చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : సాధారణ పౌరుడిగా వెలనాడు వీధుల్లో సంచరిస్తున్నాడు జాయపుడు. తన రాజ్యంలోని ప్రముఖ దేవాలయాల వద్దే కాదు, అతిచిన్న గ్రామాలలో కూడా ఏదో ఒక నృత్త ప్రదర్శన జరుగుతుండటం జాయపుణ్ని ఆనందపరచింది. ఓనాడు ఓ గ్రామచావడి వద్ద మరేదో నాట్య ప్రదర్శన జరుగుతున్నది. ఇవన్నీ వీధి ప్రదర్శనలు. దేశీ నాట్యాలతో, దేశీ పాటలతో, దేశీ సంగీతంతో కలగూరగంప ప్రదర్శనలు.
ప్రదర్శన ప్రారంభంగా వాద్య పలకరింపు..
ఒకరిద్దరు కళాకారులు కనిపించగానే గ్రామీణులు కళ్లు ఇంతింత చేసుకుని ఆశ్చర్యంగా చూడసాగారు. ఉన్నంతలో ఏవేవో దుస్తులు.. కొద్ది ముఖ లేపనాలతో విచిత్రంగా కనిపిస్తున్న కళాకారులు.. ఓ తీగవాద్యం మోగగానే గొంతు సవరించుకుని పాడటం మొదలెట్టారు.
“అయివోద్ది (అయోధ్య) పట్నానా అది వరి సావిడీ
లవ కుమారా వినిమన్నా కుశల కుమారా
సావిడి ఎనకాల సాకలోళ్ల ఇళ్లమ్మా ॥లవ॥”..
సీతమ్మ వనవాసం. ప్రధాన గాయకుడు, గాయని కలసి పాడుతుండగా.. పక్కన వంతలు లాంటి గాయక బృందం వారితో గొంతు కలుపుతూ కథ చెబుతున్నారు. తదనుగుణంగా ముందు పాత్రధారులు తమతమ పాత్రలకు అనుగుణంగా నాట్యమాడుతూ మధ్య మధ్య సంభాషణలు పలుకుతున్నారు.
పామరులు సీతమ్మ కష్టాలకు కన్నీరు మున్నీరవుతున్నారు. కానీ, నాట్యకళా కోవిదుడు జాయపుడు గతంలో లాగా పూర్తిగా అందులో లీనం కాలేకపోతున్నాడు. నాట్య విద్యార్థిగా దేశీ, మార్గీ నాట్య సంప్రదాయాలను చదివిన వాడు కావడంతో.. ఈ ప్రదర్శనలో లీనమవడంకన్నా పరిశీలించడం ఎక్కువైంది.
చిన్ననాటి నుంచి అనుమకొండలో ఏది చూసినా ‘అదేంటి? ఇదేంటి?’ అని అమాయకంగా అడిగేవాడు. చుట్టూ ఉన్న ప్రతిభావంతులైన మిత్రుల్లో ఎవరో ఒకరు వివరించి చెప్పేవారు. గురుకులంలో ఉన్నా, వేశ్యాగృహంలో ఉన్నా.. గురువులను, నీలాంబ అక్కను ఇలాగే ప్రశ్నించేవాడు.
పక్కన కూర్చున్న వ్యక్తిని అడిగాడు యధాలాపంగా.
“ఈ ప్రదర్శనను ఏమంటారు?”.
“ఇది యక్షగానం. ఈళ్లు యక్షులు. ఈళ్లు ఆడే పాడే వాటిని యక్షగానాలు అంటారు”.
“యక్షులంటే.. అప్సరసలు! యక్ష గంధర్వ కిన్నెర”..
“అదేదో నాకూ తెలవదు గానీ, ఆంధ్రప్రాంతంలో ఆదిమ గణాలు మూడు. నాగులు, యక్షులు, ద్రవిడులు. వీళ్లలో యక్షులు భట్టిప్రోలు ప్రాంతం అంటే అదిగదిగో అక్కడ.. కృష్ణమ్మకు అద్దరి.. ఆళ్ల గానాలు, నాట్యాలను యక్షగానాలు అంటార్లే..” అన్నాడా పక్కవాడు.
యక్షుల లేదా జక్కుల కళ.. దక్షిణాది నాట్య సంప్రదాయమంటూ భరతముని నాట్యశాస్త్రంలో పేర్కొన్నట్లు జాయపునికి గుర్తొచ్చింది. పక్కకు చూశాడు. అప్పుడే ఆ పక్కవాడూ జాయపుణ్ని చూశాడు. జాయపుడు వెళ్లిన ప్రతి ప్రదర్శన వద్దా అతను కనిపిస్తున్నాడు. జాయపుడు ఏదో అడగబోయాడు. ఆ గోలలో వినిపించలేదు. ఇద్దరూ లేచి జనాన్ని తోసుకుని ప్రదర్శన ఆవలకు వెళ్లారు. జాయపుడు అడుగుదామనుకున్న ప్రశ్న.. అతనే అడిగాడు.
“నువ్వేంది.. నేనెళ్లిన పెతి నాట్టెం కాడా కనపడతున్నావ్.. ఏందీ కత??”.
“నేనూ అదే అడుగుదామనుకుంటున్నా. నేను వెళ్లిన చోటుకల్లా నువ్వూ హాజరవుతున్నావ్.. ఏమిటి కథ?”.
అప్పుడు ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. సమవయస్కుడు. రూపురేఖలూ బాగున్నాయి. అతనొక నాట్యకారుడో, సాహిత్యకారుడో కావచ్చని జాయపుడు గుర్తించాడు. అతనూ అలాగే గుర్తించినట్లు రెప్పలు పైకెత్తి, ఆశ్చర్యం ప్రకటించి అన్నాడు జాయపునితో..
“నువ్వు.. తమరూ..?!”.
“నేనొక నాట్యాచార్యుడినిలే! అనుమకొండ నుంచి బంధువుల ఇంటికి తలగడదీవి వచ్చాను. తమరో?”.
అప్పటివరకూ ఆధిపత్యపు ధోరణితో వెటకారం దట్టించి.. వెలనాడు గ్రామ్యంలో మాట్లాడే పెళుసు మాటలు తగ్గించి, సాధారణ ధోరణిలోకి వచ్చాడతను.
“నేను.. పరాశరుడు. ‘పరాశరదాసు’ నా పేరు” అని చెప్పాడు.
“నా పేరు జగన్నాథుడు..” తడుముకోకుండా అబద్ధం చెప్పేశాడు జాయపుడు.
ఆశ్చర్యంగా చూశాడు పరాశరుడు.
“జగన్నాథమా!?.. మీరు వైష్ణవులా??”.
ఈసారి ఆశ్చర్యపోవడం జాయపుని వంతయ్యింది.
“వైష్ణవం ఏమిటీ?.. అది నా పేరు అంతే!!”.
“పైన వీభూతి రేఖలు.. పేరు జగన్నాథం! భలే భలే! మాకాడ అట్టా కుదరదు. ఏ మతం వోళ్లు ఆ దేవుళ్ల పేర్లే పెట్టుకుంటారు. నువ్వు శైవుడివి అయితే శివనామం లేదా రుద్ర, ఈశ్వర.. లాంటి పేర్లు పెడతారుకదా పెద్దోళ్లు. అందుకని అడిగా!”.
నిర్ఘాంతపోయాడు జాయపుడు. తనకు తెలియని ప్రపంచం చాలా ఉన్నదని ఇటీవల.. వెలనాడు వచ్చినప్పటి నుంచీ అనిపిస్తున్నది.
“సరే సరే.. ఏం చేస్తుంటావ్ మిత్రమా?”.
“గేయ కవిని. నిజం చెప్పొద్దూ.. ఈ గేయనాటకం రాసింది నేనే..” అన్నాడు సాధారణంగా.
“అవునా!? మరి ఈ ప్రేక్షకపాత్ర ఏమిటి?”.
“నా రచన ప్రదర్శనగా ఎలా ఉందో ప్రేక్షకుల్లో కూర్చుని పరిశీలిస్తుంటాను. మాది గుద్రవాడ ప్రాంతం కృష్ణాతీరం”.
“ఈ రాజ్యమంతా కృష్ణాతీరమే. ఇక్కడ కృష్ణమ్మ ఎన్నోపాయలైతే అన్నిపాయల చుట్టూ గ్రామాలే కదా!? ఏ ఊరు పేరు చెప్పినా కృష్ణాతీరమే!”.
“అవునూ.. మీది అనుమకొండ అన్నారు కదా!? నాట్యం ఎక్కడ అభ్యసించారు?”.
వెలనాటి గరుకు, యాస తగ్గించి.. పరాశరుడు పండితునిలా మాట్లాడటం జాయపుడు గుర్తించాడు.
“గుండయామాత్యులవారు మా గురుదేవులు”.
పూర్తిగా జారిపోయాడు పరాశరుడు.
“ఓహ్..” అంటూ భక్తిగా ఆరాధనపూర్వకంగా జాయపుణ్ని చూశాడు.
“అమ్మో.. సాక్షాత్తూ గుండయామాత్యులవారి శిష్యులంటే.. మీరు నాట్యంలోనే కాదు. గీతం, గానం, వాద్యం.. అన్ని కళారూపాలలో సంపూర్ణ ప్రజ్ఞావంతులు!”.
అందులో ఏ అర్హత చెప్పినా జాయపుని శరీరాకృతి సరిపోలుతుంది. ప్రతి పదంలోనూ గొప్ప గౌరవాన్ని పలికిస్తున్నాడు పరాశరుడు ఇప్పుడు. జాయపునికి కూడా కొంత పులకింతగానే ఉంది. అనుమకొండ దాటాక అతని పూర్ణప్రజ్ఞను గుర్తించి గౌరవించడం తిమ్మిరి తిమ్మిరిగా ఉంది.
‘అప్పుడు పిల్లవాణ్ని. ఇప్పుడు పెద్దవాణ్ని. భలే.. చాలా బావుంది!’ హుషారుగా నడుస్తూ వెలనాడు ప్రాంతపు నాట్య, సంగీత, గేయ, వాద్య సంప్రదాయాలను అడుగుతున్నాడు జాయపుడు. వినయంగా వివరిస్తున్నాడు పరాశరుడు. ఇద్దరికీ మంచి మైత్రి కుదిరింది. తాను మండలేశ్వరుడినని చెప్పలేదు. యుద్ధ వీరుడిననీ, కాకతీయరాజ్య గజసాహిణీననీ అస్సలు చెప్పలేదు.
అతను రచించిన గేయనాట్య తర్వాతి ప్రదర్శన ఎక్కడో చెబుతాడు పరాశరుడు. ఇద్దరూ అక్కడ కలుస్తారు. ఇద్దరూ నిత్యమూ కలవడం.. నువ్వూ అంటే నువ్వూ అని పలకరించుకోవడం వరకూ వచ్చారు. పరాశరుడు గుద్రవాడ ప్రాంతం నుంచి ధనదుపురం వచ్చినప్పుడు ఓ కవి మిత్రుని ఇంట ఉంటాడు. ఆ మిత్రుని పేరు పెద్దనార్య. పరాశరుడు జాయపుణ్ని పరిచయం చేశాడు.
“వెలనాడు పండితులకు, కవిగాయక కళాప్రకాండులకు పెద్దన నివాసం ఓ కళాగృహం.. సాహిత్య చర్చావేదిక. చుట్టుపక్కల గ్రామాలనుంచి కవులు, పండితులు సంధ్యవేళకు ఇక్కడికి చేరతారు. మనం సంధ్యవేళకు వస్తే బోలెడుమంది కలుస్తారు. అబ్బో.. కబుర్లే కబుర్లు. సాహిత్యచర్చలతో ఈ ఇల్లంతా హోరెత్తిపోతుంది. ఇక ఆతిథ్యానికి మా పెద్దన జంట పెట్టింది పేరు. తినుబండారాలకు, భోజనానికి లోటులేదు. రాత్రి రేవు దాటలేని వాళ్లకు నిద్రకు ఏర్పాట్లున్నాయి. వెనుక గుర్రపుశాల కూడా ఉంది”.
ఈ పెద్దన నాగంభట్టులా కాస్త కుదమట్టంగా నిండుగా ఉన్నాడు. జాయపునికి నచ్చాడు. ఇద్దరూ తర్వాత చాలాసార్లు అక్కడికి వచ్చారు. పాతిక ముప్ఫైమంది కవి పండితులు మిత్రులయ్యారు.
ఓరోజు కబుర్ల మధ్య భల్లాటుడు అనే కవి ఓ పద్యాన్ని పాటలా ఎత్తుకున్నాడు.
“తలచిన డెందము కందును
పలికిన నోరెల్ల పొక్కు ప్రభ సూచిన రె
ప్పలు కమరుననగ పటుతర
విలయానల భాతినెండ వేసవి గాచెన్..”
కాసేపు రాగం తీసి తీసి ఆపాడు. అందరూ చప్పట్లు కొట్టారు.
“బాగుంది బాగుంది.. తలచిన డెందము కందును. తలిస్తేనే మనసు కందిపోతుంది. ఓహో!”..
“పలికితేనే నోరు పొక్కుతుంది. ఒహోహో!”..
“రెప్పలు కమరడం.. అద్భుతం! వేసవిమీద భలే పజ్జెం కట్టావోయ్ మిత్రమా!”..
మిత్రులు అందులోనున్న అంతరార్థాన్ని వివరిస్తూ మైమరచారు.
“జాను తెలుగు అన్నాడోయ్ మన గురువు నన్నెచోడుడు..” అన్నాడు పద్యం చెప్పిన భల్లాటుడు.
“అవునవును.. దేశీ కవితకు పట్టం కట్టాడాయన”..
నన్నెచోడుడు క్షత్రియ కవి. మండలేశ్వరుడు. ఆయనను కొంత చదివిన జాయపుడు ఉత్సాహంగా చూశాడు.
ఇప్పుడు వెలనాడు పండితులకు తెలుగు పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా దేశీ తెలుగు. ఈ పిచ్చి ఎంతగా వ్యాపించింది అంటే.. ఇటీవల పెద్దలు పెట్టిన పేర్లు కూడా సంస్కృత వాసన కొడుతున్నాయని వాటిని తెలుగు పేర్లుగా మార్చుకుంటున్నారు ఈ కుర్రపండితులు.
భైరవుడు బయ్యన.. భాస్కరుడు బాచన.. జగన్నాథుడు జగ్గన.. ఇలా.
ఇప్పుడు తెలుగు పండితులకు ప్రత్యేక ఆకర్షణ తిక్కన. తొండనాడులోని తిరుకాళత్తి దేవునిపేరు తల్లిదండ్రులు పెట్టగా.. ‘తిక్కన’ అని మార్చుకున్నాడని ఇక్కడ చెప్పుకోవడం విని ‘ఔరా!’ అనుకున్నాడు జాయపుడు.
“నన్నెచోడుడు పద్యం, గద్యం కలిపి రాసిన విధానం విప్లవాత్మకంగా ఉంది. ఆ పద్ధతిని చంపూ అనొచ్చు..” మరో పండితుడు.
“చంపావ్ పో! చంపూ ఏమిటి.. చంపూ.. నరుకు.. గొంతు కొయ్..” అన్నాడు మరొక యువకవి.
అందరూ ఘొల్లున నవ్వారు.
“చంపూ పద్ధతి అని ఆయనే అన్నారా.. నువ్వు పెట్టావా!? దానికి అర్థమేమిటి?” మరోకవి పరిహాసపు కుతూహలం.
“చప్పనయ్యా.. చప్పనంటే చప్పను! అలా నోటికి వచ్చేసింది. అనేశాను. ఏం.. నచ్చలేదా?”.
“నచ్చలేదా అంటే నచ్చిందో లేదో ఇంకా నిర్ణయించుకోలేదు. దీని భావమేమి.. ఈ చంపూ అనేది సంస్కృతంలో, ప్రాకృతంలో.. లేదంటే తెలుగన్నడలో ఉందా?”.
“ఏమో మహానుభావా.. తెలియదు. నా మనసులో పుట్టింది పెట్టేశాను”.
అందరూ అంగీకరిస్తున్నట్లు నవ్వుతుండగా, మరో కవి అన్నాడు.
“అయితే వెయ్యండ్రా. వీరతాళ్లు.. నాలుగు!”.
“వీరతాళ్లా.. మరొక కొత్తపదం.. జాను తెలుగు”.
పండిత కవుల ఏకగ్రీవ నవ్వులు చప్పట్లలో ఆ మందిరమంతా పరిమళించింది.
వీరిలో మౌఖిక, శ్రుత సంప్రదాయంలో వేదవేదాంగాలు ఏమాత్రం వత్తు, రేఫ తప్పులేకుండా వల్లెవేసి వేసి.. రాటుదేలిపోయిన పండిత వంశాలవారే ఎక్కువమంది. తాత తండ్రులిచ్చిన కఠినమైన ప్రాథమిక శిక్షణ, సాధన వల్ల సంస్కృతం, ప్రాకృతం భాషలపై అపారమైన పట్టున్నవాళ్లే అంతా. మాతృభాషలో ప్రతిపనికీ తగిన తెలుగుభాషా పదాలను సృష్టించడం చూసి జాయపుడు ఆశ్చర్యపోయాడు. అదే అడిగాడు.
“ప్రతి సంస్కృత పదాన్నీ తెలుగు చేయాల్సిన అవసరం ఉందా?” అని..
“ఉంది. ఉందిగాక ఉంది. దీనినే ‘తెలుగు నిలుపుట’ అన్నాడు నన్నెచోడుడు. మన రాజ్యం, మన భాష. మన ప్రజలు మాట్లాడుకునే ప్రతిపనికీ తగిన పదం కట్టాలి. ఒకప్పుడు సంభాషణ ప్రాకృతం, తర్వాత తెలుగన్నడ, తెలుగుతమిళం, తెలుగుమరాఠం అనేవాళ్లం. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ వేరువేరైనాయి. ఇప్పడు మన భాషనూ పరిపుష్టం చేసుకోవాలి. ప్రజలు మాట్లాడే పదాలు, వాక్యాలు చాలా సాధారణంగా ఉంటాయి. అవన్నీ గ్రంథస్తం చేయాలంటే ముందు వాటిని సంస్కరించాలి”.
“ప్రజల భాష అది. దానిలోనే అందం చందం ఉంటాయి. అదే దేశీ అంటున్నాం కదా. ఇక సంస్కరించడం ఏమిటి”.. జాయపుని సందేహం.
“వాళ్లువాగే ప్రతిమాట దేశీ అయినా కొంత సంస్కరించి కవులం.. సాహితీరూపంలోకి ఒదిగేలా గ్రంథస్థం చేస్తాం!”.
“అంటే అప్పుడు మార్గి అవుతుందా?”.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284