ముంబై: యూరప్ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (యూఈఎఫ్ఏ)లో ప్రాతినిథ్యం వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లెందరో ఆసక్తిచూపుతారు. అటువంటి లీగ్‌లో ఆడేందుకు భారత్ నుంచి ఓ కుర్రాడు సిద్ధమయ్యాడు. మహారాష్ట్రకు చెందిన యొహాన్ బెంజిమిన్.. యూఈఎఫ్ఏ యూత్ లీగ్ 2025/26 సీజన్లో ఆడనున్నాడు.
స్లోవేనియాకు చెందిన ఎన్కే బ్రావో క్లబ్.. బెంజిమిన్‌కు తమ జట్టులో చోటు కల్పించింది. తద్వారా యూఈఎఫ్ఏకు ఎంపికైన తొలి భారతీయ ఆటగాడిగా బెంజిమిన్ రికార్డులకెక్కాడు. ఎన్కే బ్రావో జట్టు.. ఈ రోస్టర్‌లో అక్టోబర్ 22, నవంబర్ 05న పోర్చుగీస్ దిగ్గజం ఎఫ్‌సీ పొర్టొతో మ్యాచ్‌లు ఆడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లలో గనుక బెంజిమిన్ ఆడితే యూఈఎఫ్ఏలో ఆడిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.