దుబాయ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మొదలయ్యే మెగా టోర్నీ షెడ్యూల్‌ను బుధవారం ఐసీసీ విడుదల చేసింది. వన్డే ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్ తలపడనున్నాయి. టోర్నీలో భాగంగా మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చ్, డ్యూనెడిన్, హామిల్టన్, తరంగా, వెల్లింగ్టన్ వేదికలుగా మొత్తం 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ ఎగురేసుకుపోగా భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ పట్టేయాలనే పట్టుదలతో భారత మహిళలు ఉన్నారు. తొలి మ్యాచ్ మార్చి 6న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుండగా.. అనంతరం 10న న్యూజిలాండ్, 12న వెస్టిండీస్, 16న ఇంగ్లండ్, 19న ఆస్ట్రేలియా, 22న బంగ్లాదేశ్, 27న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది జరుగాల్సిన ప్రపంచకప్‌ను కరోనా వైరస్ కారణంగా వచ్చే ఏడాది వాయిదా పడిన విషయం తెలిసిందే.