IND vs AUS BGT : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) లో భాగంగా పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ ఆయిన భారత్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాను కూడా 104 కట్టిపడేసింది. 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ (KL Rahul) నిలకడైన ఆటతో శుభారంభం లభించింది.
ఆట మూడో రోజు కేఎల్ రాహుల్ తన 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్‌ను దాటి ఆజేయంగా దూసుకుపోతున్నాడు. రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన పడిక్కల్ 25 పరుగులకే వెనుదిరగడంతో విరాట్ కోహ్లీ యశస్వికి జతగా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 299 పరుగులు. యశస్వి జైస్వాల్ 155 పరుగులతో, విరాట్ కోహ్లీ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.