హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ ఆర్చర్ చికితారావు రెండు పతకాలతో సత్తాచాటింది. భటిండా(పంజాబ్)లో గల గురుకాశీ విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న కాంపౌండ్ ఆర్చరీ పోటీల్లో చికిత బృందం మిక్స్డ్ టీమ్ విభాగంలో పసిడి పతకంతో పాటు మహిళల టీమ్ కేటగిరీలో కాంస్యం గెలుచుకుంది.
మిక్స్డ్ ఫైనల్లో చికత, ప్రథమేశ్ జోడీ, రిశబ్ యాదవ్, ప్రగతి ద్వయం మధ్య స్కోర్లు 160/160తో సమమయ్యాయి. టైబ్రేకర్‌లో చికిత, ప్రథమేశ్ జంట 20/19తో ప్రత్యర్థిపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మహిళల టీమ్ కాంస్య పోరులో చికిత, వర్షిణి(తమిళనాడు), ఖుషి(రాజస్థాన్) త్రయం 231-226తో మెహక్, జ్ఞానేశ్వరి, కసూల్ రుతూజ(మహారాష్ట్ర) త్రయంపై గెలిచి కాంస్యం దక్కించుకుంది.