అమ్మాన్ (జోర్డాన్): ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళా రెజ్లర్లు దుమ్మురేపారు. గురువారం ఇక్కడ జరిగిన మహిళల 76 కిలోల విభాగంలో యువ రెజ్లర్ రీతికా హుడా రజతం దక్కించుకోగా 59 కిలోల కేటగిరీలో ముస్కాన్, 68 కిలోల విభాగంలో మాన్సి కాంస్యాలు నెగ్గి భారత్‌కు ఒకే రోజు మూడు పతకాలు అందించారు. 22 ఏండ్ల రీతికా.. సెమీస్‌లో 10-0తో జపాన్ రెజ్లర్ నొడొక్ యమమొటొను మట్టి కరిపించి పసిడి పోరుకు అర్హత సాధించింది.
హోరాహోరిగా జరిగిన ఫైనల్ పోరులో రీతికా.. 6-7తో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐపెరి మెడెట్ చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. ఇక ముస్కాన్.. ఆరంభ బౌట్లో అరియన్ (ఫిలిప్పీన్స్)ను ఓడించి క్వార్టర్స్ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె.. జపాన్ రెజ్లర్ సకురా ఒనిషి చేతిలో ఓడినా రెపిచేజ్ ద్వారా కాంస్య పోరుకు దూసుకెళ్లింది. కీలక పోరులో ముస్కాన్.. 4-0తో అల్జిజిన్ (మంగోలియా)ను ఓడించి కాంస్యం సాధించింది. కాంస్య పోరులో మాన్సి.. 12-2తో ఇరినా కజ్యులినా (కజకిస్థాన్)పై టెక్నికల్ సుపిరియారిటీతో గెలిచి పతకం సొంతం చేసుకుంది.