సిడ్నీ: రాబోయే రోజుల్లో రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నా .. దాంట్లో ఆశ్చర్యం ఏమీ ఉండబోదని మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నారు. శుభమన్ గిల్ లాంటి యువ క్రికెటర్లు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని చివరి అయిదు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 10 రన్స్ కూడా చేయలేకపోయాడు. రేపటి నుంచి ప్రారంభం అయ్యే సిడ్నీ టెస్టుకు ముందు ఇవాళ జరిగిన మీడియా సమావేశానికి రోహిత్ రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
టెస్టు కెరీర్‌పై రోహిత్ ఓ నిర్ణయం తీసుకుంటాడని, ఒకవేళ అతను రిటైర్ అయినా షాక్ అయ్యేది ఏమీ లేదని, ఎందుకంటే అతనే యువకుడిగా మారడం లేదన్నారు. శుభమన్ గిల్ గత ఏడాది 40 యావరేజ్‌తో బ్యాటింగ్ చేశాడని, అలాంటి ప్లేయర్ వృధాగా ఉన్నాడని, ఇలాంటి సందర్భంలో రోహిత్ రిటైర్ అయినా ఆశ్చర్యం లేదన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లో రోహిత్ తన ఫీట్ మూమెంట్‌తో ఇబ్బందిపడినట్లు రవిశాస్త్రి తెలిపాడు.
ఒకవేళ సిడ్నీ టెస్టులో ఆడితే, అప్పుడు రోహిత్ ప్రత్యర్థి బౌలర్లను టార్గెట్ చేసి పరుగుల వరద సృష్టించాలన్నాడు. అయిదో టెస్టును గెలిచి, సిరీస్‌ను సజీవంగా ఉంచాలన్నాడు.