లార్డ్స్: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య బుధవారం లార్డ్స్ వేదికగా మొదలైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో తొలి రోజే బౌలర్లదే పైచేయి. మొదటి రోజు పేసర్లకు అనుకూలించిన లార్డ్స్ పిచ్‌పై ఇరుజట్ల పేసర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను సఫారీ పేసర్లు కగిసొ రబాడా (5/51), మార్కో యాన్సెన్ (3/49) బెంబేలెత్తించడంతో ఆ జట్టు 56.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌట్ అయింది. వెబ్‌స్టర్ (92 బంతుల్లో 72, 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66, 10 ఫోర్లు) ఆదుకోకుంటే ఆసీస్ పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. ఆ జట్టులో ఈ ఇద్దరూ మినహా కనీసం 25 పరుగుల మార్కునూ ఎవరూ చేరుకోలేకపోయారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా సైతం తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 22 ఓవర్లు ఆడి 43/4 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ టెంబ బవుమా (3*), బెడింగ్హమ్ (8*) క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆటలో 14 వికెట్లు నేలకూలగా అందులో ఇరుజట్ల పేసర్లకే 12 వికెట్లు దక్కడం గమనార్హం.
సఫారీ పేసర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లను తమ పేస్‌తో బెంబేలెత్తించారు. తొలి మూడు ఓవర్ల దాకా ఆసీస్ పరుగుల ఖాతానే తెరవలేదు. రబాడా నిప్పులు చెరిగే బంతులకు ఖవాజా వద్ద సమాధానమే లేకుండా పోయింది. 20 బంతులెదుర్కున్న అతడు.. రబాడానే వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి స్లిప్స్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇవ్వడంతో కంగారూలు తొలి వికెట్ కోల్పోయారు. అదే ఓవర్లో రబాడా.. మూడో స్థానంలో వచ్చిన గ్రీన్ (4)నూ పెవిలియన్ చేర్చి ఆసీస్‌కు డబుల్ షాకులిచ్చాడు. రబాడా వేసిన బంతిని గ్రీన్ డిఫెండ్ చేయబోయినా అది కాస్తా బ్యాట్ ఎడ్జ్‌కు తాకి స్లిప్స్ దిశగా వెళ్లింది. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని సెకండ్ స్లిప్‌లో మార్క్మ్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత స్మిత్, లబూషేన్ (17) కలిసి 11 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. కానీ యాన్సెన్ 18వ ఓవర్లో అద్భుతమైన డెలివరీతో లబూషేన్‌ను బోల్తా కొట్టించాడు. అతడే లంచ్‌కు కొన్ని నిమిషాల ముందు ట్రావిస్ హెడ్నూ ఔట్ చేయడంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.
సాఫీగా సాగుతున్న ఆసీస్ ఇన్నింగ్స్‌కు 42వ ఓవర్లో మార్క్మ్ షాకిచ్చాడు. బవుమా చేతినుంచి బంతినందుకున్న మార్క్మ్.్ర. తను వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి స్మిత్‌ను ఔట్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌కు ఇది కీలక మలుపు. స్మిత్ నిష్క్రమణ తర్వాత అలెక్స్ క్యారీ (23)తో కలిసి వెబ్‌స్టర్ కొంతసేపు పోరాడాడు. ఈ క్రమంలో అతడి ఫిఫ్టీ కూడా పూర్తయింది. టీ విరామం అనంతరం.. మహారాజ్ ఓవర్లో క్యారీ క్లీన్‌బౌల్డ్ అవగా రబాడా లోయరార్డర్ పనిపట్టాడు. అతడు వరుస ఓవర్లలో కమిన్స్ (1), వెబ్‌స్టర్, స్టార్క్ (1)ను పెవిలియన్‌కు పంపి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై దక్షిణాఫ్రికా సైతం తడబాటుకు గురైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మార్క్మ్‌న్రు క్లీన్‌బౌల్డ్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. అతడే వేసిన 9వ ఓవర్లో రికెల్టన్ (16).. ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 44 బంతులాడిన మల్డర్ (6)ను కమిన్స్ బౌల్డ్ చేశాడు. స్టబ్స్ (2)ను హాజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు.
67/4తో లంచ్ తర్వాత ఆటను ప్రారంభించిన ఆసీస్.. రెండో సెషన్లో కాస్త పుంజుకుంది. అప్పటికే క్రీజులో కుదురుకున్న స్మిత్.. వెబ్‌స్టర్ అండగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. ఈ ఇద్దరూ సఫారీ పేస్ బలగాన్ని 20 ఓవర్ల పాటు నిలువరించారు. రబాడా 33వ ఓవర్లో బౌండరీతో స్మిత్.. అర్ధ శతకం పూర్తయింది. ఇంగ్లండ్ గడ్డపై స్మిత్‌కు ఇది 18వ హాఫ్ సెంచరీ. వెబ్‌స్టర్ కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో కంగారూల స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 56.4 ఓవర్లలో 212 ఆలౌట్ (వెబ్‌స్టర్ 72, స్మిత్ 66, రబాడా 5/51, యాన్సెన్ 66);
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 22 ఓవర్లలో 43/4 (రికెల్టన్ 16, బెడింగ్హమ్ 8, స్టార్క్ 2/10,హాజిల్‌వుడ్ 1/10)