మనదేశంలో అత్యంత ప్రాచీనమైన క్రీడగా గుర్తింపు ఉన్న రెజ్లింగ్‌కు భారత్‌లో ఘనమైన వారసత్వం ఉంది. నాటి మహాభారత కాలం (మల్ల యుద్ధం) నుంచి నేటి 21వ శతాబ్ది దాకా ఈ క్రీడకు ఉన్న క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. విశ్వక్రీడల్లో మనకు వ్యక్తిగత విభాగంలో తొలి పతకం అందించిన కేడీ జాదవ్ ఓ మల్ల యోధుడే. 2008 నుంచి జరుగుతున్న ప్రతి ఒలింపిక్స్‌లోనూ పతకం సాధిస్తూ మన దేశం పరువు నిలుపుతున్న క్రీడ కూడా ఇదే. ఈసారీ మనకు కచ్చితంగా మెడల్స్ వస్తాయని భారీ అంచనాలున్న క్రీడల్లో రెజ్లింగ్ కూడా ఒకటి. కానీ గడిచిన రెండేండ్లుగా భారత రెజ్లింగ్‌లో జరిగిన రచ్చ రెజ్లర్లను మానసికంగా దెబ్బతీసిన నేపథ్యంలో మన మల్ల యోధులు పతక పట్టు పట్టగలరా?
Wrestling | ఢిల్లీ: సుదీర్ఘ భారత ఒలింపిక్ చరిత్రలో మనదేశానికి వ్యక్తిగత విభాగంలో వచ్చిన తొలి పతకం రెజ్లింగ్దే. 1952లో హెల్సింకి(ఫిన్లాండ్) ఒలింపిక్స్‌లో రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత మళ్లీ 56 ఏండ్లకు గానీ ఈ క్రీడలో మనకు పతకం రాలేదు. 2008 బీజింగ్‌లో సుశీల్ కుమార్ కాంస్యం గెలిచాక నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లోనూ భారత్ పతకం నెగ్గింది. లండన్ (2012)లో సుశీల్ కాంస్యాన్ని రజతంగా మార్చాడు. అదే ఎడిషన్‌లో యోగేశ్వర్ దత్ కాంస్యం గెలుచుకోగా 2016 రియోలో సాక్షి మాలిక్ కాంస్యాన్ని తెచ్చింది. ఇక టోక్యోలో బజరంగ్ పునియా, రవి దహియా పతకాలతో సత్తా చాటి ఆ ఆనందాన్ని ‘డబుల్’ చేశారు. తాజాగా పారిస్‌లోనూ ఇవే ఫలితాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి అమన్సెహ్రావత్, వినేశ్ ఫోగట్, అంతిమ్ పంగల్, అన్షు మాలిక్, నిషా దహియా, రీతికా హుడా రూపంలో ఆరుగురు రెజ్లర్లు బరిలో నిలిచారు.
ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి కోటా దక్కించుకున్న ఏకైక పురుష రెజ్లర్ అమన్. 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగనున్న అమన్.. గత ఒలింపిక్స్ మెడలిస్ట్ రవి దహియా స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. అమన్ బలం అతడి సామర్థ్యం అంతకు తగ్గ ఓర్పు. ఆరు నిమిషాల పాటు బౌట్లో నిలిచాడంటే అమన్‌ను ఆపడం ఎవరితరమూ కాదు. అయితే వ్యూహాల అమలు, టెక్నిక్‌లో లోపంతో అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల హంగేరి వేదికగా ముగిసిన ర్యాంకింగ్ సిరీస్‌లోనూ అది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక వ్యూహం విఫలమైతే ‘ప్లాన్ బీ’ లేకపోవడం అతడికి మైనస్. ఉజ్బెకిస్థాన్ రెజ్లర్ల నుంచి అమన్‌కు కఠిన సవాల్ ఎదురుకానుంది.
భారత అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా ఉండే వినేశ్ బలం ఆమె డిఫెన్స్‌తో పాటు అంతే సమానంగా దూకుడుగా విరుచుకుపడే తత్వం. ఈ ఏడాది ఆమె ఆశ్చర్యకరంగా తన బరువు విభాగాన్ని 53 కిలోల నుంచి 50 కిలోలకు కుదించుకుంది. ఇదే ఆమెకు అతిపెద్ద సవాల్. గతేడాది రెజ్లర్ల పోరాటాన్ని ఆమె ముందుండి నడిపించింది. అప్పుడే ఆమె కెరీర్ ముగింపు దశకు చేరుకుందన్న వార్తలు వినిపించినా తర్వాత తనను తాను మెరుగుపరుచుకుని ఒలింపిక్స్ కోసం సిద్ధమైంది. వినేశ్‌కు ఇదే చివరి ఒలింపిక్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది ఆసక్తికరం.
జూనియర్ స్థాయిలో సంచలన విజయాలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అన్షు ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. గాయాలు ఆమెను తరుచూ వేధించాయి. బౌట్ మొదలవగానే ప్రత్యర్థులపై దూకుడుగా అటాక్ చేయడం అన్షు బలం. టోక్యో ఒలింపిక్స్ సమయంలో ఆమెకు అంతగా అనుభవం లేకున్నా ఇప్పుడు ఆమె చాలా సీనియర్ ఈవెంట్స్‌లో పాల్గొని రాటుదేలింది. అయితే ఒలింపిక్స్‌కు ముందే ఆమె భుజం గాయంతో బాధపడిందని వార్తలు వచ్చినా దానిని ఆమె కొట్టిపారేసింది. దీంతో అన్షు ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి.
‘ఫైర్‌బ్రాండ్ రెజ్లర్’గా గుర్తింపు దక్కించుకున్న ఈ యువ చిచ్చరపిడుగు భారత్ నుంచి పారిస్ కోటా దక్కించుకున్న తొలి రెజ్లర్. అంతిమ్ అతిపెద్ద బలం చురుకుతనం. ప్రత్యర్థుల పట్టు నుంచి ఆమె తేలికగా తప్పించుకుంటుంది. దూకుడు ఆమెకున్న సహజ లక్షణం. అయితే గాయం కారణంగా ఆమె ఆసియా క్రీడలతో పాటు గతేడాది ముగిసిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొనలేదు. సరైన సన్నద్ధత లేకపోవడం ఆమెకు అతిపెద్ద మైనస్.
అంచనాలే లేకున్నా పారిస్ బెర్తును దక్కించుకున్న నిషా దూకుడైన ఆట శైలికి పెట్టింది పేరు. బౌట్లో బెరుకు లేకుండా ఉండటం ఆమెకు కలిసొచ్చేదే. అయితే భారీ ఈవెంట్స్‌లో మాత్రం నిలకడగా రాణించకపోవడం ఆమె బలహీనత. బౌట్ మొదలైనప్పుడు దూకుడుగా ఉండే నిషా ఆ తర్వాత పట్టు కోల్పోతూ గతంలో చాలా మ్యాచ్‌లు చేజార్చుకుంది. బౌట్ చివరికి చేరుకునే సమయానికి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ బలహీనత వల్లే ఆమె స్టార్‌గా వెలుగొందలేకపోతోంది.
ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ వారిని ఓడించడం రితికాకు వెన్నతో పెట్టిన విద్య. అనుభవజ్ఞులైన రెజ్లర్లను సైతం తన ‘పట్టు’లో బంధించేస్తుంది. పవర్, టెక్నిక్ పుష్కలంగా ఉన్న రితికాకు బౌట్ చివరి నిమిషాల్లో పాయింట్లు సాధించే అలవాటు ఉంది. ఇదే క్రమంలో ఏకాగ్రత కోల్పోయి పాయింట్లను కోల్పోయే ప్రమాదమూ లేకపోలేదు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ గతేడాది పలువురు మల్ల యోధులు చేసిన ఆందోళన దేశ క్రీడాచరిత్రలోనే ఓ సంచలనం. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఆధ్వర్యంలో నడిచిన ఈ ఆందోళన.. దేశ పాలకులను సైతం కదిలించింది. బ్రిజ్ భూషణ్‌ను తప్పించి కొత్త అధ్యక్షుడి నియామకం, ఆ తదనంతరం జరిగిన పరిణామాలు రెజ్లర్లను మానసికంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది జనవరిలో ఎట్టకేలకు ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడ్డా.. సుమారు 15 నెలల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి టోర్నీ లేకుండా గడిపిన రెజ్లర్లు విశ్వక్రీడల్లో ఏ మేరకు సత్తా చాటగలరనేది ఈ ఆరుగురి ముందున్న అతిపెద్ద సవాలు.