హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను కాంగ్రెస్ సర్కార్ రైతులకు తిరిగి ఇవ్వకుండా, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ భూములను బాధిత రైతులకు పూర్తిగా వాపస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని విమర్శించారు. రైతులు తమ భూములను తిరిగి ఇవ్వాలని పోరాటాలు చేస్తుంటే, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా అవే భూములను ఎకరానికి రూ.4 కోట్ల చొప్పున విక్రయించేందుకు సిద్ధపడిందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ డీలర్ చేతిలో పెట్టారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తంచేశారు.
తుగ్లక్ ప్రభుత్వమిది
విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నదని కేటీఆర్ మండిపడ్డారు. టన్నుకు కేవలం రూ.3,800కే లభించే సింగరేణి బొగ్గును పకనపెట్టి, ఇతర దేశాల నుంచి టన్నుకు రూ.9,000 చెల్లించి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. దక్షిణాదిలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగి ఉండి, పొరుగు రాష్ర్టాలైన ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రకు బొగ్గు సరఫరా చేసే సింగరేణి సంస్థను విస్మరించడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో సింగరేణి బొగ్గుతో టీఎస్ జెన్కో ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించామని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాల కారణంగా ప్రజలపై మోయలేని భారం పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.