నర్సింహులపేట, జూలై 2: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల జయపురం గ్రామానికి చెందిన చందు లావణ్య వాలీబాల్‌లో మెరుపులు మెరిపిస్తున్నది. చిన్న తనం నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న లావణ్య అంచలంచెలుగా ఎదిగింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. చింతకుంట(కరీంనగర్) ఎస్సీ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న లావణ్య ఆసియా అండర్-20 వాలీబాల్ టోర్నీకి ఎంపికైంది. కజకిస్తాన్ వేదికగా ఈనెల 4 నుంచి 11 వరకు జరిగే మెగాటోర్నీలో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నది. ఆసియా టోర్నీ కోసం ఏర్పాటు చేసిన శిక్షణాశిబిరంలో ఆకట్టుకున్న లావణ్య..సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
జయపురం గ్రామవాసి అయిన లావణ్యది పేద కుటుంబం. తండ్రి చందుభిక్షం దివ్యాంగుడు కాగా, తల్లి రాజమ్మ రోజు కూలీగా పనిచేస్తున్నది. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించింది. నాలుగవ తరగతి చదువుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ పీఈటీ నేలకుర్తి వీరారెడ్డి శిక్షణలో ఓనమాలు నేర్చుకున్నది. గ్రామ, మండల, జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో సత్తాచాటింది. ఒకటవ తరగతి నుంచి ఏడు వరకు జయపురంలో, ఎనిమిది నుంచి పది వరకు నర్సింహులపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదివింది. ఆ తర్వాత చింతకుంటలో ఇంటర్ విద్యనభ్యసించిన లావణ్య..ఎనిమిది సార్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2018 నిజామాబాద్‌లో జరిగిన ఎస్జీఎఫ్ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం, 4వ సబ్ జూనియర్ వాలీబాల్ చాంపియన్ షిప్ 2019లో బంగారు పతకం, 4వ సబ్ జూనియర్ వాలీబాల్ చాంపియన్ షిప్లో వెండి పతకం సాధించింది. పాఠశాల స్థాయి నుంచి వివిధ విభాగాల్లో ఎనిమిది సార్లు జాతీయస్థాయి వాలీబాల్‌కు ఎంపికైన లావణ్య 20 ఏండ్ల విభాగంలో భారత శిబిరానికి ఎంపికై భువనేశ్వర్‌లో శిక్షణ పొందింది. లావణ్య ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు కజకిస్థాన్‌లో జరిగే ఆసియా టోర్నీకి ఎంపిక చేశారు.