హరారే : వన్డే మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు పరుగులు రావడమే అరుదు. అలాంటిది ఓ జట్టు 800 ప్లస్ రన్స్ చేసిందంటే నమ్మగలమా!. ఈ అసాధ్యాన్ని జింబాబ్వేలోని ఓ క్లబ్ జట్టు సుసాధ్యం చేసింది. దేశవాళీ ఫస్ట్- లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా మిథేన్ లయన్స్ జట్టుతో జరిగిన వన్డేలో స్కార్పియన్స్ క్రికెట్ క్లబ్ జట్టు 50 ఓవర్లలో ఏకంగా 822/4 స్కోరు చేసి ఔరా అనిపించింది. ఆ టీమ్ బ్యాటర్లు 16.44 రన్‌రేట్‌తో పరుగుల మోత మోగించారు.
ఓపెనర్ తకుడా మడెంబో (143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్సర్లతో 302) ట్రిపుల్ సెంచరీ కొట్టి రిటైర్ ఔట్ అవ్వగా మరో ఓపెనర్ విన్ఫెడ్ (203) డబుల్ సెంచరీ, గాబ్రియెల్ జయ (110 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టారు. ప్రత్యర్థి బౌలర్లు 23 నోబాల్స్ సహా 108 ఎక్స్‌ట్రాలు వేయడం విశేషం. ఛేదనలో లయన్స్ 28 రన్స్‌కే పరిమితం అవడంతో స్కార్పియన్స్ 794 పరుగుల తేడాతో విజయం అందుకుంది. అధికారిక లిస్ట్-ఎ క్రికెట్లో బీహార్ జట్టు చేసిన 574/6 స్కోరు ఇప్పటివరకు అత్యధికం. అనధికార మ్యాచ్ అయినప్పటికీ స్కార్పియన్స్ స్కోరు లిస్ట్-ఎలో సరికొత్త రికార్డుగా మిగిలిపోనుంది.