WPL 2024, UP vs GG | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచిన యూపీ వారియర్స్ – గుజరాత్ జెయింట్స్‌ల మధ్య నేడు మ్యాచ్ జరుగబోతుంది. మూడు మ్యాచ్‌లు ఆడిన యూపీ.. ఎట్టకేలకు గత మ్యాచ్‌లో విజయ బోణీ కొట్టగా రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఇంకా ఖాతా తెరవలేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ జెయింట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన యూపీ.. రెండ్రోజుల క్రితం ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. లోయరార్డర్లో వచ్చే కిరణ్ నవ్గిరె.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి ఓపెనర్‌గా బరిలోకి దిగి వీరబాదుడు బాదడంతో ఆ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. గుజరాత్‌తోనూ ఇదే జోరు కొనసాగాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్ చిత్తుగా ఓడింది. ముంబై, ఆర్సీబీ చేతిలో గుజరాత్ అవమానకర ఓటములను మూటగట్టుకుంది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టును దారుణంగా దెబ్బతీస్తోంది. కెప్టెన్ బెత్ మూనీ బ్యాటర్‌గానే గాక సారథిగా కూడా ప్రభావం చూపడం లేదు. లిచ్‌ఫీల్డ్, వేదా కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్నర్ వంటి బ్యాటర్లు ఉన్నా ఆ జట్టు 120 పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో అయినా గుజరాత్ బోణీ కొడుతుందో లేదో చూడాలి.
తుది జట్లు : ఈ మ్యాచ్‌లో యూపీ తరఫున మెక్‌గ్రాత్ స్థానంలో లంక ప్లేయర్ చమారీ ఆటపట్టు బరిలోకి దిగుతోంది. గుజరాత్లో తహుహు స్థానంలో లారా వోల్వార్డ్ట్, వేదా స్థానంలో మన్నత్ కశ్యప్ తుది జట్టులో ఉన్నారు.
యూపీ వారియర్స్ : అలిస్సా హీలి (కెప్టెన్), కిరణ్ నవ్గిరె, చమారి ఆటపట్టు, గ్రేస్ హరీస్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, పూనమ్ ఖేమ్నర్, సోఫీ ఎకిల్‌స్టోన్, అంజలి సర్వని, గుహర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్
గుజరాత్ జెయింట్స్ : బెత్ మూనీ (కెప్టెన్), లారా వోల్వార్డ్ట్, హర్లీన్ డియోల్, ఫొబె లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, హేమలత,స్నేహ్ రాణా, క్యాథ్రిన్ బ్రైస్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, మన్నత్ కశ్యప్