Trisha Gongadi | కౌలాలంపూర్: మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో యువ భారత్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత అండర్-19 టీమ్ 8 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 12.1 ఓవర్లలో 86 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష(46 బంతుల్లో 58 నాటౌట్, 10ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్ నికీ ప్రసాద్(22 నాటౌట్) ఆకట్టుకుంది.
10 పరుగులకే ఓపెనర్ కమలిని(0) వికెట్ కోల్పోయిన భారత్‌ను తెలంగాణ డాషింగ్ బ్యాటర్ త్రిష ఆదుకుంది. బంగ్లా బౌలర్లను దంచికొడుతూ తన ఇన్నింగ్స్‌లో 10ఫోర్లతో చెలరేగింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన త్రిష మలి మ్యాచ్‌లో సత్తాచాటి జట్టు విజయంలో కీలకమైంది. అనీసా అక్తర్(2/19) రెండు వికెట్లు తీసింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా టీమ్ 80/8 స్కోరుకు పరిమితమైంది. ఆయూశి శుక్లా(3/9), సోనమ్యాదవ్(2/6) ధాటికి బంగ్లా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మొస్సామత్(11) టాప్‌స్కోరర్‌గా నిలువగా, మిగతావారు దారుణంగా విఫలమయ్యారు.