చెంగ్డూ: చైనాలో జరుగుతున్న వరల్డ్ గేమ్స్‌లో భారత యువ క్రీడాకారుడు ఆనంద్‌కుమార్ వెల్కుమార్ కొత్త చరిత్ర సృష్టించాడు. చెంగ్డూ వేదికగా శుక్రవారం జరిగిన పురుషుల వెయ్యి మీటర్ల రోలర్ స్కేటింగ్ ఇన్లైన్ ఈవెంట్లో ఈ తమిళనాడు యువకుడు కాంస్యంతో సత్తాచాటాడు. వరల్డ్ గేమ్స్‌లో భాగంగా ఈ క్రీడలో పతకం గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఫైనల్లో ఆనంద్‌కుమార్ లక్ష్యాన్ని 1:22.482 నిమిషాల్లో పూర్తిచేసి కాంస్యం కైవసం చేసుకున్నాడు. శుక్రవారం నాటి ఫైనల్ పోటీకి ముందు జరిగిన ప్రిలిమినరీ రౌండ్లో లక్ష్యాన్ని 1:22.151 నిమిషాల్లో పూర్తిచేసి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.
అతడితో పాటు మరో భారత అథ్లెట్ అర్యన్పాల్ ఘుమాన్ సైతం సెమీస్ చేరాడు. అయితే సెమీస్‌లో ఆనంద్‌కుమార్.. రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లగా అర్యన్పాల్ ఏడో స్థానంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. ఫైనల్లో ఈ తమిళనాడు కుర్రాడు వ్యూహాత్మకంగా కదిలినా అతడి వేగం సరిపోలేదు. స్పెయిన్ అథ్లెట్ గుజ్మన్ సెబాస్టియన్ (1:22.288) అగ్రస్థానంలో నిలవగా కొలంబియా స్కేటర్ జాన్ ఎడ్వర్ హోల్గిన్ (1:21.846) రెండో స్థానాన్ని సాధించాడు.
కొలంబియాకే చెందిన జువాన్ మంటిల్ల మూడో స్థానంలోకి రాగా ఆనంద్‌కుమార్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కానీ నిర్వాహకులు జువాన్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో ఆనంద్‌కుమార్‌ను కాంస్యం వరించింది. ఈ విజయంతో టోర్నీలో భారత పతకాల సంఖ్య 3 (ఒక రజతం, రెండు కాంస్యాలు)కు చేరింది. వరల్డ్ గేమ్స్ సింగిల్ ఎడిషన్‌లో భారత్ రెండుకంటే ఎక్కువ పతకాలు సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.