పెర్త్: చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలే తనను రాటు దేల్చాయని అవే తన విజయానికి సోపానాలుగా నిలుస్తున్నాయని భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ అన్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జైస్వాల్ కుటుంబం బతుకుదెరువు కోసం అతడి చిన్నతనంలోనే ముంబైకి మకాం మార్చగా అతడి తండ్రి దేశ ఆర్థిక రాజధానిలో ఉన్న ఆజాద్ మైదాన్‌కు సమీపంలో పానీపూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. క్రికెట్ ప్రాక్టీస్ ముగిసిన తర్వాత జైస్వాల్ కూడా తండ్రికి పనిలో సాయం చేసేవాడు.
పెర్త్ విజయం అనంతరం ఓ ఆసీస్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైస్వాల్ మాట్లాడుతూ.. ‘నేను ఎలాంటి పరిస్థితుల్లోంచి అయినా బయటపడాలనుకున్న ప్రతిసారి నా గతాన్ని గుర్తుచేసుకుంటే నాకు కొండంత బలం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ప్రయాణం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. నేనెప్పుడూ పోరాడుతూనే ఉంటా. నేను యుద్ధరంగంలో ఉండాలని కోరుకుంటా. ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తా. యుద్ధం గెలవాలని పోరాడతా’ అని తెలిపాడు.