భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది నవశకానికి నాంది. ఇప్పటివరకు సింగిల్స్‌లో సత్తా చాటుతూ వస్తున్న మన షట్లర్లు.. డబుల్స్‌లో నయా చరిత్ర లిఖించారు. సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గడం ద్వారా.. ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా రికార్డుల్లోకెక్కింది. ప్రపంచ టూర్-1000 టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదివారం సాత్విక్-చిరాగ్ ద్వయం 21-17, 21-18తో ఆరోన్ చియా-సో వుయిక్ (మలేషియా) జంటపై విజయం సాధించింది.
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైంది. యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ టూర్-1000 టోర్నీ డబుల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్లుగా రికార్డుల్లోకెక్కారు. సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లంతా వెనుదిరిగిన సమయంలో.. ఈ జోడీ డబుల్స్‌లో అదరగొట్టింది. తెలుగు కుర్రాడు సాత్విక్ తన సూపర్ స్మాష్‌లతో సత్తాచాటితే.. చిరాగ్ పదునైన నెట్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు.
జకార్తా: భారత యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి డబుల్స్ ప్లేయర్లుగా రికార్డుల్లోకెక్కారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్-1000 టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదివారం సాత్విక్-చిరాగ్ జోడీ 21-17, 21-18తో ఆరోన్ చియా-సో వుయిక్ (మలేషియా) ద్వయంపై విజయం సాధించింది. గతంలో సూపర్-300 (సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్), సూపర్-500 (థాయ్‌లాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్), సూపర్-750 (ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గిన భారత జంటకు.. సూపర్-1000 కేటగిరీలో ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.
నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన ఈ జంట.. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనొసాగిస్తున్నది. 43 నిమిషాల్లో ముగిసిన తుదిపోరులో భారత షట్లర్లు అదరగొట్టారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించారు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ.. గతంలో ప్రత్యర్థితో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైనా.. ఈ సారి ఆ విషయం పక్కనపెట్టి విజృంభించింది. గతంలో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (2017), మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2010, 2012) ఇండోనేషియా ఓపెన్ టైటిల్స్ నెగ్గగా.. డబుల్స్ విభాగంలో దేశానికి ఇదే తొలి టైటిల్. పురుషుల డబుల్స్‌లో దేశం తరఫున ఆరు ప్రపంచ టూర్ టైటిల్స్ నెగ్గిన తొలి జోడీగానూ సాత్విక్-చిరాగ్ రికార్డు నెలకొల్పారు.
ఇండోనేషియా ఓపెన్ టైటిల్ నెగ్గిన సాత్విక్-చిరాగ్ జోడీని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అభినందించారు. కెరీర్లో తొలిసారి సూపర్-1000 టైటిల్ సాధించిన షట్లర్లను కొనియాడిన సాట్స్ చైర్మన్.. వారి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన ఈ జోడీ.. భవిష్యత్తులో ఒలింపిక్ పతకం తప్పక సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈ విజయంతో ఉప్పొంగిపోవడం లేదు. తదుపరి వారం మరో టోర్నీ ఉంటుంది. దానికోసం తిరిగి సిద్ధం కావాల్సిందే. ఫైనల్లో ఇరు జట్ల మీద సమానమైన ఒత్తిడి ఉంటుంది. ఎవరు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే వారిదే పైచేయి అవుతుంది. పూర్తి కంట్రోల్‌తో షాట్లు ఆడాటం బాగా కలిసొచ్చింది. గేమ్ ప్లాన్ ప్రకారం ముందుకు సాగాం. మ్యాచ్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డాం. పాయింట్లు సాధించినా సాధికారికతతో ఆడలేకపోయాం. అయితే కాస్త ప్రశాంతంగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం. దీంతో వాళ్లు తప్పిదాలకు పాల్పడ్డారు. మా డ్రీమ్ టోర్నమెంట్స్‌లో ఇది కూడా ఒకటి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాం.
-చిరాగ్ శెట్టి
ఈ టోర్నీలో మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. టైటిల్ నెగ్గడం కంటే గతంలో మాపై ఎన్నోసార్లు పైచేయి సాధించిన జోడీని చిత్తుచేయడం చాలా ఆనందంగా ఉంది. వారితో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాం.. ఆ విషయాన్ని పక్కనపెట్టి ఈ మ్యాచ్‌లో తాజాగా బరిలోకి దిగాం. ఈ వారం గొప్పగా సాగింది. ముఖాముఖి రికార్డు అంత గొప్పగా లేకపోయినా.. ఈ రోజు శక్తిమేరకు ప్రయత్నించాం. ఒక్కో పాయింట్ నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండోనేషియా ఓపెన్ ప్రారంభం నుంచి వెన్నుదన్నుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. పెద్ద టోర్నీలు గెలువగలమని ముందు మాకు మేము నమ్మాం. దాన్ని మైదానంలో ఆచరణలో పెట్టాం. గత రెండు నెలలు పెద్దగా రాణించలేకపోయాం. ఈ దశలో ఇలాంటి విజయం దక్కడం ఆనందంగా ఉంది. ఈ గెలుపులో కోచ్‌లు, ఫిజియోల పాత్ర ఎంతో ఉంది. చాలా రోజుల తర్వాత పుల్లెల గోపీచంద్ సార్ మా మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆయన మా పక్కన ఉంటే చాలు ఏదో తెలియని శక్తి వచ్చినట్లుంటది.
– సాత్విక్ సాయిరాజ్