బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య గురువారం బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ రైద్దెంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇదివరకే లీగ్ దశలో దాయాదితో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన యువరాజ్ సింగ్ సేన.. కీలకమైన సెమీస్‌లోనే అదే స్టాండ్‌ను అనుసరించింది. దీంతో టోర్నీ నుంచి భారత్ వైదొలగగా.. పాక్ నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
అంతకంటే ముందు సెమీస్ పోరుకు తాము స్పాన్సర్షిప్ చేయబోమని ఈ లీగ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ‘ఈజ్ మై ట్రిప్’ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ నిషాంత్ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘డబ్ల్యూసీఎల్లో భారత జట్టు సెమీస్ చేరినందుకు అభినందనలు. మీరు దేశం గర్వించేలా చేశారు. అయితే పాకిస్థాన్‌తో జరుగబోయే సెమీస్ పోరు కేవలం మరో మ్యాచ్ వంటిది కాదు. ఉగ్రవాదం, క్రికెట్ ఒకదానికొకటి ముడిపడి ఉండవు. ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగేదాకా మేం పాక్‌తో ఎలాంటి మ్యాచ్‌లకూ స్పాన్సర్ చేయబోం. కొన్ని అంశాలు క్రీడల కంటే ఎక్కువ. ఎప్పుడైనా దేశమే ఫస్ట్. ఆ తర్వాతే వ్యాపారం’ అని పేర్కొన్నారు.