Cricket new record | మహారాష్ట్రకు చెందిన 13 ఏండ్ల చిచ్చరపిడుగు యశ్ చావ్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ముంబై ఇండియన్స్ జూనియర్ స్కూల్ టోర్నమెంట్లో యష్ 508 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. నాగ్‌పూర్‌లో జరిగిన 40-40 ఓవర్ల మ్యాచ్‌లో యశ్ జట్టు సరస్వతీ విద్యాలయం వికెట్ నష్టపోకుండా 714 పరుగులు చేసింది. ప్రత్యర్థి సిద్ధేశ్వర్ విద్యాలయ జట్టు 5 ఓవర్లలో 9 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సరస్వతీ విద్యాలయం 705 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
యష్ చావ్దే తన ఇన్నింగ్స్‌లో 178 బంతులు ఎదుర్కొని 81 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాడు. అన్నిరకాల ఇంటర్ స్కూల్ పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లో 500, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా యష్ నిలిచాడు. ఈ విభాగంలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు చిరత్ సెలెపెరుమ పేరిట ఉంది. 2022 లో శ్రీలంకలో జరిగిన అండర్-15 మ్యాచ్‌లో చిరత్ ఇన్నింగ్స్ 553 పరుగులు చేశాడు. యష్ ఆడుతున్న సరస్వతి విద్యాలయం నుంచే విదర్భ రంజీ జట్టు ప్రస్తుత కెప్టెన్ ఫయాజ్ ఫజల్, వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ కూడా మంచి క్రికెటర్లుగా ఎదిగారు.
యష్ ఇన్నింగ్స్ ఏ ఫార్మాట్లోనైనా, ఏ వయస్సులోనైనా 500 పరుగులు దాటిన 10వది. ఇందులో ఐదుసార్లు ఈ ఫీట్‌ను భారత బ్యాట్స్‌మెన్ చేశాడు. యశ్ కంటే ముందు ప్రణవ్ ధన్వాడే (1009 నాటౌట్), ప్రియాంషు మోలియా (556 పరుగులు), పృథ్వీ షా (546 పరుగులు), దాది హవేవాలా (515) భారీ ఇన్నింగ్స్‌లు ఆడి హై స్కోర్ చేసిన భారత బ్యాట్స్మెన్లు. వీరు నలుగురు ఒకరోజు కంటే ఎక్కువ మ్యాచుల్లో ఈ పరుగులు రాబట్టారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 500 ప్లస్ పరుగులు చేసిన తొలి భారతీయుడిగా మాత్రం యష్ చావ్డే నిలిచాడు.