లండన్ : సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ పేరుకు తగ్గట్టుగానే అత్యంత ఉత్కంఠ నడుమ మొదలైంది. ప్రతిష్టాత్మక టోర్నీలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ టైటిల్స్ దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ కార్లొస్ అల్కరాజ్.. తొలి రౌండ్లో విజయం కోసం చెమటోడ్చక తప్పలేదు. పచ్చిక కోర్టుపై ఒకవైపు సూర్యుడు దంచికొడుతుంటే మరోవైపు అనామకుడిగా భావించిన ప్రత్యర్థి ఫాబియొ ఫనీని (ఇటలీ).. నయా స్పెయిన్ బుల్‌కు చుక్కలు చూపించాడు. ఇరువురి మధ్య 4 గంటల 37 నిమిషాల్లో ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో రెండో సీడ్ అల్కరాజ్.. 7-5, 6-7 (5/7), 7-5, 2-6, 6-1తో ఫనీనిపై విజయం సాధించాడు.
అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగినా ఫనీని పోరాటం ఆకట్టుకుంది. ప్రత్యర్థికి తలొగ్గని ఆటతీరుతో ఎప్పటికప్పుడు పుంజుకుంటూ అతడు మ్యాచ్‌ను ఐదో సెట్ వరకూ తీసుకొచ్చాడు. తొలి సెట్ నుంచే అల్కరాజ్కు దీటైన పోటీనిచ్చిన 38 ఏండ్ల ఈ ఇటలీ ప్లేయర్.. రెండో సెట్‌ను టై బ్రేక్‌తో గెలుచుకున్నాడు. మూడో సెట్ కోల్పోయినా నాలుగో సెట్లో పుంజుకుని తన పోరాటం ఇంకా మిగిలేఉందని నిరూపించాడు. అయితే ఆఖరి సెట్లో అల్కరాజ్ జూలు విదిల్చి.. వరుస పాయింట్లు గెలుచుకుని మ్యాచ్‌ను ముగించాడు.
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ సబలెంక రెండో రౌండ్‌కు ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ పోటీలలో ఈ బెలారస్ భామ.. 6-1, 7-5తో కార్సన్ బ్రన్సైన్ (కెనడా)పై అలవోక విజయం సాధించింది. ఆరో సీడ్ అమెరికన్ అమ్మాయి మాడిసన్ కీస్.. 6-7 (4/7), 7-5, 7-5తో ఎలెనా గాబ్రియెల (రొమానియా)ను చిత్తుచేసింది. ఈ టోర్నీలో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన ఓన్స్ జబెర్.. 6-7 (5/7), 0-2తో గాయం కారణంగా తప్పుకోవడంతో విక్టోరియ (బల్గేరియా) విజేతగా నిలిచింది.
మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. పురుషుల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ డేనియల్ మెద్వెదెవ్‌తో పాటు గ్రీకు వీరుడు సిట్సిపస్కు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. మెద్వెదెవ్.. 6-7 (2/7), 6-3, 6-7 (3/7), 2-6తో బెంజిమిన్ బొంజి (ఫ్రాన్స్) చేతిలో చిత్తయ్యాడు. సిట్సిపస్.. 3-6, 3-2తో గాయంతో తప్పుకున్నాడు. ఫ్రాన్సిస్ టియాఫొ.. 6-3, 6-4, 6-2తో ఎల్మర్ మొలర్ (డెన్మార్క్) ను చిత్తుగా ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు.
ఈ టోర్నీలో రెండుసార్లు టైటిల్ నెగ్గిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్ర క్విటోవ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2011, 2014లో వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటి ల్స్ గెలుచుకున్న క్విటోవ.. ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని, తన కెరీర్లో ఇదే ఆఖరి వింబుల్డన్ అని తెలిపింది.