షిమ్కెంట్(కజకిస్థాన్) : ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల జూనియర్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత యువ షూటర్ అభినవ్షా 250.4 పాయింట్లతో స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇదే విభాగంలో లీ హ్యున్సె(కొరియా, 250.3), సిహాన్(చైనా, 229.2) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకోగా, హిమాంశు (206.6) నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ ఫైనల్లో సురేశ్ నరేన్, హిమాంశు, అభినవ్షాతో కూడిన భారత త్రయం 1890.1 పాయింట్లతో పసిడి దక్కించుకుంది.
ఇదే కేటగిరీలో చైనా (1885.1), కొరియా (1882.9) వరుసగా రజత, కాంస్యం సొంతం చేసుకున్నాయి. మహిళల జూనియర్ స్కీట్ ఫైనల్లో మాన్సి రఘువంశీ 53-52తో భారత్‌కే చెందిన యశస్వి రాథోడ్‌పై గెలిచి పసిడి పతకంతో మెరిసింది. ఇదే విభాగంలో లిదియా బషరోవా(కజకిస్థాన్, 40) కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుది పోరులో మాన్సి, యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచారు. మహిళల స్కీట్ జూనియర్ తుది పోరులో యశస్వి, మాన్సి, అగ్రిమ బృందం రజతం ఖాతాలో వేసుకుంది. పురుషుల స్కీట్ జూనియర్ ఫైనల్లో హర్మెహర్సింగ్(52), జ్యోతిరాధిత్యసింగ్(43) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.