ఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షూటర్ ప్రీతమ్ కెంద్రె పసిడి పతకంతో సత్తాచాటాడు. జర్మనీలోని సుల్ లోఆదివారం అర్ధ రాత్రి జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ పదహారేండ్ల పూణె చిన్నోడు.. 251.3 స్కోరు సాధించి స్వర్ణం గెలిచాడు.
ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసి టోర్నీ ఆడేందుకు వెళ్లిన ప్రీతమ్.. టోర్నీలో భారత పతకాల సంఖ్యను 11కు పెంచాడు. గగన్ నారంగ్ నేతృత్వంలోని ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ కుర్రాడు.. తీవ్ర ఒత్తిడిలోనూ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి ఔరా అనిపించాడు. ఇదే పోటీల్లో పాల్గొన్న భారత్‌కే చెందిన పీయూశ్ శర్మ.. 0.1 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు.