దుబాయ్: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండ్రోజుల క్రితమే లార్ట్స్లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌తో 2023-25 సైకిల్‌కు తెరపడింది. మూడో ఎడిషన్ విజేతగా దక్షిణాఫ్రికా నిలవగా.. ఫైనల్ ముగిసిన మూడు రోజులకే డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ (2025-27) మొదలవనున్నది. ఈనెల 17 నుంచి శ్రీలంక.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో గాలె వేదికగా జరుగబోయే టెస్టుతో నాలుగో ఎడిషన్ మొదలవనుంది. 9 దేశాలు పాల్గొననున్న ఈ ఎడిషన్‌లో మొత్తం 71 టెస్టులు జరుగనున్నాయి. కొత్త సైకిల్లోనూ ఆస్ట్రేలియా అత్యధికంగా 22 టెస్టులు ఆడనుండగా మరో అగ్రశ్రేణి జైట్టెన ఇంగ్లండ్ 21 టెస్టులు ఆడనుంది. వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు.. 18 టెస్టులు ఆడుతుంది. రోహిత్ శర్మ తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఈనెల 20 నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకాబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2025-27 టైటిల్ వేటను ఆరంభించనుంది. నాలుగో ఎడిషన్‌లో ఒక్కో జట్టు ఆరు సిరీస్‌లు (స్వదేశంలో 3, విదేశాల్లో 3) ఆడనుంది.
గత ఎడిషన్‌తో పోల్చితే ఒక మ్యాచ్ తక్కువగా ఆడనున్న భారత జట్టు.. స్వదేశంలో 9, విదేశాల్లో 9 టెస్టులు ఆడనున్నది. సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో తలా రెండు మ్యాచ్‌లు ఆడనున్న మెన్ ఇన్ బ్లూ.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. విదేశాల్లో ఇంగ్లండ్‌తో ఐదు.. శ్రీలంక, న్యూజిలాండ్‌తో తలా రెండు టెస్టులు ఆడుతుంది.
టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు గాను ఐసీసీ నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్స్ కొత్త ఎడిషన్‌లో కొన్ని హైప్రొఫైల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు తోడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. ఇక మూడో ఎడిషన్ విజేత అయిన దక్షిణాఫ్రికా.. ఈ ఏడాది అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో జరుగబోయే టెస్టులతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. గత ఎడిషన్‌లో 12 మ్యాచ్‌లే ఆడిన సఫారీలు.. నాలుగో ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లు ఆడనున్నారు.