WPL | ముంబై: అమ్మాయిల ధనాధన్ క్రికెట్‌కు రంగం సిద్ధమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల 14 నుంచి మార్చి 15 దాకా నెల రోజుల పాటు పొట్టి క్రికెట్ వినోదాన్ని డబ్ల్యూపీఎల్ అందించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం డబ్ల్యూపీఎల్-3 షెడ్యూల్‌ను ప్రకటించింది. 20 లీగ్ మ్యాచ్‌లు, 2 నాకౌట్ మ్యాచ్‌లు (మొత్తం 22) జరుగబోయే ఈ మెగా టోర్నీని వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై నగరాలలో నిర్వహించనున్నారు. గతేడాది ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో ఈ టోర్నీని నిర్వహించగా తాజాగా ఢిల్లీ స్థానంలో వడోదర, లక్నో చేరాయి. ఫిబ్రవరి 14న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 14న బరోడా (వడోదర)లో కొత్తగా నిర్మించిన బీసీఏ స్టేడియంలో తొలి ఆరు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐదు జట్లూ ఇక్కడ నుంచే తమ టైటిల్ వేటను మొదలుపెడతాయి. ఫిబ్రవరి 21 నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యే ఈ టోర్నీలో మార్చి 1 వరకు 8 మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 3 నుంచి 8 దాకా లక్నో.. 4 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుండగా 10 నుంచి టోర్నీ ముంబైలో జరుగుతుంది. ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌ల అనంతరం 13న ఎలిమినేటర్, 15న ఫైనల్ మ్యాచ్‌కు ముంబైలోని సీసీఐ స్టేడియం వేదిక కాబోతోంది. డబుల్ హెడర్స్, మధ్యాహ్నం మ్యాచ్‌లు ఏమీ లేని డబ్ల్యూపీఎల్-3లో మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటల నుంచి మొదలవనున్నాయి.