బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానాన్ని మరో వ్యక్తి భర్తీ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ.. మరో టర్మ్ కోసం గంగూలీ పోటీ పడటం లేదని సమాచారం. దీంతో గంగూలీ స్థానంలో బీసీసీఐ అధ్యక్ష పీఠంపై ఎవరూ కూర్చుంటారా? అనే ప్రశ్న తలెత్తింది.
ఈ క్రమంలో 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బీసీీసఐ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న బిన్నీ.. ఈసారి బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు. బీసీసీఐ వెబ్సైటులో ఉంచిన డ్రాఫ్ట్ ఎలక్షన్ రోల్స్‌లో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ప్రతినిధిగా బిన్నీ పేరును నమోదు చేశారు.
దీంతో బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో బిన్నీ ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. ఐసీసీ చైర్మన్ పదవి కోసం భారత్ తరఫున పోటీ పడనున్నారట. అయితే బీసీసీఐ సెక్రటరీ పదవిలో మాత్రం జైషానే కొనసాగే అవకాశం ఉందని సమాచారం.