కౌలాలంపూర్: అరంగేట్రం ఆసియా అండర్-19 మహిళల టీ20 ఆసియాకప్‌లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ గొంగడి త్రిష(0) పరుగుల ఖాతా తెరువకుండానే నిష్క్రమించగా, కమిలిని(44 నాటౌట్), సనికా చాల్కె(19 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.
పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కమిలిని తన ఇన్నింగ్స్‌లో 4ఫోర్లు, 3సిక్స్‌లతో విజృంభించింది. తొలుత పాక్ 20 ఓవర్లలో 67/7 స్కోరు చేసింది. ఓపెనర్ కోమల్ఖాన్(24) టాప్‌స్కోరర్‌గా నిలువగా, మిగతావారు విఫలమయ్యారు. సోనమ్యాదవ్(4/6) పాక్ పతనంలో కీలకమైంది. కమిలినికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.