WPL | లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న గుజరాత్ జెయింట్స్.. టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జెయింట్స్ దుమ్మురేపి పాయింట్ల పట్టికలో ముంబైని వెనక్కినెట్టి రెండో స్థానానికి దూసుకొచ్చింది. హర్లీన్ డియోల్ (49 బంతుల్లో 70 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (44), డాటిన్ (24) విజృంభించడంతో ఢిల్లీ నిర్దేశించిన 178 పరుగుల ఛేదనను ఆ జట్టు మరో 3 బంతులు మిగిలుండగానే దంచేసి ప్లేఆఫ్స్ బెర్తుకు మరింత చేరువైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్‌కు సారథి మెగ్ లానింగ్ (57 బంతుల్లో 92, 15 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలీ వర్మ (27 బంతుల్లో 40, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టారు. హర్లీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు లానింగ్, షెఫాలీ అదిరిపోయే శుభారంభాన్ని అందించడంతో క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. ఈ ఇద్దరూ మొదటి వికెట్‌కు 8.6 ఓవర్లలోనే 83 పరుగులు జోడించారు. డాటిన్ వేసిన తొలి ఓవర్లోనే లానింగ్ మూడు బౌండరీలు బాదింది. కాశ్వీ రెండో ఓవర్లో షెఫాలీ 4, 4, 6తో 14 పరుగులు రాబట్టింది. గార్డ్నర్ 8వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదిన షెఫాలీ.. మేఘనా సింగ్ 9వ ఓవర్లో లిచ్‌ఫీల్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. షెఫాలీ నిష్క్రమించినా లానింగ్ దూకుడు ఆపలేదు. కన్వర్ 12వ ఓవర్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్ బాది 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసింది. జొనాసెన్ (9), రోడ్రిగ్స్ (4) విఫలమైనా లానింగ్ బ్యాట్ ఝుళిపించింది. అయితే ఆఖర్లో 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఆమె.. 20వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయింది.
ఛేదనలో గుజరాత్ రెండో ఓవర్లోనే హేమలత (1) వికెట్‌ను కోల్పోయింది. కానీ మూనీ, హర్లీన్ మాత్రం ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కాప్ 5వ ఓవర్లో మూనీ ఓ బౌండరీ కొట్టగా హర్లీన్ రెండు ఫోర్లు సాధించింది. సదర్లాండ్ 9వ ఓవర్లోనూ ఈ ఇద్దరూ మూడు సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మిన్ను మణి 12వ ఓవర్లో విడదీయడంతో 85 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శిఖా పాండే 16వ ఓవర్లో తొలి బంతినే బౌండరీకి తరలించిన హర్లీన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసింది. కానీ ఇదే ఓవర్లో గార్డ్నర్ (22) భారీ షాట్ ఆడబోయి మిన్ను మణి చేతికి చిక్కింది. చివరి 3 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 32 పరుగులు అవసరం కాగా జొనాసెన్ ఓవర్లో డాటిన్(24) 4, 6, 4తో విజృంభించింది. కానీ జొనాసెన్ అదే ఓవర్లో డాటిన్, లిచ్ఫిల్డ్ను ఔట్ చేయడంతో గుజరాత్ శిబిరంలో ఆందోళన కలిగింది. కానీ హర్లీన్, కాశ్వీ(9 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశారు.
ఢిల్లీ క్యాపిటల్స్: 20 ఓవర్లలో 177/5 (లానింగ్ 92, షెఫాలీ 40, మేఘనా 3/35, డాటిన్ 2/27);
గుజరాత్ జెయింట్స్: 19.3 ఓవర్లలో 178/5 (హర్లీన్ 70 నాటౌట్, మూనీ 44, పాండే 2/31, జొనాసెన్ 2/38)