Paris Olympics : భారత యువ రెజ్లర్ నిశా దహియా(Nisha Dahiya) సంచలనం సృష్టించింది. అద్భుత విజయంతో ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తు కైవసం చేసుకుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో 24 ఏండ్ల నిశా తన ఉడుం పట్టుతో చెలరేగింది. 68 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె కీలక పోరులో తడాఖా చూపించింది.
శనివారం జరిగిన సెమీఫైనల్లో నిశా దుమ్మురేపింది. రొమేనియాకు చెందిన అలెగ్జాండ్ర అంఘేల్(Alexandra Anghel)ను చిత్తు చేసింది. ఏకపక్ష పోరులో 8-4పై గెలుపొందిన నిశా ఫైనల్‌కు దూసుకెళ్లి విశ్వ క్రీడలకు అర్హత సాధించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో మహిళా రెజ్లర్‌గా రికార్డు సొంతం చేసుకుంది.
రెజ్లర్లకు కేరాఫ్ అయిన హర్యానాలోని రోహతక్(Rohtak)లో నిశా పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీల్లో పాల్గొన్న అక్కడి చోటు రామ్ స్టేడియంలో అనుభవజ్ఞులైన కోచ్‌లు వద్ద రెజ్లింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. ఆమె టీనేజ్లోనే అద్భుత విజయాలు సాధించింది. అంతేకాదు ప్రపంచ చాంపియన్‌షిప్ అండర్ -23లో కాంస్య కొల్లగొట్టిన నిశా.. భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకుంది. కుటుంబం, కోచ్‌లు, ఈ దేశం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిశా మరోసారి నిజం చేసింది. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్‌లో తన కుస్తీ పవర్ చూపించి ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖారారు చేసుకుంది.