Zimbabwe | నైరోబీ: టీ20ల్లో మరో ప్రపంచ రికార్డు బద్దలైంది. రికార్డులకు పెట్టింది పేరైన పొట్టి పోరులో పరుగుల వరద పారింది. టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్‌లో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 344 స్కోరుతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. పరుగుల హోరు వెల్లువెత్తిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 290 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గాంబియా బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 120 బంతుల్లోనే 344 పరుగులు నమోదు చేసి ఇంతకుముందు నేపాల్(314) పేరిట రికార్డును జింబాబ్వే తాజాగా తుడిచిపెట్టింది. కెప్టెన్ సికిందర్ రజా(43 బంతుల్లో 133 నాటౌట్, 7ఫోర్లు, 15సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
గాంబియా బౌలర్లను దునుమాడుతూ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దొరికిన బౌలర్‌ను దొరికినట్లు బాదుతూ బౌండరీల జడివాన కురిపించాడు. వార్ వన్‌సైడ్ అన్నట్లు సాగిన జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మొత్తం 30 ఫోర్లు, 27 సిక్స్‌లు నమోదయ్యాయంటే విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇటీవలే బంగ్లాదేశ్‌పై భారత్ నెలకొల్పిన(297) రికార్డును జింబాబ్వే(టెస్టు ఆడే దేశం) దాటేసింది. గాంబియా బౌలర్లలో ముసా జోబర్త్(93 పరుగులు) అత్యధిక పరుగులిచ్చుకుని చెత్త రికార్డు మూట గట్టుకున్నాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకు కుప్పకూలింది. జార్జు(12) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రిచర్డ్ (3/13), బ్రాండన్ (3/10) మూడు వికెట్ల తీశారు. రజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.