హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజలపై విద్యుత్తు భారాన్ని మోపుతూ, రాష్ట్రంలో కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి రూ.3వేల కోట్ల భారీ విదేశీ బొగ్గు స్కామ్‌కు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వదేశంలోనే అత్యంత చౌకగా, నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ.. కేవలం వేల కోట్ల ముడుపుల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విదేశీ బొగ్గు దిగుమతికి మొగ్గుచూపుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా బొగ్గు కొరత, విద్యుత్తు కోతలు సృష్టించి, ఆ సాకుతో ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి ఏకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం సింగరేణి నుంచి లభించే స్వదేశీ బొగ్గు ధర టన్నుకు సగటున రూ.3,800 మాత్రమేనని, దీనిని పకనబెట్టి, టన్నుకు ఏకంగా రూ.10వేల నుంచి రూ.16వేల వరకు పెట్టి విదేశీ బొగ్గును కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ బొగ్గు కాంట్రాక్టర్ ఈ వ్యవహారంలో కీలక రాయబారిగా మారి ఇంధనశాఖపై, ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి వద్ద నాణ్యమైన గ్రేడ్-9 బొగ్గు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడాన్ని దాచిపెట్టి, సింగరేణి బొగ్గు నాసిరకమంటూ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.