ఓపెన్ ఎరాలో తనకు తిరుగులేదని చాటుతూ.. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. గ్రాస్ కోర్ట్, క్లే కోర్ట్ అనే తేడా లేకుండా తన దూకుడు కొనసాగించిన జొకో..పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. నాదల్ (22) రెండో స్థానానికి చేరాడు. హోరాహోరీగా సాగిన పోరులో దుమ్మురేపిన జొకో.. రోలాండ్గారోస్లో సింహనాదం చేయగా.. రూడ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
Novak Djokovic | టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో తన ఆరాధ్య ఆటగాళ్లుగా అభివర్ణించిన ఫెదరర్, నాదల్‌ను వెనక్కి నెడుతూ.. నొవాక్ జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా జొకో.. తన గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 23కు పెంచుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ జొకోవిచ్ 7-6 (7/1), 6-3, 7-5తో నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్‌పై విజయం సాధించాడు. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థులకు కేవలం రెండు సెట్లు మాత్రమే కోల్పోయి తుదిపోరుకు చేరుకున్న ఈ 36 ఏండ్ల వెటరన్.. ఫైనల్లో అసలు సిసలు గేమ్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. 3 గంటలా 13 నిమిషాల పాటు సాగిన పోరులో జొకో.. 11 ఏస్‌లు సంధించి 52 విన్నర్లు కొట్టాడు. మరోవైపు 4 ఏస్‌లకే పరిమితమైన రూడ్.. 31 విన్నర్లతో సరిపెట్టుకున్నాడు.
1 పురుషుల సింగిల్స్‌లో అత్యధిక (23) గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా జొకో రికార్డుల్లోకెక్కాడు. నాదల్ (22) రెండో స్థానంలో ఉన్నాడు.
పురుషుల సింగిల్స్‌లో అత్యధిక (23) గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ప్లేయర్‌గా జొకో రికార్డుల్లోకెక్కాడు. నాదల్ (22) రెండో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా ఓపెన్: 10 (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023)
ఫ్రెంచ్ ఓపెన్: 3 (2016, 2021, 2023)
వింబుల్డన్: 7 (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022)
యూఎస్ ఓపెన్: 3 (2011, 2015, 2018)
తొలి సెట్లో తీవ్ర ప్రతిఘటన కనబర్చిన 24 ఏండ్ల రూడ్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనై ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకున్నాడు. రూడ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా.. మూడింట్లోనూ అతడు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఈ క్రమంలో జొకో.. అతి పెద్ద వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా నిలిచాడు. రోలాండ్ గారోస్‌లో జొకోవిచ్‌కు ఇది మూడో టైటిల్. గతంలో 2016, 2021లో ఈ సెర్బియా వీరుడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను మూడేసి సార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.గత 20 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్‌కు ఇది 11వ టైటిల్.