యూఏఈ వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. స్పిన్‌కు అనుకూలించే షార్జాలో జరిగిన మొదటి రోజు రెండు ‘లో స్కోరింగ్’ మ్యాచ్‌లలో బౌలర్లు వికెట్ల పండుగ చేసుకోగా బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ను ఓడించి గెలుపు బోణీ చేసింది. మరో మ్యాచ్‌లో పాకిస్థాన్.. శ్రీలంకను ఓడించి ఈ టోర్నీని విజయంతో మొదలుపెట్టింది. రెండు మ్యాచ్‌లలోనూ స్పిన్నర్లకే ఎక్కువ వికెట్లు దక్కాయి.
T20 World Cup | షార్జా: మహిళల ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ బోణీ కొట్టాయి. ఇరు మ్యాచ్‌లలోనూ స్పిన్నర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో ఆసియా జట్లు శుభారంభం చేశాయి. గురువారం షార్జా వేదికగా గ్రూప్-బీలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 16 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో విఫలమైనా ఆ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా శుభారంభం చేసింది. ఇక గ్రూప్-ఏలో శ్రీలంకతో తలపడ్డ పాకిస్థాన్ కూడా స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టి 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ సారథి ఫాతిమా సనా బ్యాట్ (30)తో పాటు బంతి (2/10)తోనూ రాణించి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఛేదనలో లంక కూడా తడబడి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో నీలాక్షి డి సిల్వ (22), విష్మి గుణరత్నె (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. సనాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ జట్టులో సోభనా మొస్త్రి (38 బంతుల్లో 36, 2 ఫోర్లు), శాంతి రాణి (32 బంతుల్లో 29, 3 ఫోర్లు) రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియ హర్లీ (3/13) ఆకట్టుకుంది. 120 పరుగుల ఛేదనలో స్కాట్లాండ్ 103 పరుగుల వద్దే ఆగిపోయింది. ఓపెనర్ సారా బ్రైస్ (52 బంతుల్లో 49 నాటౌట్, 1 ఫోర్) చివరిదాకా పోరాడినా తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. బంగ్లా బౌలర్లు రితూ మోనీ (2/15) మరుఫా అక్తర్ (1/17), నహిదా అక్తర్ (1/19) స్కాట్లాండ్ను కట్టడిచేశారు. రితూకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 2014 టీ20 ప్రపంచకప్‌లో గెలిచిన తర్వాత ఈ టోర్నీలో బంగ్లాకు పదేండ్ల అనంతరం ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
ఈ ఏడాది మహిళల ఆసియా కప్ గెలిచిన ఊపు మీదున్న శ్రీలంకకు ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు రాణించడంతో పాక్ గట్టెక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్థాన్‌కు చమారీ సేన తమ బౌలింగ్‌తో చుక్కలు చూపించింది. చమారి ఆటపట్టు (3/18), సుగందిక (3/19), ప్రబోధని (3/20) తలా మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో ఫాతిమా సనా ఒక్కతే ఉన్నంతలో మెరుగ్గా ఆడింది. అనంతరం ఛేదనలో లంకేయులు క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లారు. పాక్ బౌలర్లలో సదియా ఇక్బాల్ (3/17) మూడు వికెట్లు పడగొట్టగా నశ్రా సంధు (2/15), ఒమైమ సొహైల్ (2/17) లంకను కోలుకోనీయకుండా చేశారు.
బంగ్లాదేశ్ : 20 ఓవర్లలో 119/7 (సోభనా 36, శాంతి 29, సస్కియ 3/13)
స్కాట్లాండ్ : 20 ఓవర్లలో 103/7 (సారా 49 నాటౌట్, రితూ 2/15)
పాకిస్థాన్ : 20 ఓవర్లలో 116 ఆలౌట్ (ఫాతిమా 30, నిదా 23, చమారి 3/18, సుగందిక 3/19)
శ్రీలంక: 20 ఓవర్లలో 85/9 (విష్మి 20, నీలాక్షి 22, సదియా 3/17, ఫాతిమా 2/10)