IPL Mega Auction | యశ్ దయాల్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్-2022 మెగా వేలంలో జాక్ పాట్ కొట్టాడు. యశ్ దయాల్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు. ఐపీఎల్-2022 మెగావేలం రెండోరోజు ఆదివారం యశ్ దయాల్‌ను కొత్త ఫ్రాంచైసీ గుజరాత్ టైటాన్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీ పడ్డాయి. కానీ చివరకు గుజరాత్ టైటాన్స్ టీమ్ సరసన చేరిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ నివాసి అయిన యశ్‌దయాల్.. సొంత రాష్ట్రం యూపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 142 కి.మీ. వేగంతో బంతిని విసరగల సమర్థుడు యశ్ దయాల్. ఇప్పటివరకు 12 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల్లో 45 వికెట్లు, లిస్ట్ఏ క్రికెట్లో 14 మ్యాచ్‌లకు 23, 15 టీ-20 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సొంతం చేసుకున్నాడు.. బీసీసీఐ.. ఐపీఎల్ ఫ్రాంచైసీల దృష్టిని ఆకర్షించగలిగాడు.
గమ్మత్తేమిటంటే యశ్ దయాల్ తండ్రి చందర్‌పాల్ దయాల్ కూడా ఒక క్రికెటరే. 1997 డిసెంబర్ 13న ప్రయాగ్ రాజ్‌లోని కర్బాలాలో జన్మించాడు. ఐదేండ్ల వయస్సులోనే క్రికెట్ ఆడటం మొదలెట్టాడు. తండ్రి చందర్‌పాల్ తన కొడుక్కి కోచ్‌గా వ్యవహరించాడు. క్రికెట్లో మెళకువలు తండ్రి వద్దే నేర్చుకున్నాడు యశ్‌దయాల్.
తన కొడుకు మూడు, నాలుగేండ్ల వయస్సు నుంచే క్రికెట్ పట్ల ప్యాషన్ పెంచుకున్నాడు. తాను ఆడుతున్న తీరును యశ్ సునిశితంగా గమనించేవాడని చందర్‌పాల్ చెప్పాడు. చిన్నప్పుడు బ్యాట్, బంతి చేతిలో పెట్టుకునే నిద్రపోయేవాడన్నాడు. తాను కూడా ఫాస్ట్ బౌలరేనని, ఎల్లవేళలా తనను అనుసరించడానికి ప్రయత్నించేవాడన్నారు.
యశ్ దయాల్‌కు ఫాస్ట్ బౌలర్ జహీర్‌ఖాన్ స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి జహీర్‌ఖాన్‌ను, ఆయన బౌలింగ్ తీరును గమనించేవాడు. రెండు సార్లు ముంబై ఇండియన్స్ తరఫున ట్రయల్స్ జరిగినప్పుడూ తనిఖీ చేసిందీ జహీర్ఖానే. ఆయన ప్రభావం తనపై ఉందని యశ్ దయాల్ అంటున్నాడు. తనకు దేవుడిచ్చిన బహుమతి యశ్ అని చందర్‌పాల్ తెలిపాడు. ఐదేండ్ల వయస్సులోనే తనతోపాటు నెట్ ప్రాక్టీస్‌కు వచ్చే వాడని చెప్పాడు.
స్పోర్ట్స్ కోటాలో యశ్ దయాల్‌కు ఏజీ ఆఫీసులో అడిటర్ జాబ్ వచ్చింది. కానీ క్రికెట్లో తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవాలని భావిస్తున్నాడు యశ్ దయాల్. త్వరలోనే టీం ఇండియాలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నాడు.