WPL | ముంబై: వచ్చే సీజన్లో తాము అట్టిపెట్టుకోబోయే క్రికెటర్ల జాబితాను మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీలు గురువారం విడుదల చేశాయి. ఐదు జట్లు దాదాపు ప్రధాన ఆటగాళ్లనంతా రిటైన్ చేసుకుని గత సీజన్లో విఫలమైన క్రికెటర్లను వేలానికి వదిలేశాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆరుగురు ఆటగాళ్లను వేలానికి వదిలేయగా ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ ఇస్సీ వాంగ్‌ను వదులుకోవడం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ లారా హరీస్, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌ను రిలీజ్ చేయగా గుజరాత్ జెయింట్స్ తమ మాజీ సారథి స్నేహ్ రాణాను వేలానికి వదిలేసింది. రిటెన్షన్ ముగియగా ఆర్సీబీ వద్ద రూ. 3.25 కోట్లు నగదుండగా ముంబై వద్ద రూ. 2.65 కోట్లు మిగిలాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అతి తక్కువగా రూ. 2.5 కోట్లు ఉండగా గుజరాత్ వద్ద అత్యధికంగా రూ. 4.4 కోట్లున్నాయి. యూపీ వారియర్స్ పర్స్‌లో రూ. 3.9 కోట్లు మిగిలాయి.