లిమా (పెరు): భారత యువ షూటర్ ఇందర్‌సింగ్ సురుచి ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పసిడి పంట పండిస్తున్నది. ఇటీవలే బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా) వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో స్వర్ణంతో పాటు కాంస్యం నెగ్గిన ఈ 18 ఏండ్ల ఝజ్జర్ (హర్యానా) అమ్మాయి.. మంగళవారం నుంచి లిమాలో మొదలైన టోర్నీలోనూ పసిడితో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్లో సురుచి.. 243.6 పాయింట్లతో బంగారు పతకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో సత్తాచాటిన మరో భారత అమ్మాయి మను భాకర్ (242.3) స్వల్ప తేడాతో రజతం గెలుచుకుంది. చైనా షూటర్ యావో (219.5) కాంస్యం నెగ్గింది. క్వాలిఫికేషన్ రౌండ్లో సురుచి (582), మను (578) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. కీలకపోరులో సురుచి పలుమార్లు 10 పాయింట్ల సర్కిల్లో పాయింట్లు (చివరి 10 షాట్లలో 8 పది పాయింట్లు స్కోరు చేసినవే) రాబట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆరంభంలో సురుచి కంటే ముందున్న చైనా అమ్మాయి తర్వాత గురి తప్పి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీ పురుషుల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరి కాంస్యం గెలిచాడు.