ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు సెమీస్‌లో షాకిచ్చిన ఇటలీ యువ కెరటం సిన్నెర్.. అదే జోష్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుదిపోరులో మెద్వెదెవ్‌ను మట్టికరిపిస్తూ.. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన పోరులో తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత కూడా పట్టు వదలకుండా ప్రయత్నించిన సిన్నెర్ విజయనాదం చేశాడు.
మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నయా చాంపియన్ అవతరించాడు. దశాబ్ద కాలంగా బిగ్త్రి (ఫెదరర్, నాదల్, జొకోవిచ్) చేతుల్లోనే తిరిగిన ట్రోఫీని ఈ సారి ఇటలీకి చెందిన 22 ఏండ్ల కుర్రాడు జానిక్ సిన్నెర్ హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నెర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3తో మూడో సీడ్ మెద్వెదెవ్పై విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో ఐదో సీడ్ రుబ్లెవ్‌పై గెలిచిన సిన్నెర్ సెమీస్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. 3 గంటల 44 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత సిన్నెర్ అద్భుతంగా పుంజుకోగా.. ఆరోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన మెద్వెదెవ్ ఐదోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు.
ఇందులో తొలి రెండు సెట్లు గెలిచిన తర్వాత ప్రత్యర్థికి వరుసగా మూడు సెట్లు కోల్పోవడం మూడోసారి. మెల్బోర్న్ సెంటర్ కోర్ట్‌లో జరిగిన ఫైనల్లో సిన్నెర్ 14 ఏస్‌లు కొట్టి 5 డబుల్ ఫాల్ట్స్ చేస్తే.. మెద్వెదెవ్ 11 ఏస్‌లు బాది 57 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. సిన్నెర్ 50 విన్నర్లు సంధించగా.. మెద్వెదెవ్ 44 విన్నర్లు కొట్టి 4 బ్రేక్ పాయింట్లు సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సిన్నెర్ రికార్డుల్లోకి ఎక్కగా.. 2008లో తొలిసారి జొకోవిచ్ ఆస్ట్రేలియా టైటిల్ గెలిచిన తర్వాత విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ‘ఇది చాల పెద్ద టోర్నీ. ఇందులో విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా. నాకింకా 22 ఏండ్లే. మున్ముందు కూడా ఇలాంటి ప్రదర్శనలు పునరావృతం చేయాలనుకుంటున్నా’ అని మ్యాచ్ అనంతరం సిన్నెర్ పేర్కొన్నాడు. టైటిల్‌తో పాటు సిన్నెర్‌కు 17.22 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.