NZ vs ZIM : సుదీర్ఘ ఫార్మాట్లో న్యూజిలాండ్ (Newzealand) భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కివీస్ ఆతిథ్య జింబాబ్వే (Zimbabwe)ను వణికిస్తూ ఇన్నింగ్స్ 369 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. బ్యాటర్ల వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో 125కే కుప్పకూలిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అంతకంటే తక్కువకే చతికిపడింది. రచిన్(165), కాన్వే (153), నికోల్స్(150) శతకాల మోతతో కుదేలైన జింబాబ్వేను కుర్ర స్పిన్నర్ జకరీ ఫౌల్కీ(5-37) గట్టి దెబ్బకొట్టాడు. పేసర్ మ్యాట్ హెన్రీ (2-16) సైతం ఓ చేయి వేయడంతో శాంట్నర్ సేన జింబాబ్వేను వైట్‌వాష్ చేసింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. తొలి టెస్టులో భారీ తేడాతో గెలుపొందిన కివీస్ రెండో మ్యాచ్‌లోనూ తిరుగులేని ఆటతో జింబాబ్వేను ఓడించింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు సెంచరీతో విరుచుకుపడితే.. బౌలర్లు వికెట్ల పండుగతో ఆతిథ్య జట్టుకు ఘోరమైన పరాజయాన్ని అందించారు.
New Zealand make it 2-0 with a monster win pic.twitter.com/3zeObt2Afc
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2025
మ్యాట్ హెన్రీ(5-40) విజృంభణతో తొలుత జింబాబ్వేను 125కే కట్టడి చేసిన కివీస్.. తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోర్ చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(153 ), హెన్రీ నికోలస్ (150), రచిన్ రవీంద్ర(165)లు సెంచరీలతో కదం తొక్కగా.. విల్ యంగ్(74) అర్ధ శతకంతో రాణించాడు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌ను 601-3 వద్ద డిక్లేర్ చేసిన కివీస్.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థి భరతం పట్టింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించిన హెన్రీ రెండో ఇన్నింగ్స్‌లోనూ తన పేస్ పవర్ చూపిస్తూ ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (0), బ్రెండన్ టేలర్(7)లను ఔట్ చేశాడు. ఆ తర్వాత కుర్రాడు జకరీ ఫౌల్కెస్ (5-37) బంతిని గింగిరాలు తిప్పుడూ జింబాబ్వే బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. అతడి స్పిన్‌కు బదులివ్వలేక మిడిలార్డర్ కుప్పకూలగా.. నిక్ వెల్చ్(47 నాటౌట్) మత్రం కాసేపు పోరాడాడు. కానీ, సహచరులు ఇలా వచ్చి అలా వెళ్లడంతో జింబాబ్వే తమ టెస్టు చరిత్రలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
A five-wicket innings haul for Zakary Foulkes, who now has the best Test match figures on debut for New Zealand 🙌 #ZIMvNZ pic.twitter.com/wkNQjJ8i93
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2025