WPL | ముంబై : దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్‌లే. లీగ్ దశ మంగళవారమే ముగియగా 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది. ఇక తొలి ఎడిషన్ విన్నర్ ముంబై ఇండియన్స్.. మూడోసారి ఎలిమినేటర్ పోరుకు సిద్ధమైంది. తొలి రెండు సీజన్లలో ఘోరంగా విఫలమైనప్పటికీ సారథ్య మార్పుతో గుజరాత్ జెయింట్స్ తొలిసారిగా నాకౌట్ దశకు అర్హత సాధించింది. గురువారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబై-గుజరాత్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేత.. ఈనెల 15న ఇదే వేదికపై ఢిల్లీతో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
2024లో ఆడిన 8 మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లను గెలుచుకున్న ముంబై.. ఈ సీజన్లో గుజరాత్‌తో తలపడ్డ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా గుజరాత్ కంటే ముంబై మెరుగ్గానే ఉంది. ఈ సీజన్లో టాప్ స్కోరర్‌గా ఉన్న సీవర్ బ్రంట్.. 8 మ్యాచ్‌లలో ఏకంగా 69.33 సగటుతో 416 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ హీలి మాథ్యూస్.. బ్యాట్‌తో 227 పరుగులు సాధించడమే గాక బంతితో 14 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉంది. హర్మన్‌ప్రీత్ ఆరంభ మ్యాచ్‌లలో విఫలమైనా గత నాలుగు మ్యాచ్‌ల నుంచి నిలకడగా ఆడుతూ ఫామ్‌లోనే ఉంది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్ 14 వికెట్ల పడగొట్టడంతో పాటు బ్యాట్‌తోనూ విలువైన పరుగులు చేస్తోంది. ఎలిమినేటర్ పోరులోనూ ముంబై ఈ నలుగురు మరోసారి సత్తా చాటుతారని ఆశిస్తోంది. తొలి ఎడిషన్‌లో ఫైనల్ చేరడమే గాక కప్పు కొట్టిన ముంబై.. రెండో సీజన్లో బెంగళూరు చేతిలో ఓడిపోయింది.
బెత్ మూనీ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న గార్డ్నర్.. కెప్టెన్‌గా విజయవంతమైంది. జట్టు ఆటతీరును పూర్తిగా మార్చిన ఆమె.. కెప్టెన్‌గా అటు బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటుతోంది. ఎలిమినేటర్లోనూ ఆమె చెలరేగితే ముంబైకి తిప్పలు తప్పవు. ఫల్మలి మెరుపులు మెరిపిస్తుండగా లిచ్‌ఫిల్డ్, డాటిన్ వంటి ప్లేయర్లు గుజరాత్ సొంతం.