిజులు, మహావైశ్యులు, పెద్ద రైతులు, సమయశెట్టిలు, సైనికాధికారులు, మంత్రులు.. తదితర కులీన, శిష్టవర్గ వైష్ణవ కుటుంబాల స్త్రీ పురుషులు ఉన్నారు. కొన్ని ముఖాలు చూస్తే అనుమకొండలో కూడా చూసినట్లు కనిపించారు.
పుర ప్రముఖులతో మందిరం కిటకిటలాడిపోతున్నది.
కళా ప్రదర్శన కావడంతో పరాశరుడు చాలా హడావుడి పడిపోతున్నాడు.
ఈ నాట్యబృందం దిగువ పాండ్యరాజ్యం శ్రీరంగం నుంచి వచ్చింది. తమిళ వైష్ణవ కళాకారులు శైవ కళాకారుల కంటే ఉత్తేజంగా ఉన్నారు. కానీ, ఉద్రేకంగా లేరు. అంతా చిన్ముద్ర దాల్చిన ముఖాలతో.. కడు రమణీయంగా స్నేహపూర్వకంగా ఉన్నారు. తను మొదటిసారిగా శైవ కళాకారులు, వైష్ణవ కళాకారులు అనే మతపరంగా చూడటం.. ఆలోచించడం జాయపునికే ఆశ్చర్యంగా ఉంది.
ధనుదుపురంలోని వైష్ణవ భక్తులు, కళాకారులు కూడా శ్రీరంగం వైష్ణవ కళాకారులకు అత్యంత గౌరవస్థానం ఇవ్వడం కూడా జాయపుడు గుర్తించాడు. కొందరు కళాకారులతో మాటామంతి కలిపాడు.
వాళ్లు చెప్పినదాన్నిబట్టి శ్రీరంగం చుట్టుపక్కల వైష్ణవం ఉత్తుంగ తరంగంలా విజృంభిస్తున్నది. శైవం కాస్త వెనుక పట్టు పడుతున్నది. శ్రీరామానుజుల ఆగమనంతో దక్షిణావర్తంలో వైష్ణవం తీవ్రంగా పుంజుకున్నది. ఆయన ప్రవచనాలతోపాటు ఆయన ప్రవర్తన సమాజాన్ని తీవ్రంగా ఆకర్షిస్తున్నది. ముఖ్యంగా నిమ్నవర్గాలకు, అగ్రహారబాహ్యులకు దేవాలయ ప్రవేశాన్ని కల్పించడం.. వైష్ణవులుగా గుర్తింపునివ్వడం.. తీవ్ర శైవమత రాజ్యంగా గుర్తింపు ఉన్న తమిళ సమాజంలో గొప్ప సామాజిక విప్లవం.
జాయపుడు రెప్పవేయకుండా చూస్తున్నాడు. మరోప్రాంతపు కళాకారుల ప్రదర్శన, మరో భాషా ప్రదర్శన.. మొదటిసారి చూస్తున్నాడు. ఓ కళా ప్రదర్శనను ఓ మత సంబంధిత ప్రదర్శనగా చూడటం కూడా ప్రథమమే! నట్టువాంగ శబ్దంతో మృదంగ, వీణా సంగీతఝరి ప్రవహించసాగింది. ఓ చెలికత్తెల బృందం.. చిన్నపాటి వయ్యారంతో మృదువుగా నాట్యలయతో కదలివచ్చారు.
“ప్రదర్శన ప్రారంభం కాబోతున్నది”.. అంటూ ప్రకటించగా, మందిరంలో శబ్దపుసందడి కాస్త సద్దుమణిగి.. మఠాధిపతి రావడంతో పూర్తిగా నిశ్శబ్దమయ్యింది. ప్రార్థనగీతంతో యవనిక తొలగసాగింది..
జాయపుడు రెప్పవేయకుండా చూస్తున్నాడు. మరోప్రాంతపు కళాకారుల ప్రదర్శన, మరో భాషా ప్రదర్శన.. మొదటిసారి చూస్తున్నాడు. ఓ కళా ప్రదర్శనను ఓ మత సంబంధిత ప్రదర్శనగా చూడటం కూడా ప్రథమమే!
నట్టువాంగ శబ్దంతో మృదంగ, వీణా సంగీతఝరి ప్రవహించసాగింది.
ఓ చెలికత్తెల బృందం.. చిన్నపాటి వయ్యారంతో మృదువుగా నాట్యలయతో కదలివచ్చారు.
“శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః”..
ప్రేక్షకులంతా రామానుజుని మరల మరల స్మరించారు. ఉద్వేగంతో మందిరమంతా ప్రతిధ్వనించింది. మార్గశిర మాసం నుంచి తిరుప్పావై పఠనం మొదలెట్టి పూర్తయ్యాక గోదాకల్యాణం చేస్తారనుకుంటా. తనకు స్పష్టంగా తెలియదనుకున్నాడు జాయపుడు. ఒక్కసారి గ్రంథాలయంలో పరిశీలించాలి.
“ఆండాళ్.. తిరువడిగళే.. శరణం!!”..
చెలికత్తెలు నృత్తమాడుతూ గోదాదేవిని ఆహ్వానిస్తున్నారు.
“నీళాతుంగ స్తనగిరితటీ సుప్త ముద్యోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధా మధ్యాపయంతీ
స్వోచ్చిష్టాయాం స్రజనిగళీతం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయా ఏవాస్తు భూయః ॥”..
చెలికత్తెల నృత్తం మనోహరంగా ఉంది. రెప్ప వెయ్యకుండా చూస్తున్నాడు. ఈ నటీనటబృందం తాదాత్మ్యతతో నర్తిస్తున్నారేమో?!
గోదాకళ్యాణ ప్రదర్శన చూస్తుంటే జాయపునిలో తన్మయత్వం! ఊపేస్తున్న తన్మయత్వం!!
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284