మాంటెసిల్వానో(ఇటలీ): మరో తెలంగాణ ఆణిముత్యం..ప్రపంచ వేదికపై తళుక్కుమంది. ఇటలీలోని మాంటెసిల్వానో వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ అండర్-8 చెస్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన అదుల్లా దివిత్రెడ్డి విజేతగా నిలిచాడు. 1784 ఎలో రేటింగ్ కల్గిన దివిత్ మొత్తం 11 పాయింట్లకు గాను 9 పాయింట్లు దక్కించుకుని పసిడి పతకం కైవసం చేసుకున్నాడు.
టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ 8 ఏండ్ల చిచ్చరపిడుగు వరుస విజయాలతో ప్రపంచ విజేతగా నిలిచాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన దివిత్ భారత భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఇదే టోర్నీలో సాత్విక్ స్వేన్ రజతం సొంతం చేసుకున్నాడు.