నార్తాంప్టన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ‘ఏ’ జట్టు రెండో అనధికారిక టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ 417/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (51) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జైస్వాల్ (5) మరోసారి నిరాశపరిచినా కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (80)తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ధ్రువ్ జురెల్ (28) ఫర్వాలేదనపించగా.. నితీశ్ కుమార్ రెడ్డి (42), శార్దూల్ ఠాకూర్ (34) మెరిశారు. ఇక లోయరార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన తనుష్ కొటియాన్ (108 బంతుల్లో 90 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్), అన్షుల్ కంబోజ్ (51 నాటౌట్) ఇంగ్లీష్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.
ఈ ఇద్దరూ పట్టుదలగా ఆడి భారత ఆధిక్యాన్ని 400 పరుగుల మార్కును దాటించారు. టీ విరామ సమయానికి తనుష్ సెంచరీకి పది పరుగుల దూరంలో ఉన్నా కెప్టెన్ ఈశ్వరన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. 439 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ లయన్స్.. 11 ఓవర్లు బ్యాటింగ్ చేసి 32 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. మరో గంట ఆట మిగిలున్నా ఇరుజట్ల సారథుల అంగీకారంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టిన అన్షుల్.. బంతితోనూ రెండు వికెట్లు పడగొట్టి లయన్స్‌ను భయపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ అతడు రెండు వికెట్లు తీశాడు.