Womens T20 WC : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లకు వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. అప్పటికి ఐర్లాండ్ స్కోర్.. 54/2.
ఆ జట్టు విజయానికి 70 బంతుల్లో 102 రన్స్ కావాలి. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లకు ఐర్లాండ్ 59 రన్స్ చేయాలి. కానీ, ఆ జట్టు ఐదు పరుగులు వెనకబడి ఉంది. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు టీమిండియాను విజేతగా ప్రకటించారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధాన (87)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మాత్రమే అర్ధ శతకం (87)తో రాణించింది. షఫాలీ వర్మ (24), హర్మన్‌ప్రీత్ కౌర్ (13) మరోసారి విఫలమయ్యారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (19) మెరుపులు మెరిపించడంతో భారత్ 155 స్కోర్ చేయగలిగింది. ఐర్లాండ్ బౌలర్లలో డెలానీ మూడు వికెట్లు, ఒర్లా ప్రెండెర్‌గాస్ట్ రెండు వికెట్లు తీశారు.
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి బంతికే అమీ హంటర్ రనౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్ త్రో చేయడంతో వికెట్ కీపర్ రీచా ఘోష్ వికెట్లను గిరాటేసింది. రేణుకా సింగ్ ఐదో బంతికి ప్రెండెర్గాస్ట్ను బౌల్డ్ చేసింది. దాంతో, 5 పరుగులకే ఆ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ లారా డెలాని (17), గాబి ల్యూయిస్ (32) దూకుడుగా ఆడారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 45 బంతుల్లో 53 రన్స్ జోడించారు.